సార్వత్రిక పోరులోవిజేతలు వీరే
- మోడీ ప్రభావంతో జిల్లాలో సైకిల్ జోరు
- తొలిసారి పోటీచేసినా వైఎస్సార్‌సీపీ హోరాహోరీ పోరు
- టీడీపీకి 10,వైఎస్సార్ సీపీకి 5, బీజేపీకి ఒక స్థానం
సాక్షి ప్రతినిధి, విజయవాడ : సార్వత్రిక ఎన్నికల్లో జిల్లాలో టీడీపీ హవా నడిచింది. పది స్థానాల్లో ఆ పార్టీ అభ్యర్థులు విజయబావుటా ఎగరేశారు. స్థానిక సంస్థల ఎన్నికల తరహాలోనే టీడీపీ మెరుగైన ఫలితాలు సాధించింది. వరుస విజయాలతో తెలుగు తమ్ముళ్లు ఖుషీ అయ్యారు. మచిలీపట్నం, పెడన, అవనిగడ్డ, నందిగామ, జగ్గయ్యపేట, మైలవరం, పెనమలూరు, గన్నవరం, విజయవాడ సెంట్రల్, తూర్పు నియోజకవర్గాల్లో ఆ పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు.
ఓట్ల లెక్కింపు ప్రారంభం నుంచి టీడీపీ అత్యధిక స్థానాల్లో ఆధిక్యత కనబరుస్తూ వచ్చింది. పెనమలూరు, విజయవాడ సెంట్రల్, మచిలీపట్నం, పెడన, గన్నవరం నియోజకవర్గాల నుంచి పోటీ చేసిన టీడీపీ అభ్యర్థులు బోడె ప్రసాద్, బొండా ఉమామహేశ్వరరావు, కొల్లు రవీంద్ర, కాగిత వెంకట్రావ్, వల్లభనేని వంశీ మంచి మెజార్టీలతో గెలుపొందారు.
మైలవరం అభ్యర్థి, టీడీపీ జిల్లా అధ్యక్షుడు దేవినేని ఉమామహేశ్వరరావు 7,588 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. నందిగామలో తంగిరాల ప్రభాకర్ వరుసగా రెండోసారి విజయాన్ని సాధించారు. చివరి నిమిషంలో పార్టీ మారిన మండలి బుద్ధప్రసాద్ అవనిగడ్డలో హోరాహోరీ పోరులో గెలుపొంది పరువు కాపాడుకున్నారు. జగ్గయ్యపేటలో టీడీపీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీల మధ్య పోటీ ఉత్కంఠగా సాగింది. 1,840 ఓట్ల స్వల్ప ఆధిక్యతతో టీడీపీ అభ్యర్థి శ్రీరాం తాతయ్య రెండోసారి విజయం సాధించారు.
పోరాడి గెలిచారు...
గుడివాడ, నూజివీడు, పామర్రు, తిరువూరు, విజయవాడ పశ్చిమ నియోజక వర్గాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థులు విజయభేరి మోగించారు. గుడివాడలో కొడాలి నాని 11 వేలకు పైగా ఓట్ల ఆధిక్యతతో ఘనవిజయం సాధించారు. తొలి రౌండ్ నుంచి ప్రత్యర్థి, టీడీపీ అభ్యర్థి రావి వెంకటేశ్వరరావుపై ఆధిక్యత చాటారు. నూజివీడులో మేకా వెంకట ప్రతాప్ అప్పారావు 10,700 ఓట్ల మెజార్టీతో టీడీపీ అభ్యర్థి ముద్దరబోయిన వెంకటేశ్వరరావుపై గెలుపొందారు.
ఓట్ల లెక్కింపు ప్రారంభం నుంచి మేకా ‘ప్రతాపం’ చూపారు. పామర్రులో ఉప్పులేటి కల్పన సత్తా చాటారు. టీడీపీ బలమైన వాగ్ధాటి గల నేతగా పేరొందిన వర్ల రామయ్యకు ముచ్చెమటలు పట్టించారు. ఓట్ల లెక్కింపు ప్రారంభం నుంచి వర్లపై కల్పన స్వల్ప ఆధిక్యత కొనసాగిస్తూ వచ్చారు. 1,069 ఓట్ల తేడాతో విజయం సాధించారు. రెండుసార్లు టీడీపీ నుంచి పోటీ చేసి అపజయం పాలైన కల్పన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున బరిలోకి దిగి తొలిసారి విజయాన్ని నమోదు చేసుకున్నారు. తిరువూరు నుంచి బరిలో దిగిన రక్షణనిధి నువ్వా నేనా అన్నట్లు సాగిన పోరులో రెండు వేల ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.
దీంతో టీడీపీ అభ్యర్థి నల్లగట్ల స్వామిదాస్ తిరువూరులో హ్యాట్రిక్ అపజయాన్ని చవిచూడాల్సి వచ్చింది. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాస్ గెలిచి ఓడారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో చివరి మూడు రౌండ్లలో వెల్లంపల్లి ‘సీన్’ మారింది. అప్పటివరకు సుమారు 7,200 ఓట్ల మెజార్టీలో ఉన్న వెల్లంపల్లి జాతకం ఒక్కసారిగా తిరగబడింది. తుది లెక్కింపులో పుంజుకున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జలీల్‌ఖాన్ వెల్లంపల్లిపై 3,409 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు.
వికసించిన కమలం...
టీడీపీతో పొత్తులో భాగంగా జిల్లాలో రెండు స్థానాల్లో పోటీ చేసిన బీజేపీ కైకలూరులో గెలుపొంది జిల్లాలో ఖాతా తెరిచింది. 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ తరఫున పోటీ చేసి ఓటమి పాలైన కామినేని శ్రీనివాస్ ఈ దఫా బీజేపీ నుంచి రంగంలోకి దిగారు. వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థి ఉప్పాల రాంప్రసాద్ స్థానికేతరుడు కావడం కామినేనికి బాగా లాభించింది. గత ఎన్నికల్లో ఓడిపోయారనే సానుభూతి కూడా తోడైంది. సామాజిక, ఆర్థిక ఆంశాలను శ్రీనివాస్ బాగా వినియోగించారు. దీంతో 21,580 ఓట్ల మెజార్టీతో కామినేని విజయం సాధించారు.