రాజకీయ నేతల్లా.. ఉద్యోగ సంఘాల నాయకులు | Employees Fires On Their Union Leaders | Sakshi
Sakshi News home page

రాజకీయ నేతల్లా.. ఉద్యోగ సంఘాల నాయకులు

Published Sat, Mar 30 2019 2:56 PM | Last Updated on Sat, Jul 6 2019 4:04 PM

Employees Fires On Their Union Leaders - Sakshi

సమావేశంలో మాట్లాడుతున్న వెంకట్రామిరెడ్డి 

సాక్షి, కాకినాడ సిటీ: ఉద్యోగుల సంక్షేమం గాలికి వదిలేసి రెండు ప్రధాన ఉద్యోగ సంఘాల నాయకులు రాజకీయ నాయకులుగా వ్యవహరించడాన్ని వ్యతిరేకించాలని ఆంధ్రప్రదేశ్‌ ఉద్యోగ, ఉపాధ్యాయ పెన్షనర్ల సమాఖ్య పిలుపునిచ్చింది. ఉద్యోగ సంఘాల నాయకులు వ్యవహరిస్తున్న తీరుపై ఆలోచించండి, మద్దతియ్యండి అంటూ ఉద్యోగుల్లో మార్పు తీసుకువచ్చేందుకు వీలుగా చేపట్టిన ప్రచారం సందర్భంగా శుక్రవారం కాకినాడలోని ట్రెజరీ కార్యాలయం, ఇండస్ట్రియల్‌ కార్యాలయాల్లో ఏర్పాటు చేసిన సమావేశంలో సమాఖ్య కన్వీనర్‌ కె.వెంకట్రామిరెడ్డి, కో కన్వీనర్‌ అరవ పాల్‌ మాట్లాడారు. ఉద్యోగుల సమస్యలపై ఉద్యోగ సంఘాల నాయకులు ఎప్పుడూ పట్టించుకోలేదని, ఒక మహిళా ఉద్యోగిపై విచక్షణా రహిత దాడి జరిగినపుడుకాని, ప్రభుత్వం నిరంతరంగా 2, 3 డీఏలు పెండింగ్‌లో పెడుతున్నా, పనితీరు పేరుతో 50 ఏళ్లకే ఉద్యోగుల బలవంతపు పదవీ విరమణ జీఓ తయారైనపుడు కాని, సమీక్షలు, వీడియో కాన్ఫరెన్స్‌ల వల్ల ఉద్యోగులు తీవ్రమైన వత్తిడికి గురౌతున్నా పట్టించుకున్న పాపానపోలేదన్నారు.

నాయకుల మార్పుతోనే ఉద్యోగుల మనుగడ సాధ్యం అనే నినాదంతో ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. విద్యా సంవత్సరం మధ్యలో రాజధాని ఉద్యోగులను తరలించినప్పుడు, అస్తవ్యస్థమైన బయోమెట్రిక్‌ విధానంతో ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నా ఉద్యోగ సంఘాల నాయకులు తమ స్వార్థ రాజకీయాల కోసం పట్టించుకోలేదని విమర్శించారు. గతం ప్రభుత్వం ఉద్యోగ సంఘాలతో చర్చించి వారి అంగీకారంతో ఐఆర్‌ మంజూరు చేస్తే, ఇప్పటి ప్రభుత్వం ఉద్యోగ సంఘాలతో కనీసం చర్చించకుండా 20 శాతం ఐఆర్‌ మంజూరు చేసిందన్నారు. ఈ ప్రభుత్వం ఉద్యోగ సంఘాల అస్థిత్వాన్ని దెబ్బతీసే చర్యలు చేపడుతున్నా నాయకులు పట్టించుకోవడంలేదని ఆరోపించారు. ప్రభుత్వ ధోరణి ఇలాగే కొనసాగితే భవిష్యత్తు తరాల ఉద్యోగులు చాలా నష్టపోతారని వెంకట్రామిరెడ్డి, అవరపాల్‌ వాపోయారు. 2009లో ఉద్యోగులకు 22 శాతం, 2014లో 27 శాతం మధ్యంతర భృతి ఇచ్చినప్పుడు ఎవరూ సన్మానాలు చేయలేదని, హైదరాబాద్‌లో అత్యంత విలువైన గచ్చిబౌలిలో ఉద్యోగులకు ఇళ్ల స్థలాలు కోసం ఎకరం రూ. 38 వేలకు ఇచ్చినప్పుడు సన్మానాలు ఎందుకు చేయలేదన్నారు.

ఇప్పుడు కేవలం 30 శాతం మధ్యంతర భృతి అదీ పోస్ట్‌డేటెడ్‌ తరహాలో ఇచ్చినందుకు, కొత్త రాజధానిలో ఎకరం రూ.కోటిపైగా రేటుతో ఉద్యోగులకు ఇళ్ల స్థలాలు ఇచ్చినందుకు సన్మానాలు చేస్తున్నారంటే మన నాయకులు పరిస్థితి ఏమిటో ఒకసారి ఆలోచించాలని ఉద్యోగులను కోరారు. 2014 నుంచి డీఏలు పెండింగ్‌  ఉంటూనే ఉన్నాయన్నారు. ఇప్పటికైనా ఉద్యోగులంతా మేల్కొని నాయకులను మార్చుకోకపోతే ఉద్యోగుల మనుగడకే ప్రమాదమన్నారు. సీపీఎస్‌ విధానం  రద్దు కాదని, భవిష్యత్‌లో ఉద్యోగులకు డీఏ రాదని, పీఆర్‌సీ ఎప్పుడు అమలవుతుందో తెలియదని, హెల్త్‌కార్డులు పని చేయవని, 50 ఏళ్లకే బలవంతపు పదవీ విరమణ జీఓలు ఏ క్షణమైనా విడుదల అవ్వోచ్చని, బయోమెట్రిక్‌ విధానంతో ఉద్యోగులను బానిసలుగా చేసుకొంటారని, కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్‌తో రెగ్యులర్‌ విధానాన్ని రద్దు చేస్తారన్న భయం ఉద్యోగుల్లో ఉందని వెంకట్రామిరెడ్డి, అరవపాల్‌ అన్నారు.  ఈ విషయాలపై రాష్ట్రం అంతా తిరుగుతూ ఉద్యోగుల్లో నాయకుల మార్పు కోరుతూ చైతన్యం తీసుకువస్తున్నట్లు తెలిపారు. ప్రతి విషయంలో ఉద్యోగులకు జరిగే అన్యాయం ప్రశ్నించేందుకు వీలుగా ఒక బలమైన వేదిక అవసరమని గుర్తించి ప్రభుత్వ, ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల సమాఖ్యను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కమలాకర శర్మ, ఎం.రమేష్, లెక్కల జమాల్‌రెడ్డి, ఖాదర్‌బాబా, పటేల్‌ తదితరులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement