వంతెన వచ్చేది ఇక్కడే
సాక్షి, హైదరాబాద్: గలగలాపారే కృష్ణా నది.. చుట్టూ పాపికొండలను తలపించే పచ్చిక కొండలు.. పక్షుల కిలకిలారావాలు.. ప్రశాంత వాతావరణం.. ఇది సోమశిల వద్ద సీన్. ఇంతకాలం నది ఇవతలో, ఆవలి తీరం వద్దో నిలబడి ఈ ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదించాల్సి వచ్చేది. కానీ నదిపై గాజు వంతెన మీదుగా నడుస్తూ కింద నీటి ప్రవాహాన్ని చుట్టూ ఉన్న అందాలను వీక్షించడమంటే.. ఆ మజానే వేరు.
త్వరలోనే సోమశిల వద్ద కృష్ణా నదిపై గాజు వంతెన ఏర్పాటు కానుంది. దానిపైనే వాహనాలు వెళ్లేందుకు వీలుగా మరో వంతెన ఏర్పాటు చేయనున్నారు. అంటే రెండంతస్తుల వంతెన అన్నమాట. ఇందుకు సంబంధించిన డిజైన్లను కేంద్ర రోడ్డు రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ తాజాగా ఆమోదించినట్టు తెలిసింది.
ఈ ఏడాదిలోనే పనులు షురూ
రెండు వరసల (మల్టీ లెవల్) వంతెనలు చాలా కనిపిస్తాయి. నదులపై వాహనాలు వెళ్లేందుకు రోడ్డు మార్గం, రైలు ట్రాక్ కోసం మరో మార్గం ఒకదాని పైన ఒకటి ఉండేలా నిర్మించినవి కనిపిస్తాయి. కానీ పర్యాటకులు అక్కడి ప్రకృతిని వీక్షించేందుకు ప్రత్యే క కారిడార్‌తో కూడిన బహుళ అంతస్తుల వంతెన లు విదేశాల్లో ఉన్నా, మనదేశంలో లేవు. తొలిసారి అలాంటి రెండంతస్తుల ఐకానిక్ సస్పెన్షన్ వంతెన (కేబుల్ బ్రిడ్జి)ను సోమశిల వద్ద నిర్మిస్తున్నారు.
ఇటీవల హైదరాబాద్ దుర్గం చెరువుపై నిర్మించిన తరహాలో ఈ కేబుల్ బ్రిడ్జిని నిర్మిస్తారు. ఇందులో పైన నాలుగు వరసల రోడ్డు, దిగువున పర్యాటకుల కోసం చుట్టూ గాజు ప్యానెల్స్‌తో కూడిన వంతెన ఉంటుంది. దాదాపు 800 మీటర్ల పొడవుతో ఈ వంతెనను నిర్మిస్తారు. ఇందుకు దాదాపు రూ.650 కోట్ల వరకు ఖర్చు కానుంది. ఈ సంవత్సరమే పనులు మొదలు కానున్నాయి.
కొల్లాపూర్ మీదుగా నంద్యాలకు..
తెలంగాణ నుంచి నంద్యాల, తిరుపతిలకు వెళ్లాలంటే కర్నూలు మీదుగా చుట్టూ తిరిగి వెళ్లాల్సి వస్తోంది. అదే కొల్లాపూర్ మీదుగా కృష్ణానదిని దాటేలా వంతెన నిర్మిస్తే ఆ దూరం దాదాపు 90 కి.మీ మేర తగ్గుతుంది. అందుకే గతంలో ఈ రోడ్డును జాతీయ రహదారిగా గుర్తించి, విస్తరించాలని ప్రతిపాదించారు. కానీ రకరకాల కారణాలతో అటకెక్కిన ఈ ప్రా జెక్టు మళ్లీ తెరపైకి వచ్చింది.
హైదరాబాద్– శ్రీశైలం రహదారి మీద ఉన్న కోట్రా జంక్షన్ నుంచి కల్వ కుర్తి, నాగర్‌కర్నూలు, కొల్లాపూర్ మీదుగా కృష్ణాతీ రంలోని మల్లేశ్వరం (సోమశిల సమీపంలోని) వర కు ప్రస్తుతం రోడ్డు ఉంది. ఇందులో కొల్లాపూర్ వరకు డబుల్ రోడ్డు ఉండగా, అక్కడి నుంచి కృష్ణా తీరం వరకు సింగిల్ రోడ్డే ఉంది. ఇప్పుడు కోట్రా జంక్షన్ నుంచి మల్లేశ్వరం, అక్కడి నుంచి ఆంధ్ర ప్రదేశ్‌లోని నంద్యాల వరకు 173.73 కి.మీ. మేర నాలుగు వరసల రోడ్డు నిర్మించాలని నిర్ణయించిన విషయం తెలిసిందే.
ఈ జాతీయ రహదారికి 167కె నంబరు కేటాయించారు. ఈ రోడ్డులో భాగంగానే కృష్ణా నది మీద వంతెన నిర్మించాల్సి ఉంది. ఆ ప్రాంతం అద్భుత సౌందర్యానికి ఆలవాలం కావ డంతో అక్కడ నిర్మించే వంతెనను సాధారణంగా కాకుండా, పర్యాటకులను ఆకట్టుకునేలా డిజైన్ చేయాలని నిర్ణయించారు.
స్తంభాలు లేని వంతెన..
సోమశిలకు నిత్యం పెద్ద సంఖ్యలో పర్యాటకులు వస్తారు. పాపికొండలను మించిన సౌందర్యాన్ని ఆస్వాదిస్తూ సేద తీరుతుంటారు. ఇప్పుడు గాజు వంతెన అందుబాటులోకి వస్తే పర్యాటకులు పోటెత్తే అవకాశం ఉంది. ఇది స్తంభాలు లేని వంతెన. ఇటు తెలంగాణ వైపు మల్లేశ్వరం తీరం, అటు ఏపీలోని సంగమేశ్వరం తీరంను అనుసంధానిస్తూ రెండు భారీ పైలాన్‌లను నిర్మిస్తారు.
తీరం నుంచి 160 మీటర్ల తర్వాత పైలాన్‌లు ఉంటాయి. రెండు పైలాన్‌ల మధ్య 460 మీటర్ల దూరం ఉంటుంది. ఒక్కో పైలాన్‌కు రెండు వైపులా 15+15 చొప్పున 30 జతల భారీ కేబు ల్స్ ఏర్పాటు చేసి వాటి ఆలంబనగా వంతెన నిలి చేలా నిర్మిస్తారు. ఇందులో సెంట్రల్ మీడియన్ భాగంలో గాజు ప్యానెల్ కారిడార్ ఉంటుంది. దానికి రెండు వైపులా వాక్ వేస్ ఉంటాయి.
మళ్లీ ఆ చివర, ఈ చివర గాజు ప్యానెల్స్ ఉంటాయి. దీనిద్వారా చుట్టూ ప్రకృతిని, గాజు ప్యానెల్స్ నుంచి దిగువ కృష్ణమ్మ సోయగాలను వీక్షించొచ్చు. నదిలో నడుస్తున్న అనుభూతిని పొందొచ్చు. వంతెన ప్రారంభంలోని యాంకర్ బ్లాక్ వద్ద మెట్లు నిర్మించి, అక్కడి నుంచి పాదచారులు దిగువ వరసలోకి (గాజు కారిడార్) ప్రవేశించే ఏర్పాటు చేస్తారు. దీంతో ఈ ప్రాంతం పర్యాటకంగా ప్రధాన ఆకర్షణ కేంద్రంగా మారనుంది. సోమశిలకు 10 కి.మీ దూరంలోని మల్లేశ్వరం వద్ద ఈ నిర్మాణం ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment