సాక్షి, హైదరాబాద్: దేశంలోనే తొలిసారి రెండు అంతస్తుల కేబుల్ వంతెన రాష్ట్రంలో నిర్మాణం కాబోతోంది. కృష్ణానదిపై సోమశిల వద్ద ప్రతిపాదించిన భారీ బ్రిడ్జికి కేంద్ర రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ అధీనంలోని స్టాండింగ్ ఫైనాన్స్ కమిటీ ఆమోదముద్ర వేసింది. శుక్రవారం ఢిల్లీలో ఈ కమిటీ భేటీ అయ్యింది. మరో రెండు నెలల్లో జాతీయ రహదారుల విభాగం కేబుల్ వంతెనకు టెండర్లు పిలవబోతోంది.
నిర్మాణ సంస్థకు వర్క్ ఆర్డర్ ఇచ్చిన రెండేళ్ల కాలంలో ఇది సిద్ధం కానుంది. తెలంగాణ–ఆంధ్రప్రదేశ్‌లను కలుపుతూ కృష్ణా నదిపై నిర్మించే ఈ వంతెనలో పైన వాహనాలు వెళ్లే ప్రధాన క్యారేజ్ వే ఉంటుంది. దాని దిగువన పర్యాటకులు నడుచుకుంటూ సోమశిల ప్రకృతి సౌందర్యం, కృష్ణా నదీ పరవళ్లను తిలకించేందుకు వీలుగా గాజు వంతెన (పెడస్ట్రియన్ డెక్) ఉంటుంది.
అక్కడ ఎందుకు..?
తెలంగాణ నుంచి ఏపీలోని నంద్యాల వైపు రోడ్డు మార్గాన వెళ్లేవారికి దూరాభారాన్ని తగ్గించే క్రమంలో కొత్త జాతీయ రహదారిని ప్రతిపాదించారు. నంద్యాల, తిరుపతి వెళ్లాలంటే కర్నూలు మీదుగా చుట్టూ తిరిగి వెళ్లాల్సి వస్తోంది. అదే కొల్లాపూర్ మీదుగా కృష్ణా నదిని దాటేలా వంతెన నిర్మిస్తే ఆ దూరం దాదాపు 90 కి.మీ మేర తగ్గిపోతుంది. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్–శ్రీశైలం రహదారి మీద ఉన్న కోట్రా జంక్షన్ నుంచి మల్లేశ్వరం, అక్కడి నుంచి నంద్యాల వరకు 173.73 కి.మీ మేర రహదారిని (హైవే 167 కే) నాలుగు వరసలుగా నిర్మించాలని నిర్ణయించారు.
ఇందుకు కృష్ణానదిపై వంతెన అవసరమైంది. అయితే దీన్ని సాదాసీదాగా నిర్మించకుండా, పర్యాటకులను ఆకట్టుకునేలా ఐకానిక్ వంతెనగా నిర్మిస్తే బాగుంటుందని అధికారులు ప్రతిపాదించారు. పాపికొండలు తరహాలో ఈ ప్రాంతం అత్యంత రమణీయంగా ఉన్నందున ఇక్కడికి నిత్యం వేలల్లో పర్యాటకులు వస్తారు. గాజు నడక వంతెన నిర్మిస్తే వారు నదీ పరవళ్లను తిలకిస్తూ ప్రత్యేక అనుభూతిని పొందేందుకు అవకాశం ఉంటుందని భావించారు. వాహనాల వంతెన దిగువన గాజు డెక్ ఉండేలా రెండంతస్తులుగా డిజైన్ చేశారు. 800 మీటర్ల పొడవుండే ఈ వంతెన నిర్మాణానికి రూ.1,082 కోట్ల వ్యయం అంచనా వేశారు.
నదిలోనే నడుస్తున్నట్టుగా..!
దుర్గం చెరువు, మానేరు మీద ఉన్న సస్పెన్షన్ వంతెనల తరహాలో ఇప్పుడు సోమశిల వద్ద కేబుల్ బ్రిడ్జి (స్తంభాలు లేని వంతెన) నిర్మించనున్నారు. ఇటు తెలంగాణ వైపు మల్లేశ్వరం తీరం, అటు ఏపీలోని సంగమేశ్వరం తీరంను అనుసంధానిస్తూ రెండా భారీ పైలాన్‌లను నిర్మిస్తారు. ఒక్కో పైలాన్‌కు రెండు వైపులా 15+15 చొప్పున 30 జతల భారీ కేబుల్స్ ఏర్పాటు చేసి వాటిì ఆధారంగా వంతెన నిలిచేలా నిర్మిస్తారు. ఈ వంతెన పైనుంచి చుట్టూ ఉన్న ప్రకృతిని, గాజు ప్యానెల్స్ నుంచి దిగువన కృష్ణమ్మ అందాలను ఆస్వాదించేందుకు అవకాశం ఉంటుంది. పర్యాటకులు నదిలో నడుస్తున్న అనుభూతిని పొందొచ్చు.
కృష్ణా నదిపై రెండంతస్తుల కేబుల్ బ్రిడ్జి
Published Sat, Oct 8 2022 2:02 AM | Last Updated on Sat, Oct 8 2022 10:49 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment