
సాక్షి , ఆచంట: సీనియర్ పొలిటీషియన్‌గా, రాజకీయ వ్యూహకర్తగా, విద్యావేత్తగా, పారిశ్రామికవేత్తగా గుర్తింపు పొందిన శ్రీరంగనాథరాజు సేవా కార్యక్రమాల్లో ముందుంటారు. 24 ఏళ్లుగా విశిష్ట సేవలందిస్తున్న ఆయన జిల్లా ప్రజలకు సుపరిచితులు. ప్రస్తుతం ఆయన ఆచంట నియోజకవర్గం నుంచి వైఎస్సార్‌సీపీ తరఫున బరిలో దిగారు. ఆయన మనోగతం..
ప్రశ్న : మీరు రాజకీయాల్లో రావడానికి స్ఫూర్తి ?
రంగరాజు : మా తాతగారైన శివరామరాజు 30 ఏళ్ల పాటు మాస్వగ్రామమైన యండగండికి సర్పంచ్‌గా పనిచేశారు. ఎంతో అభివృద్ధి చేశారు. మా నాన్న, పెదనాన్న రాజకీయాలపై పెద్దగా ఆసక్తి చూపేవారు కాదు. మా తాతగారి ప్రభావం నాపై పడింది. ఆయన స్ఫూర్తితోనే రాజకీయాల్లోకి వచ్చా.
ప్రశ్న : సేవా కార్యక్రమాల్లో ముందుంటున్నారుగా?
రంగరాజు : అవును. జిల్లావ్యాప్తంగా ట్రస్టు ద్వారా పలు సేవా కార్యక్రమాలు చేపడుతున్నాను. రాజకీయ రంగంలో మరింత విస్తృతంగా ప్రజలకు సేవ చేసే అవకాశం ఉంటుందనే రాజకీయ రంగంలోకి వచ్చా.
ప్రశ్న : ప్రజల ఆదరణ ఎలా ఉంది?
రంగరాజు : అనతి కాలంలోనే తనను అక్కున చేర్చుకున్నారు. ఇక్కడి ప్రజలు చాలా మంచివారు. కష్టజీవులు. ఇప్పుడు ఏగ్రామం వెళ్లినా ఎదురొచ్చి స్వాగతం పలుకుతున్నారు.
ప్రశ్న : గెలుపు అవకాశాలు ఎలా ఉన్నాయి?
రంగరాజు : ఇక్కడి ప్రజల ఆదరణ చూస్తుంటే నా విజయం నూటికి నూరు శాతం ఖాయం. నా విజయం కోసం ప్రజలే స్వచ్ఛందంగా పనిచేయడం చాలా ఆనందంగా ఉంది. ఇటీవలే సబ్సిడీపై రైతులకు ట్రాక్టర్లు అందించాం. ప్రజలకు సదుపాయాలూ కల్పించాం. దీంతో నాపై ఓటర్లకు నమ్మకం కలిగింది.
ప్రశ్న : అత్తిలిలో చేసిన పనులు మీ విజయానికి ఎంతవరకూ దోహదపడతాయి?
రంగరాజు: పెళ్లి చేసేటప్పుడు ఎలా అయితే అన్నీ విచారించి చేస్తామో.. అలాగే నా గురించి కూడా అత్తిలి నియోజకవర్గ ప్రజలను కూడా విచారించి ఓటేయాలని కోరుతున్నా. ఆచంట నియోజకర్గాన్ని కూడా ఓ మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతా. దీనికోసం రంగం సిద్ధమైంది.
ప్రశ్న : నియోజకవర్గ సమస్యలు తెలుసా?
రంగరాజు: ప్రధానంగా ఇళ్లస్థలాల సమస్య అధికంగా ఉంది, అందరికీ స్థలాలతోపాటు ఇళ్లు కట్టించి ఇస్తా. డ్రెయినేజీ, సాగునీటి సమస్యలు అయోధ్యలంక అనగారలంక గ్రామాల ప్రజలకు వంతెనలు నిర్మిస్తా. గోదావరి విద్యావికాస్ ట్రస్టు ద్వారా డాక్టర్లను నియమించి వైద్యసేవలు అందిస్తా. విద్యాప్రమాణాల పెంపులో భాగంగా పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పిస్తా.
ప్రశ్న : మీ అంతిమ లక్ష్యం?
రంగరాజు : ప్రజలకు సేవ చేయడమే నా అంతిమ లక్ష్యం. తుది శ్వాస వరకూ ప్రజలకు సేవా చేస్తా. సేవా కార్యక్రమాలే నాకు శ్రీరామ రక్ష.
Comments
Please login to add a commentAdd a comment