ఆదోనిలో ర్యాలీ నిర్వహిస్తున్న విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులు
కర్నూలు, ఆదోని: తమ డిమాండ్ల సాధన కోసం నిరవధిక సమ్మెకు దిగిన విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులపై ఉక్కుపాదం మోపేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. సమ్మె చేసిన వారి స్థానంలో కొత్త వారిని నియమించేందుకు యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టాలని ట్రాన్స్‌కో ఉన్నత స్థాయి అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఇందులో ఏజెన్సీ నిర్వాహకులు అలక్ష్యం ప్రదర్శిస్తే వారిపై చర్యలకు కూడా వెనుకాడొద్దని అందులో పేర్కొన్నారు. ఈ నెల 20 సాయంత్రం 6 గంటల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అవుట్ సోర్సింగ్ విద్యుత్తు కార్మికులు నిరవధిక సమ్మెకు దిగారు.
తానిచ్చిన హామీలను నెరవేర్చమంటే..
ఎన్నికల ముందు సీఎం చంద్రబాబు అర్హత కలిగిన కాంట్రాక్ట్ కార్మికులందరినీ శాశ్వత ఉద్యోగులుగా నియమిస్తామని, మిగిలిన వారికి శాశ్వత ఉద్యోగులకు సమానంగా సమాన పనికి సమాన వేతనం ప్రాతిపదికన వేతనం చెల్లిస్తామని హామీ ఇచ్చారు. హామీలు అమలు కోసం నాలుగేళ్లలో కార్మికులు ఆందోళనలు నిర్వహించారు. ఈక్రమంలోనే అనివార్య పరిస్థితుల్లో నిరవధిక సమ్మెకు దిగారు. డిమాండ్లను పరిష్కరించక పోగా సమ్మెలో వెళ్లిన వారి స్థానంలో తాత్కాలిక ప్రాతిపదికన కొత్త వారిని నియమించాలని ఆదేశాల జారీ చేయడం పట్ల కార్మికులు మండిపడుతున్నారు.
వ్యథా భరితం..
జిల్లాలో మొత్తం 200 వరకు సబ్‌స్టేషన్లు ఉన్నాయి. ఇందులో ఒక్కో సబ్ స్టేషన్‌లో నలుగురు ఆపరేటర్లు, ఒక వాచ్‌మెన్ చొప్పున మొత్తం వెయ్యి మంది వరకు పని చేస్తున్నారు. ఆదోని, కర్నూలు, నంద్యాల డివిజన్ కార్యాలయాల పరిధిలో ఫోల్ టు ఫోల్ వర్కర్లు, బిల్లింగ్, స్పాట్ బిల్లింగ్, ఎస్పీఎం కార్మికులు మరో వెయ్యి మంది దాకా ఉంటారు. ఏజెన్సీల ద్వారా ప్రస్తుతం నెలకు రూ.6500 నుంచి రూ.12000 వరకు వేతనం చెల్లిస్తున్నారు. వేతనాల నుంచి మినహాయించుకుంటున్న ఈపీఎఫ్, ఈఎస్‌ఐ కంతులను కొంత మంది ఏజెన్సీ నిర్వాహకులు స్వాహా చేసిన సందర్భాలూ ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాలలో పని చేస్తున్న కార్మికులకు ఈఎస్‌ఐ సదుపాయం కల్పించడంలేదు. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయినా ఎలాంటి పరిహారం అందకపోవడంతో వారిపై ఆధారపడిన కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. మరోవైపు అధికారులు, ఏజెన్సీ నిర్వాహకులు, రాజకీయ నాయకులకు నచ్చకపోయినా నిర్దాక్షిణ్యంగా విధుల నుంచి తొలగిస్తున్నారు.
కార్మికుల్లోచీలికకు కుట్ర?
కాగా తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ నిరవధిక సమ్మెకు దిగిన కార్మికుల్లో చీలిక తెచ్చేందుకు కుట్ర జరుగుతోందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. అధికార పార్టీకి అనుబంధంగా ఉన్న తెలుగునాడు ట్రేడ్ యూనియన్‌తో పాటు 1104 యూనియన్లు సమ్మెకు దూరంగా ఉన్నాయి. సమ్మెలో వెళ్లొద్దని కూడా తమ యూనియన్లలో సభ్యత్వం ఉన్న కార్మికులకు సూచించినట్లు సమాచారం.
ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాం
కాంట్రాక్ట్ కార్మికులు సమ్మెలో వెళ్లడంతో విద్యుత్ సరఫరాలో ఎలాంటి అంతరాయం తలెత్తకుండా శాశ్వత ఉద్యోగులకు అదనపు బాధ్యతలు అప్పగించాం. కొంతమంది కాంట్రాక్ట్ కార్మికులు కూడా విధులకు హాజరవుతున్నారు. దీంతో కొత్త వారిని నియమించే అవసరం రాలేదు. – చెంచెన్న,ట్రాన్స్‌కో డీఈఈ
Comments
Please login to add a commentAdd a comment