సాక్షి ప్రతినిధి, కర్నూలు: ఎమ్మెల్సీ ఎన్నికల్లో బలం లేకపోయినా నిలబడి పరువు నిలుపుకునేందుకు అధికార పార్టీ నానా యాతన పడుతోంది. ఓటుకు నోట్లు ఇస్తూ ప్రలోభ పెట్టడంతో పాటు విహారయాత్రల పేరిట క్యాంపు రాజకీయాలకు తెరతీసింది. తమకు పనులున్నాయని పలువురు ఎంపీటీసీ సభ్యులు పేర్కొంటున్నా...క్యాంపునకు రావాల్సిందేనని ఒత్తిళ్లు చే స్తోంది. ఇంతటితో ఆగకుండా..ఎన్నికల రోజు ముఖ్యమంత్రి పర్యటన జిల్లాలో జరిగే విధంగా ప్రణాళిక రచించడం విమర్శలకు తావిస్తోంది.
మొత్తం మీద బలం లేకపోయినా ఎన్నికల్లో నిలబడి...గెలిచేందుకుఅధికార పార్టీ చేస్తున్న ఫీట్లు కాస్తా సర్కస్ తీరును కనబరుస్తోందన్న అభిప్రాయం జిల్లాలో వ్యక్తమవుతోంది. ఓటుకు నోటు ఇవ్వడం ఫలితం లేదని భావించిన అధికార పార్టీ.. విహారయాత్రల పేరుతో ఫ్యామిలీకి టూర్ ప్యాకేజీని ప్రకటించింది. ఈ టూర్ ప్యాకేజీలకు పెద్దగా ఆసక్తి కనబర్చకపోవడంతో ఎలాగైనా క్యాంపుకు తరలించేందుకు భారీ ఏర్పాట్లను చేసింది.
పనులున్నాయి.. మహాప్రభో మేం రాలేమని పలువురు ఎంపీటీసీలు తేల్చిచెప్పినప్పటికీ టీడీపీ నేతలు మాత్రం వదలటం లేదు. కచ్చితంగా క్యాంపుకు రావాల్సిందేనని ఒత్తిళ్లు తెస్తున్నారు. ఇంటి వద్దకు వాహనాన్ని తీసుకెళ్లి ఇంట్లో వారందరినీ తీసుకెళ్లే ప్రయత్నాలు చేశారు. తమ పిల్లలకు చదువులున్నాయి.. రాలేమని అన్నప్పటికీ పిల్లాజల్లాలతో కలిపి క్యాంపునకు తరలించే ప్రయత్నం చేశారు. తమతో పాటు రాకపోతే తమకు ఓటు వేయరనే ఆందోళన, భయంతోనే అధికార పార్టీ నేతలు ఈ విధంగా వ్యవహరిస్తున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
తారాస్థాయికి ప్రలోభాలు..
బలం లేకపోయినప్పటికీ బరిలోకి నిలిచి గెలిచేందుకు నానాకష్టాలు పడుతున్న అధికార పార్టీ...ప్రలోభాల పర్వాన్ని తారాస్థాయికి తీసుకెళ్లింది. ఒకవైపు ఈ నెల 3వ తేదీన ఎమ్మెల్సీ ఎన్నికలకు ఓటింగ్ జరుగుతోంది. ఇదే సందర్భంలో జిల్లాలో మల్యాల ఎత్తిపోతల పథకాన్ని పరిశీలించే పేరిట ముఖ్యమంత్రి పర్యటనను అధికార పార్టీ ఖరారు చేసింది. తద్వారా జిల్లాలో జరుగుతున్న ఎన్నికలపై ప్రభావం చూపే ప్రయత్నం చేసిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
టీడీపీ అధిష్టానానికి ఫిర్యాదు..
ఒకరిద్దరు ఎమ్మెల్యేలు తనకు సహకరించడం లేదని కూడా అధికార పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి శిల్పా చక్రపాణి రెడ్డి ఆందోళనలో ఉన్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో వీరిపై అధిష్టానానికి ఫిర్యాదు చేసినట్టు కూడా తెలుస్తోంది. తమ నియోజకవర్గాల్లో ఒకరిద్దరిని కూడా తమవైపు తిప్పుకోలేకపోయారని ఆయన ఈ ఫిర్యాదులో పేర్కొన్నట్టు సమాచారం. ఒకవైపు సొంత పార్టీ నేతల నుంచి మద్దతు లేదని కలవరపడుతున్న సదరు నేత.. సొంత నియోజకవర్గంలో కూడా ఓడిపోయిన తర్వాత చేసిన వ్యాఖ్యలు కాస్తా ఆయన్ను మరింత ఆందోళనకు గురిచేస్తోందన్న చర్చ నడుస్తోంది.
శ్రీశైలం నియోజకవర్గ ప్రజలు, నేతలు తనను మోసం చేశారంటూ.. ఓడిపోయిన తర్వాత ఆయన దూషించారన్న వార్త కూడా జిల్లాల్లో గుప్పుమంటోంది. ఈ వ్యాఖ్యలతో మనస్తాపానికి గురైన పలువురు ఓటర్లు ఇప్పుడు తమ ప్రతాపం చూయించేందుకు సిద్ధమవుతున్నారని కూడా తెలుస్తోంది. మొత్తం మీద బలం లేకపోయినా నిలిచి భంగపాటుకు గురి అవుతామనే ఆందోళన అధికార పార్టీ నేతల్లో కనిపిస్తోంది.
పచ్చ ప్రలోభాలు
Published Thu, Jul 2 2015 2:42 AM | Last Updated on Sun, Sep 3 2017 4:41 AM
Advertisement