బదిలీలకు బ్రేక్
- ఎన్నికలు ముగిసినా తప్పని ఎదురుచూపులు
- 24లోపు జరగాల్సిన బదిలీలు నిలుపుదల
- కొత్త ప్రభుత్వం వచ్చాకే నిర్వహణ
ఎన్నికల ప్రక్రియ ముగిసింది.. అయినా ఎన్నికల్లో భాగంగా నిర్వహించిన తాత్కాలిక బదిలీలకు మోక్షం కలగలేదు. కొత్త ప్రభుత్వం వచ్చాకే ఈ తతంగం చేపట్టే అవకాశముందని తెలుస్తోంది. దీంతో ఈ నెల 24లోపు జరగాల్సిన బదిలీల తంతుకు బ్రేక్ పడింది. జిల్లా నుంచి తాత్కాలికంగా ఇతర జిల్లాలకు వెళ్లిన ఎంపీడీవోలు, తహశీల్దార్లు, పోలీసులు పూర్వ స్థానాలకు వచ్చేందుకు మరో 15రోజులు పడిగాపులు తప్పేట్టు లేదు.
సాక్షి, మచిలీపట్నం : వరుస ఎన్నికల నేపథ్యంలో పొరుగు జిల్లాలకు బదిలీపై వెళ్లిన జిల్లా అధికారులను మళ్లీ వెనక్కి పంపే ప్రక్రియలో జాప్యం జరగనుంది. ఎన్నికల నేపథ్యంలో స్థానిక (సొంత జిల్లా) అధికారులు ఎవరూ ఉండకూడదన్న నిబంధనతో బదిలీలు జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది ఫిబ్రవరిలో జిల్లాకు చెందిన ఎంపీడీవోలు, తహశీల్దార్‌లు, పోలీసులను ఇతర జిల్లాలకు తాత్కాలికంగా బదిలీ చేశారు. 47 మంది ఎంపీడీవోలు, 42 మంది తహశీల్దార్లు, కొందరు పోలీసు అధికారులు ఉభయగోదావరి, గుంటూరు జిల్లాలకు బదిలీపై వెళ్లారు.
ఉభయగోదావరి, గుంటూరు జిల్లాల్లో పనిచేసే స్థానిక ఎంపీడీవోలు 47 మంది, 43 తహశీల్దార్‌లు, పోలీసులను కూడా కృష్ణాజిల్లాలో ఖాళీగా ఉన్న పోస్టుల్లో భర్తీ చేశారు. ఎన్నికల ప్రక్రియ పూర్తిగా ముగియడంతో ఎవరి స్థానాల్లోకి వారిని పంపేందుకు ఈ నెల 24వ తేదీలోగా కసరత్తు పూర్తి చేయాలంటూ ఉన్నతాధికారులు గతంలో ఆదేశాలు ఇచ్చారు. రాష్ట్రపతి పాలన అమలులో ఉన్నందున ఈ ప్రక్రియ విధివిధానాలపై ప్రధాన మంత్రి ఆమోదం తెలపాల్సి ఉంది.
ఇంతలోనే ప్రధాన మంత్రిగా ఉన్న మన్మోహన్‌సింగ్ తన పదవికి రాజీనామా చేయడంతో ఎన్నికల బదిలీలకు సాంకేతిక అభ్యంతరం వచ్చింది. దీనికితోడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పీకే మహంతి పదవీ విరమణ చేయడం, కొత్త సీఎస్‌ను నియమించకపోవడం కూడా కారణమని తెలుస్తోంది. దీంతో ఈ నెల 24వ తేదీలోగా చేయాల్సిన బదిలీలు ఆగిపోయాయి. జూన్ రెండో తేదీ తరువాత కేంద్ర, రాష్ట్రాల్లో ఏర్పడే కొత్త ప్రభుత్వాల ఆమోదం తీసుకుని ఈ బదిలీలు చేసేందుకు ఉన్నత స్థాయి అధికారులు యోచిస్తున్నట్టు సమాచారం.
కలెక్టర్‌కు బదిలీ ఉంటుందా?
రాష్ట్ర విభజన నేపథ్యంలో తెలంగాణ ప్రాంతానికి చెందిన కలెక్టర్ ఎం.రఘునందన్‌రావుకు బదిలీ ఉంటుందా అనేది అధికార యంత్రాంగంలో చర్చనీయాంశంగా మారింది. ఐఏఎస్‌లకు బదిలీలు లేకపోయినా కన్‌ఫమ్డ్ ఐఏఎస్‌గా ఉన్న రఘునందన్‌రావుకు బదిలీ తప్పదని పలువురు చెబుతున్నారు. అయితే ఆప్షన్లు ఉన్నందున ఆయన జిల్లాలోనే ఉండేలా కోరుకుంటారా, సొంత ప్రాంతానికి వెళ్లేందుకు ఆసక్తి చూపుతారా అనేది ఆసక్తిగా మారింది.
2013 అక్టోబర్ 13న జిల్లా కలెక్టర్‌గా వచ్చిన ఆయన అనతికాలంలోనే తనదైన ముద్ర వేశారు. అటు అధికార యంత్రాంగంలోను, ప్రజల్లోను మంచి అధికారిగా మన్ననలు పొందారు. ఇటీవల జరిగిన వరుస ఎన్నికల్లో ఆయన సమర్థవంతంగా పనిచేసి ఎటువంటి సమస్యలూ లేకుండా పనిచేసి శభాష్ అనిపించుకున్నారు. దీంతో ఆయన బదిలీ అంశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.