మోర్తాడ్/చంద్రశేఖర్ కాలనీ, న్యూస్‌లైన్ : వ్యవసాయంతో పాటు ఉద్యానవన అభివృద్ధికి కృషిచేస్తున్నామని ప్రభుత్వం చెబుతున్న మాటలకు, క్షేత్రస్థాయిలోని పరిస్థితులకు భిన్నమైన తేడాలు ఉన్నాయి. రాష్ట్ర రాజధానిలో శుక్రవారం 24వ జాతీయ ఉద్యానవన ప్రదర్శనను ప్రభుత్వం అట్టహాసంగా ప్రారంభించింది. అయితే ఉద్యానవన శాఖలో భారీగా ఖాళీలు ఉన్నా పోస్టుల భర్తీపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోక పోవడంతో రైతులకు ఉద్యానవన శాఖ సేవలు అందని ద్రాక్షలా మారాయి.
ఉద్యోగులు లేని కారణంగా లక్ష్యానికి అనుగుణంగా ఉద్యానవన శాఖ పనులు సాగడం లేదు. ఈ సీజనుకు గాను జిల్లాలో 100 హెక్టార్లలో పండ్ల తోటలను సాగుచేయాలని లక్ష్యంగా నిర్ణయించారు. పండ్ల తోటల పెంపకానికి రైతులు ఆసక్తి చూపుతున్నా.. ఉద్యోగుల కొరతతో రైతులకు ఎలాంటి సేవలు అందడం లేదు. దీంతో 50 శాతం కూడా పండ్ల తోటల సాగయ్యే పరిస్థితి కనిపించడం లేదు. కేంద్ర స్థాయిల్లో జాతీయ ఉద్యాన మిషన్‌ను, రాష్ట్రస్థాయిలో రాష్ట్ర ఉద్యాన మిషన్‌ను 2005-06 సంవత్సరంలో ప్రభుత్వాలు ప్రారంభించాయి.
రైతులకు సలహాలు ఇచ్చేవారేరీ..?
గ్రామీణ ప్రాంతాలలోని రైతులకు సబ్సిడీపై కూరగాయల విత్తనాలు అందించడం, డ్రిప్ ఇరిగేషన్ ఏర్పాటు చేయించడం, మామిడి, అరటి, బొప్పాయి, నారింజ, దానిమ్మ తదితర పండ్ల తోటలను పెంచడానికి రైతులను ప్రోత్సహించాల్సి ఉంది. అంతేకాక పసుపును పండించే ప్రాంతాలలో రైతులకు కొత్త రకం పసుపు విత్తనాలను సరఫరా చేయాలి. పసుపు సాగులో అవసరమైన మెళకువలను రైతులకు ఉద్యానవన శాఖ అధికారులు తెలియజేయాల్సి ఉంది. వ్యవసాయ శాఖ మాదిరిగానే మండలానికి ఒక ఉద్యానవన శాఖ అధికారితో పాటు ఇద్దరు, ముగ్గురు ఫీల్డ్ కన్సల్టెంట్‌లు పనిచేయాల్సిన అవసరం ఉంది.
అయితే ఉన్న పోస్టుల ఖాళీలను భర్తీ చేయక పోవడం, కొత్త పోస్టులను ఏర్పాటు చేయక పోవడంతో ఉద్యానవన శాఖ ఖాళీగా ఉంది. గతంలో కంటే ఇప్పుడు ఉద్యానవన శాఖ సేవలు గ్రామీణ ప్రాంత రైతులకు ఎక్కువగా అవసరం ఉన్నా యి. రైతులు ఆహార ధాన్యాలతో పాటు ఉద్యానవన శాఖ పరిధిలోకి వచ్చే పంటలను సాగుచేసే ఆలోచనలో ఉన్నా రు. సబ్సిడీ పరికరాలు కూడా ఉద్యానవన శాఖ పరిధిలోనే ఉండటంతో ఉద్యోగుల సేవలు ఎక్కువగా అవసరం ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఉద్యానవన శాఖలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని రైతులు కోరుతున్నారు.
ఉద్యాన శాఖకు ఉద్యోగులు కావలెను..!
Published Mon, Feb 17 2014 2:58 AM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM
Advertisement