
కొవ్వూరులో గుర్తుతెలియని వ్యక్తులు నిప్పుపెట్టిన దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహం
సాక్షి, కొవ్వూరు: పట్టణంలో మెరకవీధిలో ఉన్న మహానేత, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి చుట్టి ఉంచిన క్లాత్‌కి సోమవారం అర్ధరాత్రి గుర్తుతెలియని దుండగులు నిప్పు అంటించారు. ఆ సమయంలో మోటారు సైకిల్‌పై వెళుతున్న వ్యక్తులు చూసి నీళ్లు పోసి ఆర్పినట్టు స్థానికంగా నివాసం ఉంటున్న ఓ వృద్ధుడు చెప్పారు. పట్టణ సీఐ కె.విజయ్‌బాబు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. వైఎస్సార్ సీపీ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి తానేటి వనిత ఆధర్వ్యంలో నాయకులు విగ్రహాన్ని పరిశీలించి దుండగుల చర్యలను ఖండించారు. ఈ దుశ్చర్యపై వనిత మాట్లాడుతూ కొవ్వూరు నియోజకవర్గంలో వైఎస్సార్‌సీపీ గెలుపు ఖాయమని భావించి రాజకీయ దురుద్దేశంతో ఇటువంటి దుశ్చర్యకి పాల్పడినట్టు ఆమె ఆరోపించారు.
అరాచకశక్తులను పంపించి శాంతిభద్రతలకు విఘాతం కల్పించాలనే ఇటువంటి చర్యలకు పాల్పడ్డారన్నారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేసి దోషులను తక్షణం అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహం వద్దకు చేరుకుని తమ నిరసన వ్యక్తం చేశారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి కోడూరి శివరామకృష్ణ, పట్టణ పార్టీ అధ్యక్షుడు రుత్తల భాస్కరరావు, నాయకులు కంఠమణి రమేష్, సలాది సందీప్, ముదునూరి సూర్యనారాయణరాజు, దేవగుప్తాపు లక్ష్మణరావు, బేతిన ప్రసాద్, వర్రే నాగ మురళి తదితరులు పై ఘటనను ఖండించిన వారిలో ఉన్నారు. ఈ ఘటనపై పార్టీ పట్టణ అధ్యక్షుడు భాస్కరరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ విజయ్‌బాబు తెలిపారు. పురపాలక సంఘం కమిషనర్ కేటీ సుధాకర్ తన సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. సగం కాలిన గుడ్డను తొలగించి నూతనంగా విగ్రహానికి మరో క్లాత్ చుట్టించారు.
Comments
Please login to add a commentAdd a comment