గవర్నర్ మధ్యవర్తిత్వాన్ని కోరండి
తెలంగాణ సీఎం కేసీఆర్‌కు కిషన్‌రెడ్డి హితవు
హైదరాబాద్: విద్యుత్ విషయంలో తెలంగాణ-ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య నెలకొన్న వివాదాలు చర్చల ద్వారా పరిష్కరించుకోవాలన్నదే తమ అభిమతమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. అవసరమైతే మధ్యవర్తిగా ఉండి సమస్య పరిష్కారానికి చొరవ చూపాలని గవర్నర్ నరసింహన్‌ను కోరాలని తెలంగాణ సీఎం కేసీఆర్‌కు ఆయన సూచించారు. శనివారం కిషన్‌రెడ్డి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. సీఎం కేసీఆర్ వెంటనే అఖిలపక్షాన్ని గవర్నర్ వద్దకు తీసుకెళ్లి సమస్యపై చర్చించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ తీరును ఎండగట్టేందుకు ఈ నెల 27న కరీంనగర్‌లో రైతులతో పోరు దీక్ష చేపట్టనున్నట్టు కిషన్‌రెడ్డి వెల్లడించారు. కౌంటర్ ఇంటెలిజెన్స్, ఆక్టోపస్ విభాగాలను బలోపేతం చేసి పోలీసు శాఖకు అవసరమైన స్వేచ్ఛను ఇవ్వాలన్నారు.
నవంబర్ నుంచి సభ్యత్వ నమోదు కార్యాచరణ
వచ్చే సంవత్సరం నిర్వహించే సభ్యత్వ నమోదు కోసం నవంబర్ నుంచి కార్యాచరణకు తమ పార్టీ సిద్ధమవుతోందని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. సభ్యత్వ నమోదు సందర్భంగా రుసుం తీసుకుని రశీదు ఇచ్చే పాత పద్ధతి కాకుండా ఈసారి ఆన్‌లైన్, మొబైల్ సభ్యత్వాన్ని అందుబాటులోకి తెస్తున్నట్టు వెల్లడించారు.