Telangana-Andhra Pradesh
-
కృష్ణా నదిపై రెండంతస్తుల కేబుల్ బ్రిడ్జి
సాక్షి, హైదరాబాద్: దేశంలోనే తొలిసారి రెండు అంతస్తుల కేబుల్ వంతెన రాష్ట్రంలో నిర్మాణం కాబోతోంది. కృష్ణానదిపై సోమశిల వద్ద ప్రతిపాదించిన భారీ బ్రిడ్జికి కేంద్ర రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ అధీనంలోని స్టాండింగ్ ఫైనాన్స్ కమిటీ ఆమోదముద్ర వేసింది. శుక్రవారం ఢిల్లీలో ఈ కమిటీ భేటీ అయ్యింది. మరో రెండు నెలల్లో జాతీయ రహదారుల విభాగం కేబుల్ వంతెనకు టెండర్లు పిలవబోతోంది. నిర్మాణ సంస్థకు వర్క్ ఆర్డర్ ఇచ్చిన రెండేళ్ల కాలంలో ఇది సిద్ధం కానుంది. తెలంగాణ–ఆంధ్రప్రదేశ్‌లను కలుపుతూ కృష్ణా నదిపై నిర్మించే ఈ వంతెనలో పైన వాహనాలు వెళ్లే ప్రధాన క్యారేజ్ వే ఉంటుంది. దాని దిగువన పర్యాటకులు నడుచుకుంటూ సోమశిల ప్రకృతి సౌందర్యం, కృష్ణా నదీ పరవళ్లను తిలకించేందుకు వీలుగా గాజు వంతెన (పెడస్ట్రియన్ డెక్) ఉంటుంది. అక్కడ ఎందుకు..? తెలంగాణ నుంచి ఏపీలోని నంద్యాల వైపు రోడ్డు మార్గాన వెళ్లేవారికి దూరాభారాన్ని తగ్గించే క్రమంలో కొత్త జాతీయ రహదారిని ప్రతిపాదించారు. నంద్యాల, తిరుపతి వెళ్లాలంటే కర్నూలు మీదుగా చుట్టూ తిరిగి వెళ్లాల్సి వస్తోంది. అదే కొల్లాపూర్ మీదుగా కృష్ణా నదిని దాటేలా వంతెన నిర్మిస్తే ఆ దూరం దాదాపు 90 కి.మీ మేర తగ్గిపోతుంది. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్–శ్రీశైలం రహదారి మీద ఉన్న కోట్రా జంక్షన్ నుంచి మల్లేశ్వరం, అక్కడి నుంచి నంద్యాల వరకు 173.73 కి.మీ మేర రహదారిని (హైవే 167 కే) నాలుగు వరసలుగా నిర్మించాలని నిర్ణయించారు. ఇందుకు కృష్ణానదిపై వంతెన అవసరమైంది. అయితే దీన్ని సాదాసీదాగా నిర్మించకుండా, పర్యాటకులను ఆకట్టుకునేలా ఐకానిక్ వంతెనగా నిర్మిస్తే బాగుంటుందని అధికారులు ప్రతిపాదించారు. పాపికొండలు తరహాలో ఈ ప్రాంతం అత్యంత రమణీయంగా ఉన్నందున ఇక్కడికి నిత్యం వేలల్లో పర్యాటకులు వస్తారు. గాజు నడక వంతెన నిర్మిస్తే వారు నదీ పరవళ్లను తిలకిస్తూ ప్రత్యేక అనుభూతిని పొందేందుకు అవకాశం ఉంటుందని భావించారు. వాహనాల వంతెన దిగువన గాజు డెక్ ఉండేలా రెండంతస్తులుగా డిజైన్ చేశారు. 800 మీటర్ల పొడవుండే ఈ వంతెన నిర్మాణానికి రూ.1,082 కోట్ల వ్యయం అంచనా వేశారు. నదిలోనే నడుస్తున్నట్టుగా..! దుర్గం చెరువు, మానేరు మీద ఉన్న సస్పెన్షన్ వంతెనల తరహాలో ఇప్పుడు సోమశిల వద్ద కేబుల్ బ్రిడ్జి (స్తంభాలు లేని వంతెన) నిర్మించనున్నారు. ఇటు తెలంగాణ వైపు మల్లేశ్వరం తీరం, అటు ఏపీలోని సంగమేశ్వరం తీరంను అనుసంధానిస్తూ రెండా భారీ పైలాన్లను నిర్మిస్తారు. ఒక్కో పైలాన్‌కు రెండు వైపులా 15+15 చొప్పున 30 జతల భారీ కేబుల్స్ ఏర్పాటు చేసి వాటిì ఆధారంగా వంతెన నిలిచేలా నిర్మిస్తారు. ఈ వంతెన పైనుంచి చుట్టూ ఉన్న ప్రకృతిని, గాజు ప్యానెల్స్ నుంచి దిగువన కృష్ణమ్మ అందాలను ఆస్వాదించేందుకు అవకాశం ఉంటుంది. పర్యాటకులు నదిలో నడుస్తున్న అనుభూతిని పొందొచ్చు. -
‘హురూన్’ సంపన్నుల్లో మనోళ్లు 69 మంది
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఐఐఎఫ్ఎల్ వెల్త్ హురూన్ ఇండియా సంపన్నుల జాబితా–2021లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుంచి 69 మంది చోటు సంపాదించారు. వీరందరి సంపాదన రూ.3,79,200 కోట్లు. గతేడాదితో పోలిస్తే ఇది 54 శాతం వృద్ధి. కొత్తగా 13 మంది ఈ లిస్ట్‌లో చేరారు. మొత్తం జాబితాలో ఇద్దరు మహిళలు ఉన్నారు. అయితే ఔషధ తయారీ రంగం నుంచే 21 మంది ఉండడం విశేషం. రూ.1,000 కోట్లు, ఆపైన సంపద కలిగిన వ్యక్తులతో ఈ జాబితాను రూపొందించారు. వీరిలో హైదరాబాద్ నుంచి 56 మంది, రంగారెడ్డి నుంచి నలుగురు, విశాఖపట్నం నుంచి ముగ్గురు ఉన్నారు. సెపె్టంబర్ 15 నాటికి బిలియన్ డాలర్లకుపైగా సంపద కలిగిన వారి సంఖ్య ఏడాదిలో 9 నుంచి 15కు చేరింది. రూ.79,000 కోట్లతో దివీస్ ల్యా»ొరేటరీస్ వ్యవస్థాపకులు మురళి దివి, ఆయన కుటుంబం తొలి స్థానంలో నిలిచింది. పదేళ్ల క్రితం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుంచి ఐఐఎఫ్ఎల్ వెల్త్ హురూన్ లిస్ట్‌లో ముగ్గురు మాత్రమే నమోదయ్యారు. ఈ ఏడాది జాబితాలో పేరు దక్కించుకున్న వారిలో మొదటి అయిదు స్థానాల్లో జి.అమరేందర్‌రెడ్డి, కుటుంబం, వెంకటేశ్వర్లు జాస్తి, కుటుంబం, ఏ.ప్రతాప్ రెడ్డి (బాలాజీ అమైన్స్), దాసరి ఉదయ్‌కుమార్ రెడ్డి (తాన్లా ప్లాట్‌ఫామ్స్), అనిల్ కుమార్ చలమలశెట్టి (గ్రీన్కో), మహేశ్ కొల్లి(గ్రీన్కో) ఉన్నారు. -
నిక్కచ్చిగా ఉద్యోగుల విభజన
సాక్షి, హైదరాబాద్: స్వీయ ధ్రువీకరణలో ఉద్యోగులిచ్చిన సమాచారం ఆధారంగానే తెలంగాణ,ఏపీలకు వారి తాత్కాలిక కేటాయింపు జరుగుతుందని ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు స్పష్టం చేశాయి. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ, ఏపీ సీఎస్ ఐవీఆర్ కృష్ణారావు మంగళవారం ఈ మేరకు సంయుక్తంగా ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్ర కేడర్ ఉద్యోగుల కేటాయింపులో భాగంగా ఆప్షన్ల మరింత నిక్కచ్చిగా పరిశీలించేందుకు సంబంధిత ధ్రువ పత్రాలతో పాటు ఆప్షన్ ఫారాలను కూడా అప్లోడ్ చేయాలని ఉన్నతాధికారులకు వారు సూచించారు. ఉద్యోగుల విభజనకు సంబంధించిన సమాచారాన్ని మరింత పక్కాగా అందించాలని, రికార్డులన్నింటినీ స్కాన్ చేసి ఆన్లైన్లో పొందుపరచాలని అన్ని విభాగాల అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ‘‘విభాగావారీగా వివరాలు, సీనియారిటీ జాబితాలు, ఉద్యోగులు తమ సంతకంతో ఇచ్చిన ఆప్షన్ ఫారాలు, ధ్రువీకరణ పత్రాలన్నింటిపై అధికారులు స్వయంగా సంతకం చేసి, స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి. తాత్కాలిక కేటాయింపులో అభ్యంతరాలేమైనా ఉంటే ఉద్యోగులు తాము పని చేస్తున్న రాష్ట్రంలోనే తమ విభాగపు ఉన్నతాధికారికి దరఖాస్తు చేసుకునే అవకాశముంటుంది. అర్జీని రాతపూర్వకంగా అందించటంతో పాటు ఆన్‌లైన్‌లోనూ ఆ వివరాలు పొందుపరచాలి. రీఆర్గనైజైషన్ వెబ్ పోర్టల్‌లో ఇందుకు వీలు కల్పించనున్నాం. అందులో నమోదు చేసిన వివరాలను కూడా డౌన్లోడ్ చేసి ప్రింట్ తీసుకోవాలి. ఆ కాపీపై సంతకం చేసి తమ విభాగ ఉన్నతాధికారికి సమర్పించాలి. వాటిని స్కాన్ చేసి అప్లోడ్ చేయాల్సిన బాధ్యత ఉన్నతాధికారిదే. ఆయన ఉద్యోగి అర్జీని పరిశీలించి తన అభిప్రాయాన్ని కూడా వెబ్సైట్లో పొందుపరచాలి. వాటిని కూడా డౌన్లోడ్ చేసి, ప్రింట్ తీసి తన సంతకంతో సాధారణ పరిపాలన (రాష్ట్ర పునర్విభజన) విభాగానికి పంపాలి’’ అని ఆ ఉత్తర్వుల్లో సీఎస్‌లు నిర్దేశించారు. -
గవర్నర్ మధ్యవర్తిత్వాన్ని కోరండి
తెలంగాణ సీఎం కేసీఆర్‌కు కిషన్‌రెడ్డి హితవు హైదరాబాద్: విద్యుత్ విషయంలో తెలంగాణ-ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య నెలకొన్న వివాదాలు చర్చల ద్వారా పరిష్కరించుకోవాలన్నదే తమ అభిమతమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. అవసరమైతే మధ్యవర్తిగా ఉండి సమస్య పరిష్కారానికి చొరవ చూపాలని గవర్నర్ నరసింహన్‌ను కోరాలని తెలంగాణ సీఎం కేసీఆర్‌కు ఆయన సూచించారు. శనివారం కిషన్‌రెడ్డి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. సీఎం కేసీఆర్ వెంటనే అఖిలపక్షాన్ని గవర్నర్ వద్దకు తీసుకెళ్లి సమస్యపై చర్చించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ తీరును ఎండగట్టేందుకు ఈ నెల 27న కరీంనగర్లో రైతులతో పోరు దీక్ష చేపట్టనున్నట్టు కిషన్‌రెడ్డి వెల్లడించారు. కౌంటర్ ఇంటెలిజెన్స్, ఆక్టోపస్ విభాగాలను బలోపేతం చేసి పోలీసు శాఖకు అవసరమైన స్వేచ్ఛను ఇవ్వాలన్నారు. నవంబర్ నుంచి సభ్యత్వ నమోదు కార్యాచరణ వచ్చే సంవత్సరం నిర్వహించే సభ్యత్వ నమోదు కోసం నవంబర్ నుంచి కార్యాచరణకు తమ పార్టీ సిద్ధమవుతోందని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. సభ్యత్వ నమోదు సందర్భంగా రుసుం తీసుకుని రశీదు ఇచ్చే పాత పద్ధతి కాకుండా ఈసారి ఆన్లైన్, మొబైల్ సభ్యత్వాన్ని అందుబాటులోకి తెస్తున్నట్టు వెల్లడించారు.