♦ ప్రకాశం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ ఓటుకు నోటు
♦ వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీలను రూ.మూడు లక్షల చొప్పున కొనుగోలు చేస్తోంది
♦ ఎన్నికల సంఘం రాష్ట్ర ప్రధాన అధికారికి వైఎస్సార్‌సీపీ నేతల ఫిర్యాదు
♦ నేడు గవర్నర్ దృష్టికి ఇదే అంశం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో శాసనమండలి ఎన్నికల్లో ఓటుకు రూ.ఐదు కోట్లు లంచం ఇచ్చిన టీడీపీ.. ప్రకాశం జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ ఎంపీటీసీ ఓటుకు రూ.మూడు లక్షలు లంచంగా ఇస్తోందని ఎన్నికల సంఘం రాష్ట్ర ప్రధాన అధికారి భన్వర్‌లాల్‌కు వైఎస్సార్‌సీపీ నేతలు ఫిర్యాదు చేశారు.
ఓటుకు లక్షలను ఎరగా వేస్తూ అవినీతికి పాల్పడుతోన్న టీడీపీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసులురెడ్డిపై అనర్హత వేటు వేయాలని డిమాండ్ చేశారు. వైఎస్సార్‌సీపీకి చెందిన 35మంది ఎంపీటీసీలను టీడీపీ నేతలు నెల్లూరు లాడ్జిలో బంధించగా ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, అనిల్‌కుమార్ యాదవ్‌లు గుర్తించిన విషయాన్ని వివరించారు. తమ పార్టీ ఎంపీటీసీలను తమకు అప్పగించాలని కోరిన ఎమ్మెల్యేలపైనే పోలీసులు అక్రమంగా కేసులు బనాయించారని తెలిపారు.
దౌర్జన్యాలకు అక్రమాలకు అడ్డుకట్ట వేయాల్సిన పోలీసులు ఎంపీటీసీలను రహస్య ప్రదేశానికి తరలించి టీడీపీకే కొమ్ముకాస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. తమ ఫిర్యాదుపై సానుకూలంగా స్పందించిన భన్వర్‌లాల్.. ఎన్నికలు శాంతియుతంగా, స్వేచ్ఛగా నిర్వహించేలా చూస్తానని హామీ ఇచ్చినట్లు వైఎస్సార్‌సీపీ నేతలు తెలిపారు. ఎంపీటీసీలను ప్రలోభపెట్టి తీసుకువెళ్లిన టీడీపీ నేతలపై గురువారం రాష్ట్ర గవర్నర్ నరసింహన్‌ను కలిసి ఫిర్యాదు చేయనున్నారు.
టీడీపీ అక్రమాలపై ఫిర్యాదు చేయడానికి బుధవారం హైదరాబాద్‌లో ఎన్నికల సంఘం రాష్ట్ర ప్రధాన అధికారి భన్వర్‌లాల్‌తో వైఎస్సార్‌సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యేలు ఎం.అశోక్‌రెడ్డి, గొట్టిపాటి రవి, ఆదిమూలం సురేష్, పాలపర్తి డేవిడ్‌రాజ్, జంకె వెంకటరెడ్డిలు సమావేశమయ్యారు. అనంతరం సచివాలయంలో ఎంపీ వైవీ సుబ్బారెడ్డి విలేకరులతో మాట్లాడుతూ... సీఎం చంద్రబాబు సంతలో పశువుల్లా ఎంపీటీసీలను కొనుగోలు చేస్తూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని దుయ్యబట్టారు.
హైడ్రామాకు తెరలేపిన టీడీపీ
సాక్షి, ఒంగోలు: తన భర్తను తెలుగుదేశం ఎమ్మెల్సీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసులురెడ్డి కిడ్నాప్ చేశారని ఇనమనమెళ్లూరు ఎంపీటీసీ యాదాల వెంకట్రావు భార్య మేరీ ఫిర్యాదు చేయడంతో కంగుతిన్న దేశం నేతలు ఆఎంపీటీసీని ఒంగోలు తీసుకువచ్చారు. తనను ఎవరూ కిడ్నాప్ చేయలేదని ఆయనతో పోలీసులు, తహసీల్దార్ ముందు స్టేట్‌మెంట్ ఇప్పిం చారు.తిరిగి తమ అధీనంలో ఉంచుకున్నారు.
నేడు వైఎస్సార్ కాంగ్రెస్ ధర్నాలు
ప్రజాసమస్యలు పట్టని ప్రభుత్వ వైఖరిపై నిరసన
పరిపాలన గాలికి వదిలేసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వైఖరికి నిరసనగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా గురువారం ధర్నా కార్యక్రమాలు చేపట్టనుంది. చంద్రబాబు ప్రభుత్వం ఓటుకు నోట్లు కేసు నుంచి బయటపడటంపైనే పోరాటం చేస్తోందని, ప్రజా సమస్యలు గాలికి వదిలేసిందని, అందుకు నిరసనగానే గురువారం ధర్నాలకు పిలుపునిచ్చినట్టు ఆ పార్టీ ఇదివరకే ప్రకటించింది. కృష్ణా నదీ జలాల్లో ఏపీకి దక్కాల్సిన వాటా సాధించని ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి మొత్తం వ్యవసాయ ప్రయోజనాలకే గొడ్డలిపెట్టుగా మారిందని వైఎస్సార్‌సీపీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు ఎంవీ మైసూరారెడ్డి పేర్కొన్నారు.
బచావత్ ట్రిబ్యునల్ ద్వారా సాధించుకున్న హక్కులపై ప్రభుత్వం పోరాడకుండా తేలిగ్గా వదలి వేసిందని మండిపడ్డారు. నీటి వాటాలో తీవ్ర నష్టం జరిగేలా వ్యవహరించడం, ప్రస్తుత సీజన్‌లో ఎరువులు, విత్తనాలు అందించలేక ప్రభుత్వం విఫలమైందంది. కొత్త రుణాలు లేక రైతాంగం తీవ్ర సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నారని ధ్వజమెత్తింది. ప్రభుత్వ వైఖరిని ఎండగట్టడానికే ఈ ధర్నాలు చేపడుతున్నట్టు ఆ పార్టీ ప్రకటించింది.
టీడీపీ అక్రమాలకు అడ్డుకట్ట వేయండి
Published Thu, Jun 25 2015 1:14 AM | Last Updated on Tue, Aug 14 2018 4:34 PM
Advertisement
Advertisement