గవర్నర్ ఉగాది సంబరాలకు ఈసీ ఓకే
ఉగాది పండగ చేసుకోడానికి రాష్ట్ర గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్కు ఎన్నికల సంఘం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇంతకు ముందు ప్రతి సంవత్సరం హోలీ సందర్భంగా అందరితో కలిసి సంబరాలు చేసుకునే గవర్నర్.. ఈసారి ఎన్నికల కోడ్ ఉండటం వల్ల వాటికి దూరంగా ఉన్నారు. ఉగాది నాడు పంచాంగ శ్రవణం ఉంటుంది. అధికారికంగా అయితే ప్రభుత్వం ఉన్నప్పుడు ముఖ్యమంత్రి, ఇతర మంత్రులతో పాటు గవర్నర్ కూడా ఈ కార్యక్రమానికి వెళ్లేవారు.
కానీ ఇప్పుడు రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన అమలులో ఉండటంతో గవర్నర్ అధికారికంగా ఈ కార్యక్రమానికి వెళ్లాల్సి ఉంది. ఎన్నికల కోడ్ ఉండటంతో ఈ పండుగ మీద కూడా అనిశ్చితి ఏర్పడింది. అయితే.. రాజకీయ నాయకులు గానీ, రాజకీయాల గురించి గానీ ప్రస్తావన లేకుండా ఉగాది ఉత్సవాలు నిర్వహించుకోవచ్చని గవర్నర్ నరసింహన్కు ఎన్నికల సంఘం సూచించింది. అలాగే ఉగాది ఉత్సవాలలో అధికారులు కూడా పాల్గొనవచ్చని ఈసీ తెలిపింది.