విశాఖపట్నం, చోడవరం: ఎన్నికల కోడ్‌ను లెక్క చేయకుండా చోడవరం ఎమ్మెల్యే కెఎస్‌ఎన్ రాజు పలువురికి ఇళ్ల స్థల పట్టాలను పంపిణీ చేయడం సర్వత్రా చర్చనీయాంశమైంది. ఈ విషయమై కలెక్టర్‌కు వైఎస్సార్‌సీపీ ఫిర్యాదు చేసింది. ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ రావడంతో సోమవారం నుంచి ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చింది. దీంతో ఎటువంటి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు, పట్టాల పంపిణీ తదితర కార్యక్రమాలు నిర్వహించరాదు. అయితే ఆ నింబధనను చోడవరం టీడీపీ ఎమ్మెల్యే తుంగలోకి తొక్కి వెంకన్నపాలెం, లక్ష్మీపురం రోడ్డు ప్రాంతాల్లో ప్రభుత్వ బంజరు భూమికి సంబంధించిన పట్టాలు పంపిణీ చేశారు. సుమారు 170 మంది లబ్ధిదారులకు అతని కార్యాలయంలో పట్టాలు పంపిణీచేసినట్టు తెలిసింది.
ముందస్తు తేదీతో పట్టాలను సిద్ధం చేయగా, చోడవరం తహసీల్దార్ సోమవారం ఉదయమే సంతకాలు చేసినట్టు సమాచారం. వెంకన్నపాలెంలో సర్వే నంబరు 420, చోడవరం శివారు లక్ష్మీపురంరోడ్డులో సర్వే నంబరు 18లో సబ్‌డివిజన్ 30లో పలువురు లబ్ధిదారులకు పట్టాలు ఇచ్చారు. ఈ పట్టాలు పంపిణీ చేయడంపై ప్రతిపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. పట్టాలు పంపిణీకి చోడవరంలో ఎమ్మెల్యే కార్యాలయం వద్దకు ముందుగా అందర్నీ రప్పించినప్పటికీ తర్వాత ఎన్నికల కోడ్ ఉన్నందున బహిరంగంగా ఇస్తే ఇబ్బందులు వస్తాయని కొందరు అధికారులు సూచించడంతో బహిరంగం పంపిణీని మానేశారు. తరువాతగుట్టుచప్పుడు కాకుండా లబ్ధిదారులందర్నీ ఒక్కొరిగా పిలిచి పట్టాలు పంపిణీ చేశారని తెలిసింది. ఇదంతా తహసీల్దార్ పర్యవేక్షణలోనే జరిగినట్టు తెలిసింది.
చోడవరం పంచాయతీ కార్యాలయాన్ని పట్టాల తయారీ కేంద్రంగా మారుచుకున్న ఎమ్మెల్యే ఇక్కడ నుంచే అన్నీ సిద్ధం చేసినట్టు సమాచారం. ఎన్నికల కోడ్ వచ్చినప్పటికీ నిబంధనలకు విరుద్ధంగా ఎమ్మెల్యే పట్టాలు పంపిణీ చేయగా దానికి రెవెన్యూ అధికారులు వెనకుండి నడిపించారని విమర్శలు వెల్లువెత్తాయి.
కలెక్టర్‌కు ౖఫిర్యాదు చేస్తాం: ధర్మశ్రీ
సోమవారం ఉదయం నుంచే ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చినప్పటికీ చోడవరం తహసీల్దార్, స్థానిక టీడీపీ ఎమ్మెల్యేతో కలిసి రెవెన్యూ భూమికి పట్టాలు పంపిణీచేశారని, దీనిపై కలెక్టర్‌కు, ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేయనున్నామని వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ చెప్పారు. ఎన్నికల నిబంధనలను తూచా తప్పకుండా పాటించాల్సిన అధికారులు ఇలా ఓ పార్టీకి కొమ్ముకాస్తూ ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించడం ఏంటని ఆయన మండిపడ్డారు. తహసీల్దార్‌పై వెంటనే చర్యలు తీసుకోవాలని ధర్మశ్రీ కోరారు. వెంకన్నపాలెంలో అయితే భూమిని లెవిలింగ్ చేయకుండా, ఇళ్లస్థలాలకు విభజించకుండా హడావిడిగా ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత కూడా పట్టాలు ఇచ్చారని ఇందులో చాలామంది టీడీపీకి చెందిన అనర్హులైన లబ్ధిదారులు ఉన్నారని ఆయన ఆరోపించారు. ఈ విషయాలపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment