
ఆచంట నియోజకవర్గం
సాక్షి, ఆచంట : గలగల పారే గోదావరి.. నది మధ్యలో చిన్న చిన్న దీవుల్లా ఉండే లంకలు.. పచ్చని పంట పొలాలు.. ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు.. ఆహ్లాదకర వాతావరణం ఇమిడి ఉండే గ్రామీణ నియోజకవర్గం ఆచంట. పల్లె ప్రాంతమైనా ఇక్కడి ప్రజలు పట్టణవాసులకు దీటుగా రాజకీయ చైతన్యం కలిగిన వారు. ఒకప్పుడు ఇది కమ్యూనిస్టుల కంచుకోట. అందుకే ఉద్యమాలకు పుట్టినిల్లుగా చెబుతుంటారు. ఏ ప్రజాపోరాటం జరిగినా ఇక్కడి వాసులు ముందుంటారు. నరసాపురం డివిజన్‌లో చరిత్ర ప్రసిద్ధమైన కాళీపట్నం, వ్యవసాయకూలీ, ఆకలియాత్ర తదితర ఉద్యమాలలో ఈ ప్రాంతవాసులు ప్రధాన భూమికను పోషించారు. ఒక ప్రేరేప మృత్యుం జయుడు.. ఒక తాళ్ల బసవమల్లయ్య వంటి కామ్రేడ్‌లు అసువులుబాసిన గడ్డ ఇది.
రాజకీయ చరిత్ర...
పాలకొల్లు నియోజకవర్గం నుంచి విడిపడి 1962లో ఆచంట నియోజకవర్గం ఏర్పడింది. 2004 వరకూ ఇది ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గంగా ఉంది. పునర్విభజనలో 2009లో జనరల్ నియోజకవర్గంగా మారింది.ఇది పూర్తిగా గ్రామీణ ప్రాంతం కమ్యూనిస్టుల ప్రభావం ఎక్కువ. ఇప్పటి వరకూ నియోజవర్గంలో 12సార్లు ఎన్నికలు జరగ్గా అన్ని ప్రధాన పార్టీలను గెలిపించి నియోజకవర్గ ఓటర్లు తమ విలక్షతను చాటుకున్నారు.
భౌగోళిక స్వరూపం
నియోజకవర్గం 286 చదరపు కలోమీటర్లలో విసిరించి ఉంది. తూర్పున వశిష్ట గోదావరి, పడమర భీమవరం, తణుకు నియోజకవర్గాలు, దక్షిణాన పాలకొల్లు, ఉత్తరాన నిడదవోలు నియోజకవర్గాలు ఉన్నాయి. ఆచంట మండలంలో 12, పెనుగొండ మండలంలో 14, పెనుమంట్ర మండలంలో 18, పోడూరు మండలంలో 8 గ్రామాలు కలిపి 52 గ్రామాలతో నియోజకవర్గంగా రూపుదిద్దుకుంది.
జనాభా : 2,30,028
పురుషులు : 1,15,572
మహిళలు : 1,14,456
ఓటర్లు : 1,66,421
పురుషులు : 82,547
మహిళలు : 83,866
ఇతరులు : 08
రవాణా సౌకర్యాలు
ఆచంట నుంచి 8 కిలోమీటర్ల దూరంలో సిద్ధాతం గ్రామంలో ఎన్‌హెచ్–5 జాతీయ రహదారి ఉంది. ఆచంటకు 16 కిలోమీటర్ల దూరంలో పాలకొల్లు, రైల్వేస్టేషన్, 25 కిలోమీటర్లదూరంలో తణుకు, నియోజకవర్గ శివారు గ్రామమైన నత్తా రామేశ్వరం నుంచి మరో మూడు కిలోమీటర్ల దూరంలో మంచిలి రైల్వే స్టేషన్ ఉంది. ఆచంట మండలం కోడేరు గ్రామంలోని గోదావరి పడవపై దాటితే తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరం చేరుకోవచ్చు. అక్కడి నుంచి అమలాపురం 20 కిలోమీటర్లు దూరం. జాతీయ రహదారిని చేరి ఉండడంతో సిద్ధాంతం చేరుకుంటే అక్కడి రాష్ట్రంలోని ఏప్రాంతానికైనా చేరుకోవచ్చు.
ప్రసిద్ధ ఆలయాలు, పర్యాటక కేంద్రాలు
నియోజకవర్గం పర్యాటక కేంద్రంగానూ ఆధ్యాత్మిక కేంద్రంగానూ భాసిల్లుతోంది. ప్రసిద్ధిగాంచిన శ్రీ ఆచంటేశ్వరస్వామి, జైన దేవాలయం, ప్రసిద్ధిగాంచిన పెనుగొండలోని శ్రీ వాసవీ కన్యాకా పరమేశ్వరి ఆలయం, వాసవీధామ్, పెదమల్లంలోని మాచేనమ్మ అమ్మవారు, పెనుమంట్ర మండలం నత్తారామేశ్వరంలోని నత్తా రామేశ్వరస్వామి ఆలయాలు ప్రసిద్ధిగాంచినవి.
ప్రధాన సమస్యలివీ..
- అక్షర క్రమంలో ముందున్న ఈ నియోజకవర్గం అభివృద్ధిలో మాత్రం వెనుకబడి ఉంది.
- లంక గ్రామాల పరిస్థితి మరీ దయనీయం. వీటిని చేరుకోవాలంటే పడవలను ఆశ్రయించక తప్పదు. లంక గ్రామాలను కలుపుతూ గోదావరిపై వంతెనలు నిర్మిస్తామని పాలకులు హామీలు ఇచ్చినా ఆచరణ సాధ్యం కాలేదు.
- లంక గ్రామాల అభివృద్ధి అంతా వంతెనలతోనే ముడిపడి ఉంది. కోడేరు నుంచి తూర్పు గోదావరి జిల్లా గన్నవరం వరకూ గోదావరిపై వంతెన నిర్మాణం కలగా మారింది. ఇది నిర్మిస్తే ఉభయ గోదావరి జిల్లా వాసులకు ఎంతో సౌకర్యంగా ఉంటుంది.
- బ్యాంకు కెనాల్‌పై ఆధార పడి దాదాపు 35 వేల ఎకరాల ఆయకట్టు ఉంది .ఏటా దాళ్వాలో శివారు ప్రాంతాల వారు సాగునీటి కోసం తీవ్ర అవస్థలు పడుతున్నారు. దీంతో పెనుగొండ మండలం దొంగరావిపాలెం వద్ద శాశ్వత ఎత్తిపోతల ప«థకం నిర్మించాలని కోరుతున్నా తాత్కాలిక లిఫ్టు ఏర్పాటు చేసి పాలకులు చేతులు దులుపుకున్నారు.
- ఆచంటలో అగ్నిమాపక కేంద్రం, బస్టాండ్ ఏర్పాటు, అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ నిర్మాణం పరిష్కారానికి నోచుకోలేదు. నియోజకవర్గంలో వందలాది మంది లబ్ధిదారులు ఇళ్లస్థలాలు లేక తీవ్ర అవస్థలు పడుతున్నారు.
- ఆచంటలో రూ.14 కోట్లతో చేట్టిన సమగ్ర రక్షిత నీటి పథకం ఏళ్ల తరబడి పూర్తి కాలేదు. దీంతో కోడేరు, కుందరవల్లి, కరుగోరుమిల్లి, పెదమల్లం తదితర గ్రామాల్లో తాగునీటికి అష్టకష్టాలు పడుతున్నారు. ఆచంటలో వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో నిర్మించిన సీహెచ్‌సీలో పూర్తి స్థాయిలో వైద్యసేవలు అందడంలేదు. రోగులు అవస్థలు పడుతున్నారు.
వైఎస్ చరిష్మాతో ..దేశం కంచుకోటకు బీటలు
ఆచంట నియోజవర్గం 1962లో ఏర్పడింది. 2004 వరకూ రిజర్వుడు నియోజకవర్గంగా కొనసాగింది. 1962 నుంచి 1978 వరకూ నియోజకవర్గంలో పోరు కాంగ్రెస్, కమ్యూనిస్టుల మధ్యే సాగింది. టీడీపీ ఆవిర్భావంతో ఆచంట ఆ పార్టీకి కంచుకోటగా మారింది. 1983 నుంచి 2004 వరకూ ఆరు సార్లు టీడీపీ, ఆపార్టీ బలపర్చిన సీపీఎం అభ్యర్థులే ఇక్కడ గెలుపొందారు. 1983లో టీడీపీ నుంచి కోట భాస్కరరావు గెలిచారు. 1985 నుంచి 1994 వరకూ సీపీఎం, టీడీపీ పొత్తులలో భాగంగా ఇక్కడి సీటు సీపీఎంకు కేటాయించారు.
1985లో సీపీఎం అభ్యర్థి అలుగు చిత్తరంజన్, 1989, 94 ఎన్నికలలో సీపీఎం అభ్యర్థి దిగుపాటి రాజగోపాల్ గెలిచారు. 1999లో సీపీఎంతో పొత్తు చెదరడంతో టీడీపీ అభ్యర్ధి మోచర్ల జోహర్‌వతి గెలిచారు. 2004లో టీడీపీ అభ్యర్థి పీతల సుజాత గెలుపొందారు. 2009 పునర్విభజనలో జనరల్‌గా మారిన ఈ నియోజకవర్గం నుంచి వైఎస్ రాజశేఖరరెడ్డి బీసీ అభ్యర్థి పితాని సత్యనారాయణను బరిలోకి దించి దేశం కంచుకోటలో పాగావేశారు. 1983 నుంచి కాంగ్రెస్‌కు కొరకరాని కొయ్యగా ఉన్న ఇక్కడ వైఎస్సార్ కాంగ్రెస్ జెండాను ఎగురవేయించారు. జనసేన ఆవిర్భావంతో త్రిముఖ పోటీ జరిగినా ప్రధానంగా వైఎస్సార్‌సీపీ, టీడీపీ మధ్యే పోటీ. ప్రస్తుతం వైఎస్సార్ సీపీ బలంగా ఉంది.