సాక్షి, పాలకొల్లు టౌన్: ప్రజల మనిషి, పేదల వైద్యుడు, రోగుల మనోభావాలు తెలిసిన వ్యక్తి, 40 ఏళ్ల వైద్య వృత్తి, ఐదుతరాల వైద్యుల కుటుంబం, నీతికి, నిజాయతీకి, నిస్వార్థ ప్రజాసేవకు నిలువుటద్దం ఆయనే డాక్టర్ సీహెచ్ సత్యనారాయణమూర్తి (బాబ్జి). పాలకొల్లు నియోజకవర్గ ప్రజలకు పరిచయం అవసరం లేని పేరు. రోగి ఆయన దగ్గరకు వెళితే ప్రాణం నిలబడుతుందనే కొండంత ధైర్యం కలిగించే గొప్ప వైద్యుడు. పాలకొల్లులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలో నిలిచిన ఆయన మనోగతం.
ప్రశ్న : మీ రాజకీయ ప్రస్థానం
డా.బాబ్జి : 2004లో నా రాజకీయ ప్రస్థానం మొదలయ్యింది. నేను పుట్టింది, పెరిగింది పాలకొల్లులోనే. డాక్టరుగా పట్టా చేతపట్టుకుని 1972లో పాలకొల్లులో శ్రీ వెంకటేశ్వర నర్సింగ్ హోమ్‌ను ప్రారంభించాను. మా ముత్తాతలు, తాతలు, తండ్రి స్ఫూర్తితోనే పాలకొల్లులో ప్రాక్టీస్ పెట్టాను. సేవాభావంతోనే ముందుకు సాగుతున్నా.
ప్రశ్న : రాజకీయాల్లోకి ఎలా వచ్చారు ?
డా.బాబ్జి : 2004లో చంద్రబాబునాయుడు ఊహించని విధంగా ఒకరోజు నాకు ఫోన్ చేసి పాలకొల్లు టీడీపీ అభ్యర్థిగా టికెట్ ఇస్తాను మీరు పోటీ చేయాలని అన్నారు. అప్పట్లో నాకు రాజకీయాలు పెద్దగా తెలియవు. మా కుటుంబసభ్యులు, బంధువు యర్రా నారాయణస్వామి నన్ను ఒప్పించి రాజకీయాల్లోకి తీసుకువస్తే ప్రజలు ఎమ్మెల్యేగా గెలిపించారు.
ప్రశ్న : ఎన్నిసార్లు పోటీలో ఉన్నారు ?
డా.బాబ్జి : 2004, 2009, 2014 ఎన్నికల్లో పోటీచేశా. 2009లో చిరంజీవిపై తలపడ్డాను. అప్పుడు ఎమ్మెల్యేగా బంగారు ఉషారాణి విజయం సాధించారు.
ప్రశ్న : ఎమ్మెల్యే పదవి ఎలాంటి సంతృప్తి ఇచ్చింది
డా.బాబ్జి : 2004లో వైఎస్సార్ ప్రభంజనంతో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. నేను టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్నా. ఆయన ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ పథకం నాకు బాగా నచ్చింది. ఒక డాక్టర్‌గా పేదలకు కార్పొరేట్ వైద్యం అందించాలనే ఆలోచన స్ఫూర్తి నిచ్చింది. పథకం అమలుపై వైఎస్సార్‌ను కలిసి నా ఆలోచనలు పంచుకున్నా. ఆరోగ్యశ్రీ పేదలకు వరంగా మారిందంటే అది ఆయన చలువే. నాకు చాలా ఇష్టమైన నేత వైఎస్సార్.
ప్రశ్న : అభివృద్ధి అంటే ఏమిటి ?
డా.బాబ్జి: పార్కులు, రోడ్లు వేయడం అభివృద్ధి కాదు. సమాజంలో అది కూడా అవసరమే. పాలకొల్లు నియోజకవర్గంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో సుమారు రూ.600 కోట్ల అభివృద్ధి జరిగిందని ప్రచారం చేస్తున్నారు. తాగునీటికి రూ.100 కోట్లు ఖర్చు, ఏరియా ఆస్పత్రికి రూ.100 కోట్లు ఖర్చు చేశామంటున్నారు.. ఇదే నిజమైతే శివారు ప్రాంత ప్రజలు తాగునీటి కోసం ఎందుకు అల్లాడుతున్నారు, పేదలు వైద్యం కోసం ఎందుకు సుదూర ప్రాంతాలకు వెళుతున్నారు. ఉభయగోదావరి జిల్లాల్లో 50 శాతం మంది క్యాన్సర్ వ్యాధికి గురవుతున్నారు. ఇందుకు కలుషిత నీరు కారణం. కాలువల్లో నీరు కలుషితం కావడం వ్యాధులకు కారణమవుతోంది.
ప్రశ్న : మీకు అధికారం ఇస్తే ప్రజలకు ఏమి చేస్తారు
డా.బాబ్జి : మహానేత వైఎస్సార్ సంక్షేమ పథకాలను తూ.చా తప్పకుండా అమలు చేసే సామర్థ్యం జగన్‌కు ఉంది. వైఎస్సార్ సీపీ అభ్యర్థిగా నన్ను గెలిపించడంతో పాటు జగన్‌మోహన్‌రెడ్డిని ముఖ్యమంత్రిగా చేయడానికి ఓటర్లు సిద్ధంగా ఉన్నారు. నేను గెలిచిన వెంటనే పాలకొల్లు నియోజకవర్గంలో నిరుద్యోగ యువకులకు స్వయం ఉపాధి కోసం చిన్నతరహా పరిశ్రమలు ఏర్పాటు, పేదల ఆరోగ్యానికి భరోసాగా 100 పడకల ఆసుపత్రిని తీర్చిదిద్దడం, అన్ని గ్రామాలకు స్వచ్ఛ తాగునీరు అందేలా చూడటం, పాలకొల్లు డంపింగ్‌యార్డుకు శాశ్వత పరిష్కారం, పటిష్ట డ్రెయినేజీ వ్యవస్థ, నైపుణ్యతతో కూడిన విద్యను అందించడానికి, విద్యార్థులకు కొత్త కోర్సులు తీసుకురావడానికి కృషి చేస్తాను.
ప్రశ్న : 2014లో టీడీపీ టికెట్ ఎందుకివ్వలేదు ?
డా. బాబ్జి: 2014 ఎన్నికల సమయంలో చంద్రబాబు మరలా పోటీచేయాలని చెప్పారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన తణు కు వస్తే రాత్రి 11 గంటల సమయంలో కలిశాను. రాత్రి 12 గంటల సమయంలో మరో వ్యక్తికి టికెట్ ఇచ్చినట్టు టీవీలో చూశాను. నేను సీఎంను కలిసినప్పుడే టికెట్ వేరే వ్యక్తికి ఇస్తానంటే స్వాగతించేవాడని. నా మంచితనాన్ని చంద్రబాబు వాడుకున్నారు. అప్పటికే జరిగిన మున్సిపల్ ఎన్నికల్లోనూ నేను కష్టించి సంపాదించిన సొమ్ముతో టీడీపీ కౌన్సిల్ అభ్యర్థులను ఎంపిక చేసి గెలిపించాను. ఏ ఎన్నికల్లో అయినా పార్టీ సొమ్ము గాని ప్రజల సొమ్ముగాని వాడుకున్నానని ఎవరైనా నిరూపిస్తే రాజ కీయాల నుంచి తప్పుకుంటా. గత ఎన్నికల్లో టీడీపీ నాయకులు, కార్యకర్తలు బలవంతంగా స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేయాలని బరిలోకి దింపారు. విస్తృతంగా ప్రచారం చేశా. అయితే అప్పట్లో ఎంపీ అభ్యర్థిగా పోటీచేసిన మరో వ్యక్తికి, నాకు ఆటో గుర్తును కేటాయించారు. ఓటర్లు నాపై నమ్మకంతో ముందుగా ఎంపీ అభ్యర్థి గుర్తు ఆటోకు చాలా మంది ఓటేశారు. ఇలా సుమారు 12 వేల ఓట్లు పోలయ్యాయి. ఇది నా ఓటమికి కారణమైంది. అయినా నాకు 39 వేలకుపైగా ఓట్లు వచ్చాయి.
Comments
Please login to add a commentAdd a comment