పింఛన్ రాదని తెలిసి ఓ వృద్ధుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆదివారం సాయంత్రం కర్నూలు జిల్లా జూపాడుబంగ్లా మండలం చెన్నూరు గ్రామంలో చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం వడ్డె శివభూషన్న(65)కు గతంలో పింఛన్ వస్తుండగా, టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దాన్ని తొలగించారు.
దీంతో వికలాంగుడైన శివభూషన్న పింఛన్ కోసం అధికారులు, సర్పంచులు, ఎంపీడీవో కార్యాలయం చుట్టూ కాళ్లరిగేలా తిరిగాడు. ఈ నేపథ్యంలో గ్రామానికి చెందిన ఓ వ్యక్తి పింఛన్ ఇప్పిస్తానని నమ్మబలకటంతో అతనికి రూ.700 కూడా ఇచ్చాడు. ప్రస్తుతం మండలానికి 140 కొత్త పింఛన్లు మంజూరు కాగా, అందులో అతని పేరు లేకపోవటంతో తీవ్ర మనస్తాపానికి గురై ఇంట్లో ఉరేసుకొని మృతి చెందాడు. పొలం పనులకు వెళ్లి సాయంత్రం ఇంటికి తిరిగొచ్చిన భార్య లక్ష్మిదేవి.. తలుపులు తెరచి చూడగా భర్త విగతజీవిగా కనిపించాడు. మృతుని భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.