నిక్కచ్చిగా ఉద్యోగుల విభజన
సాక్షి, హైదరాబాద్: స్వీయ ధ్రువీకరణలో ఉద్యోగులిచ్చిన సమాచారం ఆధారంగానే తెలంగాణ,ఏపీలకు వారి తాత్కాలిక కేటాయింపు జరుగుతుందని ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు స్పష్టం చేశాయి. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ, ఏపీ సీఎస్ ఐవీఆర్ కృష్ణారావు మంగళవారం ఈ మేరకు సంయుక్తంగా ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్ర కేడర్ ఉద్యోగుల కేటాయింపులో భాగంగా ఆప్షన్ల మరింత నిక్కచ్చిగా పరిశీలించేందుకు సంబంధిత ధ్రువ పత్రాలతో పాటు ఆప్షన్ ఫారాలను కూడా అప్‌లోడ్ చేయాలని ఉన్నతాధికారులకు వారు సూచించారు. ఉద్యోగుల విభజనకు సంబంధించిన సమాచారాన్ని మరింత పక్కాగా అందించాలని, రికార్డులన్నింటినీ స్కాన్ చేసి ఆన్‌లైన్‌లో పొందుపరచాలని అన్ని విభాగాల అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
‘‘విభాగావారీగా వివరాలు, సీనియారిటీ జాబితాలు, ఉద్యోగులు తమ సంతకంతో ఇచ్చిన ఆప్షన్ ఫారాలు, ధ్రువీకరణ పత్రాలన్నింటిపై అధికారులు స్వయంగా సంతకం చేసి, స్కాన్ చేసి అప్‌లోడ్ చేయాలి. తాత్కాలిక కేటాయింపులో అభ్యంతరాలేమైనా ఉంటే ఉద్యోగులు తాము పని చేస్తున్న రాష్ట్రంలోనే తమ విభాగపు ఉన్నతాధికారికి దరఖాస్తు చేసుకునే అవకాశముంటుంది. అర్జీని రాతపూర్వకంగా అందించటంతో పాటు ఆన్‌లైన్‌లోనూ ఆ వివరాలు పొందుపరచాలి. రీఆర్గనైజైషన్ వెబ్ పోర్టల్‌లో ఇందుకు వీలు కల్పించనున్నాం. అందులో నమోదు చేసిన వివరాలను కూడా డౌన్‌లోడ్ చేసి ప్రింట్ తీసుకోవాలి. ఆ కాపీపై సంతకం చేసి తమ విభాగ ఉన్నతాధికారికి సమర్పించాలి. వాటిని స్కాన్ చేసి అప్‌లోడ్ చేయాల్సిన బాధ్యత ఉన్నతాధికారిదే. ఆయన ఉద్యోగి అర్జీని పరిశీలించి తన అభిప్రాయాన్ని కూడా వెబ్‌సైట్‌లో పొందుపరచాలి. వాటిని కూడా డౌన్‌లోడ్ చేసి, ప్రింట్ తీసి తన సంతకంతో సాధారణ పరిపాలన (రాష్ట్ర పునర్విభజన) విభాగానికి పంపాలి’’ అని ఆ ఉత్తర్వుల్లో సీఎస్‌లు నిర్దేశించారు.