మీరటు.. మీరు ఇటు.. | employees allotment started | Sakshi
Sakshi News home page

మీరటు.. మీరు ఇటు..

Published Tue, May 20 2014 2:13 AM | Last Updated on Sat, Sep 2 2017 7:34 AM

మీరటు.. మీరు ఇటు..

మీరటు.. మీరు ఇటు..

 ఉద్యోగుల తాత్కాలిక కేటాయింపులు ప్రారంభం
 
 సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజనలో కీలకమైన రాష్ట్రస్థాయి ఉద్యోగులను ఇరు రాష్ట్రాలకు కేటాయించే కార్యక్రమం ప్రారంభమైంది. వచ్చే నెల 2 నుంచి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు వేర్వేరుగా పనిచేయడానికి వీలుగా ఉద్యోగుల పంపిణీ  చేపడుతున్నారు. స్థానికత ఆధారంగా ఉద్యోగులను ఇరు రాష్ట్రాలకు తాత్కాలికంగా కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఉద్యోగుల పంపిణీ మార్గదర్శకాలు, తుది పంపిణీని రెండు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు ఏర్పాటయ్యాకే చేపడతారు. ఈలోగా  శాఖలు, విభాగాలవారీగా ఇరు రాష్ట్రాలకు ఉద్యోగులను తాత్కాలికంగా కేటాయిస్తున్నారు. పోలీసు శాఖ ఉద్యోగుల్లో ఎవరు ఏ రాష్ట్రంలో పనిచేయాలో తెలియజేస్తూ ఆర్థిక శాఖ సోమవారం హోం శాఖకు ప్రజెంటేషన్ ఇచ్చింది. మంగళవారం సాధారణ పరిపాలన శాఖ ఉద్యోగులపై ఆ శాఖ అధికారులకు ప్రజెంటేషన్ ఇవ్వనుంది. అన్ని శాఖలకు ఆర్థిక శాఖ ఇదే విధమైన ప్రజెంటేషన్ ఇచ్చి, ఆయా శాఖాధిపతుల సంతకాలు తీసుకుంటోంది. స్థానికత ఆధారంగా ఏ ప్రాంతం ఉద్యోగులే ఆ ప్రాంతంలో పనిచేయాలని స్పష్టం చేస్తోంది. మొత్తం రాష్ట్రస్థాయి కేడర్ పోస్టులు 76 వేలు కాగా అందులో ప్రస్తుతం 56 వేల మంది మాత్రమే పనిచేస్తున్నారు. 20 వేల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. సచివాలయం, కొన్ని శాఖాధిపతుల కార్యాలయాల్లో పైస్థాయి పోస్టుల్లో తెలంగాణకు చెందిన వారు తక్కువ మంది ఉన్నారు.

దీంతో తెలంగాణకు అవసరమయ్యే ఉద్యోగులను తాత్కాలికంగా ఆంధ్రప్రదేశ్ నుంచి సర్దుబాటు చేస్తున్నారు. వీరు తెలంగాణ రాష్ట్రంలో పనిచేసినంత కాలం తెలంగాణ ప్రభుత్వమే వారికి జీతభత్యాలను చెల్లించనుంది. తెలంగాణలో ఏదైనా కేడర్‌లో తక్కువ మంది ఉద్యోగులుంటే ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఉద్యోగుల్లో ఆసక్తి చూపేవారిని తాత్కాలికంగా కేటాయిస్తున్నారు. ఎవరూ ఆసక్తి కనబరచకపోతే ఆర్థిక శాఖే కొందరిని తాత్కాలికంగా తెలంగాణకు కేటాయిస్తుంది. సచివాలయంలోని సాధారణ పరిపాలన శాఖలో పైస్థాయిలోని అదనపు, సంయుక్త, ఉప కార్యదర్శులు మొత్తం 83 మంది ఉండగా, జనాభా నిష్పత్తి ప్రకారం ఆంధ్రప్రదేశ్‌కు 47 మందిని, తెలంగాణకు 36 మందిని కేటాయించారు. 151 మంది సహాయ కార్యదర్శుల్లో ఆంధ్రప్రదేశ్‌కు 91 మందిని, తెలంగాణకు 70 మందిని కేటాయించారు. అయితే, తెలంగాణకు చెందిన వారు 60 మంది మాత్రమే ఉండటంతో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 10 మందిని తాత్కాలికంగా తెలంగాణకు కేటాయించనున్నారు. రాజధానిలో ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగులను మాత్రమే ప్రస్తుతం పంపిణీ చేస్తున్నారు. జిల్లాల్లోని రాష్ట్రస్థాయి కేడర్ ఉద్యోగులను ప్రస్తుతానికి కదిలించడం లేదు.

 ఆరు అంచెల్లో ఉద్యోగుల శాశ్వత పంపిణీ

 ఇదిలా ఉండగా రెండు రాష్ట్రాలకు ఉద్యోగుల తుది కేటాయింపులను ఆరు అంచెల్లో చేయాలని కమలనాథన్ కమిటీ నిర్ణయించింది. ఆ వివరాలు..

  • తొలి దశలో రాష్ట్రస్థాయి కేడర్ పోస్టుల పంపిణీకి ముసాయిదా మార్గద ర్శకాలను జారీ చేస్తారు. వాటిపై వారం లేదా పది రోజుల్లోగా అభ్యంతరాలను స్వీకరిస్తారు.
  •   రెండో దశలో అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకున్న తరువాత కమలనాథన్ కమిటీ తుది మార్గదర్శకాలను జారీ చేస్తుంది.
  •  మూడో దశలో నిర్ధారించిన కేటగిరీల్లో ఉద్యోగుల నుంచి ఆప్షన్లను స్వీకరిస్తారు. ఇందుకు వారం లేదా పది రోజుల పాటు గడువు ఇస్తారు.
  •  నాలుగో దశలో రెండు రాష్ట్రాలకు రాష్ట్ర కేడర్ పోస్టుల సంఖ్యను నిర్ధారిస్తారు. ఖాళీగా ఉన్న పోస్టులను కూడా రెండు రాష్ట్రాలకు పంపిణీ చేస్తారు.
  •  ఐదో దశలో ఉద్యోగులను రెండు రాష్ట్రాలకు  తాత్కాలిక తుది కేటాయింపులు చేస్తారు. ఈ కేటాయింపులపై ఉద్యోగుల నుంచి అభ్యంతరాలను స్వీకరిస్తారు.
  • ఆరో దశలో అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుని ఉద్యోగులను రెండు రాష్ట్రాలకు తుది కేటాయింపులు చేస్తారు.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement