కడప రూరల్: ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి కారణంగానే సమ్మెకు దిగాల్సి వచ్చిందని ఏపీఎస్ ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు సీహెచ్ చంద్రశేఖర్‌రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల తరహాలోనే ఆర్టీసీ కార్మికులకు 43 శాతం ఫిట్‌మెంట్ ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. కడపలోని వైఎస్సార్ మెమోరియల్ ప్రెస్‌క్లబ్‌లో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆర్టీసీ కార్మికులు కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్నా ఫిట్‌మెంట్ విషయంలో యాజమాన్యం, ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని మండిపడ్డారు.
గత ప్రభుత్వం 43 శాతం ఫిట్‌మెంట్‌ను ప్రకటిస్తామని హామీ ఇచ్చినా అది అమలు కాలేదన్నారు. ప్రస్తుత ప్రభుత్వం కూడా సమస్య పరిష్కారానికి చొరవ చూపడం లేదని ఆరోపించారు. సమ్మె మొదలైనా ఆర్టీసీ యాజమాన్యంలో చలనం లేదన్నారు. 43 శాతం ఫిట్‌మెంట్‌తోపాటు ఇతర సమస్యలను పరిష్కరించకపోతే సమ్మెను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. సమ్మెకు అన్ని ఆర్టీసీ సంఘాలు మద్దతు తెలపాలని, ప్రజలు కూడా తమకు సహకరించాలని కోరారు.