ఏలూరు పోలీసులే చంపించారు | Eluru police to involves triple murder case, allegations raised | Sakshi
Sakshi News home page

ఏలూరు పోలీసులే చంపించారు

Published Thu, Oct 16 2014 10:15 AM | Last Updated on Mon, Jul 30 2018 8:29 PM

ఏలూరు పోలీసులే చంపించారు - Sakshi

ఏలూరు పోలీసులే చంపించారు

 సాక్షి ప్రతినిధి, విజయవాడ : పెద్ద అవుటపల్లి వద్ద జరిగిన ముగ్గురి హత్య కేసులో మరో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. ఏలూరు పోలీసుల పాత్రపై రోజురోజుకూ ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. హంతకులకు పోలీసులు సహకరించారని, దగ్గరుండి హత్య చేయించారని బాధితుల బంధువులు ఆరోపిస్తున్నారు. పెద అవుటపల్లి ఘటన అనంతరం రక్షణగా వచ్చిన పోలీసులు హతుల కార్లలో పారిపోవడం కూడా వారి ఆరోపణలకు బలాన్ని చేకూరుస్తోంది.

 

మరోవైపు గతంలో జరిగిన దుర్గారావు హత్యకు కూడా పోలీసులు సహకరించారని సమాచారం. దీంతో విజయవాడ పోలీసులు ఈ విషయంపై పూర్తిస్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసుల్లో ఏలూరు వన్‌టౌన్ పోలీసులు ఏ స్థాయిలో లంచాలు తీసుకున్నారు.. ఎవరి వద్ద ఎంతెంత తీసుకున్నారనే కోణంలోనూ దర్యాప్తు సాగుతున్నట్లు సమాచారం. పోలీసుల ఆధ్వర్యానే హత్యలు : శ్రీనాథ్ మృతుడు గంధం నాగేశ్వరావు భార్య గంధం యాదగిరమ్మ విజయవాడ పోలీస్ కమిషనర్ ఏబీ వెంకటేశ్వరావును బుధవారం కలిసి తమ వారిని ఏలూరు వన్‌టౌన్ పోలీసులే దగ్గరుండి హత్య చేయించారని ఆరోపించారు. తమకు రక్షణ కల్పించాలని కోరారు.

 

అనంతరం మృతుడు మారయ్య కుమారుడు శ్రీనాథ్ కమిషనరేట్ ఆవరణలో మీడియాతో మాట్లాడుతూ తన తాత, నాన్నలను చంపించింది ఏలూరు పోలీసులేనని చెప్పారు. గతంలో ఒకసారి కోర్టు వాయిదాకు వస్తామని తన తండ్రి చెబితే రావద్దని ఏలూరు పోలీసులే చెప్పారని పేర్కొన్నారు. కానీ, హత్య జరిగిన రోజు వాయిదాకు కచ్చితంగా రావాల్సిందేనని పిలిపించారని చెప్పారు. వాయిదాకు రాకుంటే అరెస్ట్ వారెంటు వస్తుందని నమ్మకంగా పిలిపించి హత్య చేయించారని ఆరోపించారు. ప్రస్తుతం తమను ఏలూరు పోలీసులు వేధిస్తున్నారని, తన చిన్నమ్మ లక్ష్మిని స్టేషన్‌కు రావాలని ఇబ్బంది పెడుతున్నారని పేర్కొన్నారు. గతంలో హత్యకు గురైన దుర్గారావు కేసులో లక్ష్మి నిందితురాలంటూ పోలీసులు వేధిస్తున్నట్లు చెప్పారు.
 
 ఇరువర్గాల నుంచి ముడుపులు!
 పశ్చిమగోదావరి జిల్లా పినకడమికి చెందిన తూరపాటి నాగరాజు కుమారుడు టి.శివకృష్ణ అదే గ్రామానికి చెందిన భూతం గోవిందు కుమార్తె ఉమాదేవిని ప్రేమించి 2006లో బంధువులకు ఇష్టం లేకపోయినా పెళ్లి చేసుకున్నాడు. తనను కుటుంబ సభ్యులు వేధిస్తున్నారని 2009లో ఉమాదేవి పెదవేగి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, 498ఎ, 507 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. కొద్ది రోజుల తర్వాత రాజీ పడటంతో కేసు కొట్టివేశారు. ఈ కేసుతోనే గోవిందు, నాగరాజు కుటుంబాల మధ్య ఆజ్యం మొదలైంది. తమపై ఆధిపత్యం చెలాయించేందుకు ప్రయత్నిస్తున్నాడని గోవిందు అన్న దుర్గారావును నాగరాజు వర్గీయులు హత్య చేయించారు.

 

ఇందుకు పరోక్షంగా ఏలూరు వన్‌టౌన్ పోలీసులు సహకరించారని దుర్గారావు బంధువులు అప్పట్లో ఆరోపించారు. దుర్గారావును హత్య చేయించిన వారిని వదిలేది లేదని, వారిని హతమార్చిన తర్వాతే  కర్మకాండలు చేస్తామని భూతం గోవిందు, ఆయన తమ్ముడు శ్రీనులు ప్రతిజ్ఞ చేసినట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే నాగరాజు వర్గీయులైన గంధం నాగేశ్వరరావు, మారయ్య, పగిడి మారయ్యలను హత్య చేయించినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఈ ముగ్గురి హత్యలతోనూ ఏలూరు పోలీసులకు సంబంధం ఉందని, డబ్బు కోసం వారు ఏదైనా చేస్తారని హతుల బంధువులు ఆరోపించడంతో పోలీసు శాఖలో కలకలం మొదలైంది. పైగా పోలీసుల తీరు కూడా పలు అనుమానాలకు తావివ్వడంతో కేసు ఏలూరు వన్‌టౌన్ పోలీసుల మెడకు చుట్టుకునే అవకాశం లేకపోలేదు.  
 
 సహకరించినా హత్యానేరమే..
 హంతకులకు ప్రత్యక్ష్యంగా లేదా పరోక్షంగా సహకరించిన ఎవరికైనా హత్యానేరం కింద శిక్షపడుతుందని సీపీ ఏబీ వెంకటేశ్వరావు చెబుతున్నారు. ఉన్నతాధికారులకు కూడా చెప్పకుండా పారిపోయిన పోలీసులపై కేసు నమోదు చేస్తారా.. లేదా అనే విషయంపై త్వరలోనే స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement