మచిలీపట్నం నియోజకవర్గ ముఖచిత్రం
సాక్షి, మచిలీపట్నం : బందరు ప్రాచీన, చారిత్రక, సాంస్కృతిక నేపథ్యం కలిగిన నియోజకవర్గం. విదేశీయులు(డచ్) వ్యాపారాలు నడిపిన ప్రాంతం. భారత దేశంలోనే మూడో మున్సిపాలిటీ కాగా.. రాష్ట్రంలో రెండో మున్సిపాలిటీగా ప్రాచుర్యం పొందిన ప్రాంతం. మచిలీపట్నం నియోజకవర్గానికి ఎందరో ఉద్దండులైన రాజకీయ నాయకులను అందించిన ఘనత ఉంది. అంతటి ఘన చరిత్ర కలిగిన బందరులో రాజకీయ చైతన్యం సైతం అదే స్థాయిలో ఉంది.
కాపుల హవా ఎక్కువగా ఉండగా.. ద్వితీయ స్థానంలో మైనార్టీల ఆధిపత్యం కొనసాగుతోంది. ఇక్కడి అసెంబ్లీ అభ్యర్థి గెలుపు రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందనే నానుడి సైతం ప్రాచుర్యంలో ఉంది. అంతే కాకుండా సీఎం హోదాలో బందరు పర్యటనకు వస్తే తర్వాతి ఎన్నికల్లో అతని పరాజయం సాధించడం ఖాయమన్న వాదన సైతం జోరుగా ఉంది.
16 సార్లు ఎన్నికలు
బందరు నియోజకవర్గానికి ఇప్పటి వరకు 16 సార్లు ఎన్నికలు జరిగాయి. తొలుత 1952లో ఎన్నికలు నిర్వహించగా.. అంతకు ముందు సమితి అధ్యక్షుల ప్రక్రియ కొనసాగేది. 16 సార్లు జరిగిన ఎన్నికల సంగ్రామంలో కాంగ్రెస్, కాంగ్రెస్–ఐ పార్టీలకు సంబంధించి ఏడుగురు అభ్యర్థులు శాసనసభ్యులుగా ఎన్నికయ్యారు. టీడీపీ అభ్యర్థులు ఆరు సార్లు, సీపీఐ, జనతా, ఇండిపెండెంట్ అభ్యర్థులు ఒక్కోసారి గెలుపొందారు.
ఇక్కడి నుంచి గెలిచిన అంబటి బ్రహ్మణయ్య 2009లో అవనిగడ్డ నియోజకవర్గంలో పోటీ చేసి విజయఢంకా మోగించారు. ఎంపీగా సైతం ఐదేళ్ల పాటు కొనసాగారు. ఇక్కడ గెలిచిన వారిలో వడ్డిరంగారావు గతంలో ఎన్‌టీఆర్ క్యాబినెట్‌లో పనిచేస్తే, కృష్ణమూర్తి నేదురుమల్లి క్యాబినెట్‌లో, 1999లో ఎన్నికైన నరసింహారావు ఆనాటి చంద్రబాబు ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు.
హ్యాట్రిక్ వీరుడు లక్ష్మణరావు
బందరు నియోజకవర్గం నుంచి పెదసింగు లక్ష్మణరావు మూడు పర్యాయాలు వరుస విజయంతో హ్యాట్రిక్ సొంతం చేసుకున్నారు. 1962లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రాళ్లపల్లి వెంకటరామయ్యపై ఇండిపెండెంట్‌గా పోటీ చేసి గెలుపొందారు. 1967, 1972లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగి విజయం సాధించారు.
రికార్డు మెజార్టీ పేర్ని నానీకే
16 పర్యాయాలు నిర్వహించిన ఎన్నికల్లో ప్రస్తుత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బందరు నియోజకవర్గ సమన్వయకర్త పేర్ని నాని రికార్డు స్థాయి మెజార్టీ దక్కించుకున్నారు. 2004లో కాంగ్రెస్ పార్టీలో తొలి సారి పోటీ చేసి.. ప్రత్యర్థి అయిన టీడీపీ అభ్యర్థి నడకుదిటి నరసింహారావుపై 31,301 ఓట్ల ఆధిక్యం సాధించారు.
2019 ఎన్నికల్లో పీఠమెవరిదో?
ప్రస్తుతం సార్వత్రిక ఎన్నికల సమయం ఆసన్నమైంది. వైఎస్సార్ సీపీ నుంచి పేర్ని నాని, టీడీపీ నుంచి కొల్లు రవీంద్ర బరిలోకి దిగనున్నారు. ఐదేళ్ల టీడీపీ ప్రభుత్వంలో సంక్షేమ కార్యక్రమాలు అర్హులకు అందలేదన్న ఆపవాద మూటగట్టుకుంది. బందరు పోర్టు నిర్మాణం చేపట్టకపోగా.. భూ సేకరణ, సమీకరణ పేరుతో రైతులను నానా ఇబ్బందులకు గురి చేసింది.
ఈ పరిణామం టీడీపీకి ఓటమి తెచ్చి పెడుతుందన్న వాదన బలంగా వినిపిస్తోంది. వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించిన సంక్షేమ పథకాలకు ప్రజలు ఆకర్షితులవుతున్నారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ అభ్యర్థి నానీ గెలిచే అవకాశాలు ఉన్నాయన్న వార్తలు వినవస్తున్నాయి.
నియోజకవర్గ జనాభా : 1,75,698
పట్టణంలో వార్డులు : 42
పంచాయతీలు : 34
ఓటర్ల వివరాలు : 1,84,506
పురుషులు : 90,146
మహిళలు : 94,348
ఇతరులు : 12
Comments
Please login to add a commentAdd a comment