క్యాష్ కొట్టు.. ప్లాన్ పట్టు!
సాక్షి, విశాఖపట్నం : ఎన్నికల కోడ్ అభివృద్ధి పనులకు ఆటంకంగా మారిందేమో గానీ.. అక్రమాలకు మాత్రం అడ్డుకట్ట వేయలేకపోతోంది. పెపైచ్చు జీవీఎంసీ అధికారులకు కాసుల వర్షం కురిపిస్తోంది. రెండు నెలలుగా ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో నగరంలోని పలు జోన్లలో అక్రమ నిర్మాణాలు ఊపందుకున్నాయి. వీటికి టౌన్ ప్లానింగ్ సిబ్బంది, జోనల్ కమిషనర్లు(జెడ్సీ) కుమ్మక్కయి మరీ సహకరించారన్న ఆరోపణలున్నాయి.
ఆ నాలుగింటే అధికం!
జీవీఎంసీలో ఆది నుంచీ నగర శివారు జోన్ల(మధురవాడ, పెందుర్తి, గాజువాక)లో అక్రమ నిర్మాణాలు ఏ స్థాయిలో ఉంటాయో.. జోన్-2లో కూడా అంతే స్థాయిలో ఉంటాయి. విభజన తర్వాత ఊపందుకున్న అపార్ట్‌మెంట్ల నిర్మాణాలు అధికారులకు ఆదాయ మార్గాలుగా మారాయి. అపార్ట్‌మెంట్లలో ఫ్లాట్ల సంఖ్య ఆధారంగా భారీ మొత్తంలో ముడుపులు
వసూలు చేసినట్టు సమాచారం. సాధారణ సమయంలో భవన నిర్మాణ ప్లాన్ కోసం నెలల తరబడి తిరగాల్సి వస్తే.. ఎన్నికల కోడ్ సమయంలో మాత్రం వారం పది రోజుల్లోనే ప్లాన్ చేతికొచ్చే పరిస్థితి. ‘క్యాష్ కొట్టు.. ప్లాన్ పట్టు’ అన్న రీతిలో టౌన్‌ప్లానింగ్ అధికారులు వ్యవహరించారన్న ఆరోపణలున్నాయి. గతంలో జెడ్సీలకు, టౌన్‌ప్లానింగ్ సిబ్బందికి మధ్య విభేదాలెక్కువగా ఉండేవి. కమిషనర్ ‘మెతక’ వైఖ రి పుణ్యమా.. అని వీరిలో వీరు సర్దుకుపోతున్నారు. ప్రతి అక్రమ నిర్మాణంలో ‘మామూళ్లు’ గా సహకరించుకుంటున్నారు. దీనిపై భవన యజమానులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గతంలో డబ్బులు ఇచ్చి రోజుల తరబడి అధికారులు చుట్టూ ప్రదక్షిణలు తిరగాల్సి వచ్చేదని, ఇప్పుడా పరిస్థితి లేదని ఆనందపడుతున్నారు.
జోన్-3ది మరో దారి! : ఊరందరిదీ ఒకదారి.. ఉలిపికట్టెది మరో దారన్నట్టుగా ఉంటుంది.. జీవీఎంసీ జోన్-3 పరిస్థితి. ఇక్కడ భారీ నిర్మాణాలు చాలా తక్కువ. ఉన్నవంతా చిన్నా చితకా నిర్మాణాలు, అంతస్తులపై అంతస్తులు వేయడం. అయితే సెల్లార్ల ఆక్రమణలు మిగిలిన అన్ని జోన్ల కంటే ఇక్కడే ఎక్కువ. రామాంజనేయులు హయాంలో తొలగించిన సెల్లార్ ఆక్రమణలన్నీ మళ్లీ నిర్మాణాలు పూర్తి చేసుకుంటున్నాయి. దీనిపై ఎన్నిసార్లు.. ఎంతమంది ఫిర్యాదు చేసినా ఇటు కమిషనర్ గానీ, అటు జెడ్సీగానీ పట్టించుకున్న పాపాన పోలేదు. డాబాగార్డెన్స్ రోడ్డులో సెల్లార్ ఆక్రమణల వెనుక భారీ స్థాయిలో ముడుపులు చేతుల మారడమే.. అధికారుల నిర్లిప్తతకు కారణమన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. హైకోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో వీటిపై స్థానిక కోర్టుల మధ్యంతర ఉత్తర్వులు చెల్లవని తెలిసీ, అక్రమ నిర్మాణదారులకు అధికారులు సహకరిస్తుండడం గమనార్హం.