హైదరాబాద్ లాంటి రాజధానులను నాలుగైదు నిర్మిస్తానంటూ రెండు నెలలుగా పదేపదే చెప్పుకుంటూ తిరుగుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇప్పటికీ రాజధాని ఎక్కడన్నది స్పష్టతనివ్వలేదు. ఆలస్యమవుతున్న కొద్దీ మా ప్రాంతంలో రాజ ధాని నిర్మించండంటూ రాష్ర్టవ్యాప్తంగా అన్నిచోట్ల నుంచి డిమాం డ్లు ఎక్కువవుతున్నాయి.. ఒక్క మన జిల్లా నుంచి తప్ప. మొదట్లో ఏలూరును రాజధాని చేయాలన్న డిమాండ్‌ను ఇక్కడి వారు గట్టిగానే వినిపించారు.
ఈ మేరకు రాజధాని సాధన సమితి కూడా ఏర్పడింది. ఓ దశలో రాజధాని కాకపోయినా, కనీసం అన్ని సహజ శక్తి వనరులున్న ఏలూరును విజయవాడ, గుంటూరులతో కలిపి త్రినగరిగా ప్రకటించాలన్న వాదనలూ వినిపించారు. హఠాత్తుగా ఆ గొంతు మూగబోయింది. సీఎం చంద్రబాబు ముందు కూర్చునో, కనీసం నిలబడో జిల్లాకు ఏమైనా చేయమని అడిగే ధైర్యమే ఇక్కడి నేతలకు లేదు. ఇక రాజధాని గురించి ఏమడుగుతారు. కానీ కనీసం అడిగేవాళ్లని కూడా టీడీపీ నేతలు బెదిరిస్తున్నారట. ఆ మధ్యన ఏలూరును రాజధానిగా చేయాలని, లేదా త్రినగరిలో చేర్చాలని నగరానికి చెందిన ఓ ప్రముఖుడు తన వాదనను పత్రికల్లో గట్టిగా విని పించారట.
అంతే.. అధికార పార్టీకి చెందిన ఓ ప్రజాప్రతినిధి సదరు మాస్టారుకుఫోన్‌చేసి.. ‘అలాంటి డిమాండ్లు అడగడానికి నువ్వెవరు. మా పార్టీని, మా బాబు గారిని ఇబ్బంది పెట్టే ఇలాంటి డిమాండ్లు ఇంకోసారి రావడానికి వీల్లేదు’ అని గట్టిగా క్లాస్ పీకారట. నగరంలో వ్యాపార ప్రయోజనాలున్న తమకు అధికారపార్టీ వాళ్లతో ఎందుకొచ్చిన గొడవని ఆయనతో సహా సదరు ప్రముఖులంతా మిన్నకుండిపోయారట. ‘అమ్మ పెట్టదు...’ సామెత గుర్తుందిగా. ఇదీ ఏలూరు నేతల వరస. ఇలాగైతే మన ‘ఏరులూరు’ ఎప్పటికి ‘ఏలే ఊరు’ అవుతుందో?
- జి.ఉమాకాంత్, సాక్షి ప్రతినిధి, ఏలూరు
మూగబోయిన ‘రాజధాని ఏలూరు’
Published Sun, Aug 3 2014 2:05 AM | Last Updated on Fri, Aug 10 2018 9:40 PM
Advertisement