నెల పాటు అన్ని నియమ నిబంధనలు పాటించి రంజాన్ పండుగను ఘనంగా జరుపుకోవడానికి ముస్లింలు సిద్ధమయ్యారు. శుక్రవారం పొద్దుమునిగాక చంద్రుడు కనిపించగానే హర్షం వ్యక్తం చేస్తూ పరస్పరం శుభాకాంక్షలు చెప్పుకున్నారు. ఉన్నంతలో మంచి దుస్తులు వేసుకుని శనివారం ఈద్గా మైదానంలో సామూహికంగా అల్లాను ప్రార్థించడానికి ఏర్పాట్లు చేసుకున్నారు.
కడప కల్చరల్ : రమజాన్....ప్రపంచంలోని ముస్లింలందరూ అత్యంత పవిత్రంగా భావించే పండుగ. శని వారం దేశంలో రమజాన్ (ఈదుల్ ఫితర్) పండుగను భక్తిశ్రద్ధలతో నిర్వహించుకోనున్నారు. శుక్రవారం సాయంత్రం ఆకాశంలో నెలవంక కనిపించగానే ఈద్ కా చాంద్ ముబారక్ హో’ (పండుగ శుభాకాంక్షలు) అంటూ ఒకరినొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. పలువురు యువకులు నగరంలోని పలు ప్రాంతాల్లో బాణాసంచా పేల్చి ఆనందం వ్యక్తం చేశారు. పండుగను అత్యంత ఘనంగా నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లలో లీనమయ్యారు.
ముగిసిన రోజా, తరావీ ప్రార్థనలు
నెల రోజులపాటు అన్ని నియమ నిబంధనలు పాటించి రమజాన్ శుభాలతో పునీతమయ్యే మహాభాగ్యాన్ని కలిగించినందుకు అల్లాహ్‌కు కృతజ్ఞత చెల్లిస్తూ పండుగ చేసుకోనున్నారు. ఈమాసం సందర్భంగా నెల రోజులుగా ఎంతో పవిత్రంగా కొనసాగించిన ఉపవాస దీక్ష(రోజా)లు, తరావీ ప్రార్థనలు శుక్రవారం సాయంత్రం నెలవంక కనిపించడంతో ముగిశాయి. కడప నగరంలోని అన్ని మసీదులలో మూడు రోజుల కిందటే తరావీ ప్రార్థనలలో పవిత్ర ఖురాన్ పఠనం పూర్తి చేశారు.
పండుగ గురించి ప్రకటన వెలువడగానే ఆయా మసీదు కమిటీల ప్రతినిధులు రంజాన్ సామూహిక ప్రార్థనలకోసం ఏర్పాట్లు చేపట్టారు. ముఖ్యంగా బిల్టప్ సమీపాన ఉన్న ఈద్గా-యే-అమీన్, దండు ప్రాంతంలో షాహీ ఈద్గా మైదానాలలో ప్రత్యేక ఏర్పాట్ల నిర్వహణలో బిజీ అయ్యారు.
ప్రతి ఒక్కరూ ఉన్నంతలోనే మంచి దుస్తులు ధరించ అత్తరు, పన్నీరు లాంటి సుగంధ ద్రవ్యాలతో ఈద్గాలో సమావేశమై సామూహికంగా అల్లాహ్‌కు కృతజ్ఞత చెల్లిస్తూ ‘ఈద్’ నమాజ్ చేయనున్నారు. తమ అపరాధాలను మన్నించాలని, సన్మార్గాన నడపాలని దువా చేయనున్నారు. శనివారం సామహిక ప్రార్థనలకు ముస్లింలు భారీ సంఖ్యలో తరలి వస్తారు గనుక జిల్లా మైనార్టీ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో ఆ శాఖ అధికారులు ఈ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.
ఎక్కువ మంది ముస్లింలు ఈద్గాలో ఈద్ ప్రార్థనలు నిర్వహించేందుకు ఉత్సాహం చూపుతారు. బిల్టప్ ఈద్గాలో జరిగే ప్రార్థనల్లో పెద్దదర్గా పీఠాధిపతి హజరత్ సయ్యద్‌షా ఆరీఫుల్లా హుసేనీ సాహెబ్ పాల్గొని భక్తులకు ఆశీస్సులు అందజేస్తారు. అలాగే ఆయా మసీదుల్లో మత గురువులు ప్రార్థనలు నిర్వహించి రంజాన్ పండుగ పవిత్రతను తెలియజేయనున్నారు.
ఫిత్రా పంపిణీ
పవిత్ర రంజాన్ పండుగలో భాగంగా ముఖ్యమైన ఫిత్రా, జకాత్‌లను వారం రోజులుగా పేదలకు పంపిణీ చేస్తున్నారు. పండుగ ప్రకటన వెలువడగానే ఈ కార్యక్రమాలు ఎక్కువయ్యాయి. ఈ పండుగ సందర్భంగా పేదలు, అనాథలు, వికలాంగులు కూడా సంతోషంగా ఉండాలన్న ఉదాత్తమైన ఆశయంతో ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.
పండుగ సందడి
బజార్లలో పండుగ సందడి కనిపిస్తోంది. శుక్రవారం రాత్రి పండుగకు అవసరమైన వస్తువులు కొనుగోలు చేస్తున్న ముస్లింలతో ప్రధాన బజార్లు కిటకిటలాడాయి. ఫ్యాన్సీ, వంట సామగ్రి, వస్త్రాలు, పాదరక్షల కొనుగోలుతో సందడిగా మారాయి. పెద్ద, చిన్న దుకాణాలతోపాటు తోపుడు బండ్లపై కూడా విక్రయాలు బాగా జరిగాయి. శుక్రవారం రాత్రికే కడప నగరంలోని ప్రధాన బజార్లలో రంజాన్ కళ ఉట్టిపడింది.
ఈద్ ముబారక్ హో
Published Sat, Jul 18 2015 3:06 AM | Last Updated on Sun, Sep 3 2017 5:41 AM
Advertisement