- ఖమ్మం ఎంపీ శ్రీనివాసరెడ్డి
విస్సన్నపేట : పాలకులు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. మండలంలోని పుట్రేలలో సోమవారం జరిగిన సీనియర్ కాంట్రాక్టర్ బొల్లారెడ్డి కోటిరెడ్డి పెదఖర్మ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు సమన్వయంతో ముందుకెళితేనే రెండు రాష్ట్రాలు అభివృద్ధి చెందుతాయని, ప్రజా సమస్యలు పరిష్కారమవుతాయని చెప్పారు.
ఆంధ్రప్రదేశ్ రాజధానిని అద్భుతంగా నిర్మించాల్సి ఉందన్నారు. ట్రిబ్యునల్ చెప్పిన ప్రకారం నీరు విడుదల చేస్తే రెండు ప్రాంతాల రైతులకు ఉపయోగకరంగా ఉంటుందని పేర్కొన్నారు. తెలంగాణలో విద్యుత్ సమస్య ఉందని, ఈ విషయంలో ఆంధ్ర సీఎం చొరవచూపాలని కోరారు. తెలంగాణలో ఉంటున్న సీమాంధ్రులకు ఎటుంటి నష్టం జరగదని పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోడి మంచి పరిపాలన అందిస్తారని ఆశాభావం వ్యక్తంచేశారు.
విజయవాడ-జగదల్‌పూర్ మధ్య నాలుగు లైన్ల రహదారి ఏర్పాటు పనులు త్వరలోనే ప్రారంభమవుతాయని చెప్పారు. ఎమ్మెల్యే రక్షణ నిధి మాట్లాడుతూ తమ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలో అసెంబ్లీలో రుణమాఫీ చేసేలా ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని చెప్పారు.
ఖమ్మం జిల్లా అశ్వారావుపేట ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వరరావు, పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, వైఎస్సార్ సీపీ భద్రాచలం, సత్తుపల్లి నియోజకవర్గాల కన్వీనర్లు ఎస్.వెంకటేశ్వరరావు, మట్టా దయాకర్, కృష్ణా జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు మద్దిరెడ్డి సూర్యనారాయణరెడ్డి, మోహనరెడ్డి, ఎన్.వీరారెడ్డి, దేశిరెడ్డి రాఘవరెడ్డి, నాయకులు ఓలేటి దుర్గారావు, శీలం నాగనర్శిరెడ్డి, కుటుంబరావు, కృష్ణారావు పాల్గొన్నారు.