ఈసీ కొరడా! | Election Commission Serious On Model Code Violations In Uttar Pradesh | Sakshi
Sakshi News home page

ఈసీ కొరడా!

Published Tue, Apr 16 2019 6:22 AM | Last Updated on Tue, Apr 16 2019 6:22 AM

Election Commission Serious On Model Code Violations In Uttar Pradesh - Sakshi

ఎన్నికల సమయంలో ఇష్టానుసారం మాట్లాడే నాయకుల తీరువల్ల దేశంలో వాతావరణం కలుషితమవుతున్నదని వాపోయే పౌరులకు ఉపశమనం కలిగే పరిణామాలు సోమవారం చోటుచేసుకున్నాయి. ఎన్నికల నియమావళిని ఉల్లంఘించే నాయకుల విషయంలో కఠిన చర్యలు ఎందుకు తీసుకోలేకపోతున్నారని ఎన్నికల సంఘం(ఈసీ)ను సుప్రీంకోర్టు ప్రశ్నించింది. దానికి ప్రస్తుతం ఉన్న అధికారాలేమిటో సమీక్షించదల్చుకున్నామని చెప్పింది. ఇది జరిగిన కొన్ని గంటలకే ఎన్నికల సంఘం వేగంగా స్పందించి ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి మాయావతి, సమాజ్‌వాదీ పార్టీ నాయకుడు ఆజంఖాన్, కేంద్ర మంత్రి మేనకాగాంధీలపై కఠిన చర్యలు తీసుకుంది. యోగి ఆదిత్యనాథ్, ఆజంఖాన్‌లు 3 రోజులపాటు... మాయావతి, మేనకాగాంధీలు 2 రోజులపాటు ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉండాలని ఆంక్షలు విధించింది. వీరంతా నిషేధం అమల్లో ఉన్న సమయంలో బహిరంగసభలు, రోడ్‌షోలు, విలేకరుల సమావేశాలు వగైరాల్లో పాల్గొనకూడదు. ఎన్నికల బరిలో అభ్యర్థులుగా లేదా స్టార్‌ కాంపెయినర్లుగా ఉన్న ఈ నాయకులు ఈ కీలక ఘట్టంలో మూగనోము పట్టవలసిరావడం ఎంత కష్టమో వేరే చెప్పనవసరం లేదు. ప్రజలకు మాత్రం మేలే జరిగింది. 

పరస్పరం విమర్శించుకోవడం, ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకోవడం ఎన్నికల సమ     యంలో సర్వసాధారణం. కానీ కొన్నేళ్లుగా ఇదంతా మారింది. ప్రత్యర్ధులపై వ్యక్తిగత దూషణలకు దిగడం, ఎంతటి తీవ్రమైన తప్పుడు ఆరోపణలనైనా అలవోకగా చేయడం నాయకులకు అలవాటై పోయింది. ఇటీవల బీజేపీలో చేరి తనపై పోటీ చేస్తున్న సినీ నటి జయప్రదపై సమాజ్‌వాదీ పార్టీ నాయకుడు ఆజం ఖాన్‌ రెండురోజులక్రితం అసభ్యకర వ్యాఖ్యలు చేశారు. యోగి ఆదిత్యనాథ్‌ పది పన్నెండురోజుల క్రితం మన సైనిక దళాలను ‘మోదీ సైన్యం’గా అభివర్ణించి అందరినీ విస్మయపరి చారు. దానిపై ఎన్నికల సంఘం స్పందించి నోటీసులు జారీచేసినా ఆయనగారి ధోరణి మారలేదు. ‘విపక్షం దగ్గర అలీ ఉంటే...మన దగ్గర బజరంగ్‌బలి ఉన్నారు’ అని మాట్లాడారు. అటు మాయావతి ముస్లింలంతా ఎస్‌పీ–బీఎస్‌పీ కూటమికి ఓటేయాలని నేరుగా పిలుపునిచ్చారు. చిత్రమేమంటే వివాదాలకు ఎప్పుడూ దూరంగా ఉన్నట్టు కనబడే మేనకాగాంధీ తీరు కూడా ఈ ఎన్నికల్లో మారింది. ఒక సభలో ఆమె ముస్లింలనుద్దేశించి బెదిరింపు ధోరణితో మాట్లాడారు. ‘నాకు ఓటేయకపోతే నష్టపోయేది మీరే’ అంటూ హెచ్చరించారు. 

ఇది ఒక్క ఉత్తరప్రదేశ్‌కు మాత్రమే పరిమితం కాలేదు. అన్నిచోట్లా ఇదే ధోరణి. ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల్లో ఆ రాష్ట్ర సీఎం చంద్రబాబు నాయుడు, జనసేన నాయకుడు పవన్‌ కల్యాణ్‌ చేసిన ప్రసంగాలు ఇందుకు ఉదాహరణ. వీరి నోటి వెంబడి ‘తోకలు కత్తిరిస్తా...పిచ్చిపిచ్చిగా ఉందా... తోలుతీస్తా’ వగైరా బెదిరింపులు పుంఖానుపుంఖాలుగా వెలువడేవి. రాయలసీమ ప్రజలను, ప్రత్యేకించి పులివెందుల ప్రజలను ఆ ఇద్దరు నేతలూ తరచు అవమానిస్తూ మాట్లాడారు. డాంబికా లకు పోతే జనం తమను హీరోలనుకుంటారని, అమాయకంగా నమ్మి ఓట్లు కుమ్మరిస్తారని వీరి నమ్మకం. కానీ ‘అమ్మ పుట్టిల్లు మేనమామకెరుక’ అన్నట్టు ఈ నాయకుల సంగతి తెలియనిదెవరికి? చంద్రబాబు పోలింగ్‌ తేదీ దగ్గరపడేకొద్దీ ఏం మాట్లాడుతున్నారో కూడా స్పహలేనట్టు వ్యవహరిం చారు. వైఎస్సార్‌కాంగ్రెస్‌ అధినేత, ప్రతిపక్ష నాయకుడు జగన్‌మోహన్‌రెడ్డిని దుర్భాషలాడారు. ‘నా ఆస్తి లక్ష కోట్లు’ అని, ‘ప్రజలకు డబ్బులు పంచుదామంటే ఆదాయం పన్ను విభాగం దాడులవల్ల సాధ్యపడలేద’ని నోరు జారారు. సొంత డబ్బు ఇవ్వలేకపోవడంతో ప్రభుత్వ సొమ్ముని పంచానని చెప్పేశారు. మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసు విషయంలో తప్పుడు ఆరోపణలు చేయడం బాబు నైజానికి ఉదాహరణ. ఆ కేసు గురించి ఎవరూ ఎక్కడా మాట్లాడరాదని ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు ఆంక్షలు విధించింది. కానీ ఇలాంటి సూచనలు, ఆంక్షలు చంద్రబాబు ముందు పనిచేయవు. తనకు మేలు జరుగుతుందనుకుంటే ఆయన ఎంతకైనా తెగిస్తారు. 

ఇంత పెద్ద దేశంలో ఎన్నికలు జరుగుతున్నప్పుడు ఎన్నికల సంఘం ఈ నేతలందరినీ ఓ కంట కనిపెట్టి ఉండటం కష్టం కదా అన్న అనుమానం ఎవరికైనా వస్తుంది. అయితే దానికి అవసరమైన మందీమార్బలం సంఘం దగ్గరుంటుంది. 2014 సార్వత్రిక ఎన్నికల్లో దేశవ్యాప్తంగా 84,441మంది వీడియోగ్రాఫర్లను, 66,640మంది ఫొటోగ్రాఫర్లను సంఘం వినియోగించింది. వీరంతా సంచార నిఘా సిబ్బందితోపాటు నియోజకవర్గాల్లో పనిచేశారు. నాయకుల ప్రసంగాలను చిత్రీకరించడం, ఫొటోలు తీయడం వీరి పని. అల్లర్లు జరిగే అవకాశం ఉండే కేంద్రాలవద్ద పోలింగ్‌నాడు ఈ వీడియోగ్రాఫర్లు, ఫొటోగ్రాఫర్లు నిశితంగా గమనిస్తుంటారు. ఈసారి ఎన్నికల్లో ఈ సిబ్బంది సంఖ్య మరింత పెరిగి ఉంటుంది. వీరుగాక 24 గంటలపాటు వార్తలు అందజేసే వార్తా చానెళ్లు వచ్చాయి. అయితే విషాదమేమంటే నాయకులపై చర్యలు తీసుకోవడంలో ఎన్నికల సంఘం అలసత్వాన్ని ప్రదర్శిస్తోంది. తనంత తాను చర్యలు తీసుకోవడం మాట అటుంచి ఫిర్యాదు చేసినా వెనువెంటనే కదలడం లేదు. 

బాబు మాట్లాడిన మాటలు ఖచ్చితంగా నియమావళి ఉల్లంఘన కిందికొస్తాయి. అయినా చర్యలు లేవు. సుప్రీంకోర్టు సోమవారం ఎన్నికల సంఘాన్ని నిలదీసింది ఇలాంటి అలసత్వం గురించే. తమకు పరిమిత అధికారాలు మాత్రమే ఉన్నాయని ఎన్నికల సంఘం చేసిన వాదనను కూడా సర్వోన్నత న్యాయస్థానం అంగీకరించినట్టు లేదు. ఆ అధికారాలేమిటో తాము సమీక్షిస్తామన్నది. అందుకే కావొచ్చు...నోటీసులతో, మందలింపులతో సరిపుచ్చే వైఖరిని మార్చుకు ని ఎన్నికల సంఘం వెనువెంటనే కఠిన చర్యలకు దిగింది. ‘చూస్తూ ఉంటే...మేస్తూ పోయాడ’న్నట్టు ఊరుకున్నకొద్దీ నాయకుల వాచాలత్వం శ్రుతి మించుతోంది. ఇందువల్ల ఎన్నికల ప్రక్రియ మొత్తం నవ్వులపాలవుతోంది. తాజా చర్యలతోనైనా పరిస్థితి మెరుగుపడితే జనం సంతోషిస్తారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement