సామాన్యునికే షాక్ ! | electricity bills Arrears in Vizianagaram | Sakshi
Sakshi News home page

సామాన్యునికే షాక్ !

Published Tue, Feb 24 2015 3:32 AM | Last Updated on Wed, Sep 5 2018 3:44 PM

electricity bills Arrears in Vizianagaram

 విజయనగరం మున్సిపాలిటీ: తప్పొకరిది..శిక్ష మరొకరిది అన్నట్లు తయారైంది విద్యుత్ వినియోగదారుల పరిస్థితి.  ప్రభుత్వ శాఖలు రూ.కోట్లలో విద్యుత్ బిల్లుల బకాయిలు చెల్లించకపోవడంతో  నష్టాల సాకుతో విద్యుత్ శాఖాధికారులు సాధారణ వినియోగదారులపైనే భారం మోపుతుండడంతో మాకు ఇదేం శిక్ష అంటూ జిల్లాలోని విద్యుత్ వినియోగదారులు వాపోతున్నారు.  జిల్లాలోని ప్రభుత్వ శాఖలు చెల్లించాల్సిన బిల్లుల బకాయిలు విద్యుత్ శాఖకు గుదిబండగా మారాయి. జిల్లాలో ప్రభుత్వ రంగ సంస్థలు  అధికారిక లెక్కల ప్రకారం రూ.28.73 కోట్లు విద్యుత్ బిల్లులు  బకాయిపడ్డాయి. ఇదేంటని ప్రశ్నిస్తే ప్రభుత్వం ఖజానా ద్వారా చెల్లింపులు జరిపేందుకు వీలులేకుండా ఫ్రీజింగ్ విధించడం వల్ల కొంత మొత్తం నిలిచిపోయినట్లు సెలవిస్తున్నారు. అయితే ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలను వసూలు చేసుకోవడం మానేసి నష్టాలను పూడ్చుకునేందుకు ఏటా చార్జీలు పెంచుతూ సామాన్య వినియోగదారునిపై విద్యుత్ శాఖ భారం మోపుతోంది.
 
 పేరుకుపోయిన  బకాయిలు
 జిల్లాలో వివిధ ప్రభుత్వ శాఖల నుంచి విద్యుత్ శాఖకు రూ.28.73 కోట్లు  రావాల్సి ఉన్నట్లు అధికారిక లెక్కలు వెల్లడిస్తున్నాయి. ఇందులో మైనర్‌పంచాయతీలకు సంబంధించి  అత్యధికంగా రూ.16 కోట్లు రావాల్సి ఉండగా... ఎల్‌టీ సర్వీసుల కింద ఉన్న ప్రభుత్వ కార్యాలయాలు, ఆస్పత్రుల నుంచి రూ.2.04 కోట్లు, హెచ్‌టీ  సర్వీసుల కింద జిల్లా కేంద్రాస్పత్రి నుంచి రూ.85 లక్షలు, కలెక్టర్ కార్యాలయంలోని వివిధ ప్రభుత్వ శాఖల నుంచి రూ.కోటి వరకు బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయి. అంతేకాకుండా విజయనగరం, సాలూరు, బొబ్బిలి, పార్వతీపురం మున్సిపాలిటీల నుంచి మరో రూ.74 లక్షలు వసూలు కావాల్సి ఉంది. అలాగే ఎస్సీ, ఎస్టీ  కేటగిరీలకు చెందిన వినియోగదారుల 50 యూనిట్ల లోపు విద్యుత్ వినియోగించే వారు బిల్లులు చెల్లించక్కర్లేదని ప్రభుత్వమే చెల్లిస్తుందని గతంలో ప్రకటించింది.
 
 అయితే 2013వ సంవత్సరం మార్చి నెల నుంచి ఇప్పటి వరకు  ఈ కేటగిరీలో కేటాయించిన విద్యుత్‌కు సంబంధించి ప్రభుత్వం బిల్లులు చెల్లించని పరిస్థితి ఉంది. ఈ లెక్కన చూసుకుంటే  జిల్లా వ్యాప్తంగా సుమారు 16వేల మంది ఎస్సీ వినియోగదారులు నెలకు 0 నుంచి 50 యూనిట్ల లోపు విద్యుత్‌ను వినియోగిస్తుండగా..ఆ మొత్తం రూ.5.30కోట్లు బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. ఈ బిల్లులు జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ నుంచి ప్రభుత్వం చెల్లిస్తుంది. అయితే ఇందుకు సంబంధించిన నిధులు ప్రభుత్వం ఇటీవలనే విడుదల చేసినట్లు తెలుస్తుండగా... సంబంధిత శాఖ అధికారులు వాటిని నిజనిర్ధారణ చేసుకున్న తరువాతనే బిల్లులు విడుదల చేస్తామని చెబుతున్నట్లు సమాచారం.
 
 అలాగే ఎస్టీ వినియోగదారులు సుమారు 8వేల మందికి పైగా ఉండగా... గత రెండేళ్లలో వారు వినియోగించిన విద్యుత్‌కు సంబందించి రూ2.80కోట్లు రావాల్సి ఉంది. ఈ మొత్తాన్ని ఐటీడీఏ విడుదల చేయాల్సి ఉండగా.. అనుమతి కోసం ఉన్నతాధికారులకు లేఖలు రాయడం మినహా బిల్లుల చెల్లింపులు చేయడం లేదు. వాస్తవానికైతే ప్రభుత్వ శాఖల బిల్లుల బకాయిల మొత్తం విషయంలో విద్యుత్ శాఖ అధికారులు  చెబుతున్న లెక్కల కన్నా పెద్ద మొత్తంలోనే బకాయిలు ఉన్నట్లు సమాచారం.
 
 నోటీసులకు స్పందన కరువు
  బకాయిలు చెల్లించాలని  ప్రభుత్వ శాఖలకు విద్యుత్ శాఖాధికారులు నోటీసులు పంపిస్తున్నా ఫలితం లేకుండా పోతోంది. నోటీసులు మీద నోటీసులు వస్తున్నాయని ఉన్నతాధికారులకు విషయం తెలియజేస్తున్నా ప్రభుత్వం నుంచి అనుమతి రాకుంటే బడ్జెట్ లేదంటూ ఆయా శాఖలు బకాయిలు చెల్లించకుండా చేతులెత్తేస్తున్నాయి. ఇదిలా  ఉండగా సుమారు నెల రోజులుగా ఖజానా ద్వారా ఎటువంటి చెల్లింపులూ జరగకుండా ప్రభుత్వం ఫ్రీజింగ్ విధించడం విద్యుత్ శాఖకు కఠిన పరీక్షగా మారుతోంది.  
 
 జిల్లాలో వివిధ శాఖల నుంచి కోట్లాది  రూపాయలు బిల్లుల రూపంలో రావాల్సి ఉన్నా విద్యుత్ శాఖ అధికారులు మాత్రం  ఉదాసీనంగా వ్యవహరించాల్సిన  పరిస్థితి తలెత్తింది. అయితే సామాన్య వినియోగదారు దగ్గర నుంచి బిల్లులు వసూలు చేయడంలో విద్యుత్ శాఖ అధికారులు వెనక్కి తగ్గడం లేదు. నిర్ణీత సమయంలో బిల్లు చెల్లించని విద్యుత్ కనెక్షన్‌లను తొలగిస్తున్నారు. అప్పటికీ చెల్లించకపోతే  ఆర్‌ఆర్‌యాక్ట్ ఉపయోగించి ఆస్తులు జప్తు చేసేందుకు సన్నద్ధమవుతున్నారు. సాధారణ వినియోగదారుని  బిల్లు బకాయి విషయంలో ఒకలా... ప్రభుత్వ శాఖల బిల్లుల బకాయి వసూళ్ల విషయంలో మరోలా వ్యవహరిస్తున్న విద్యుత్ శాఖ అధికారుల తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement