బస్సొస్తదా.. రాదా? | TSRTC Look For Alternative Measures If Employees Go To Strike | Sakshi
Sakshi News home page

బస్సొస్తదా.. రాదా?

Published Fri, Oct 4 2019 2:46 AM | Last Updated on Fri, Oct 4 2019 9:40 AM

TSRTC Look For Alternative Measures If Employees Go To Strike - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ఆర్టీసీ సమ్మె విషయంలో ప్రతిష్టంభన కొనసాగుతోంది. వరుసగా రెండో రోజు కూడా అధికారుల కమిటీ, కార్మిక సంఘాల జేఏసీ మధ్య చర్చలు విఫలం కావటంతో ఇక సమ్మె తథ్యమన్న భావన వ్యక్తమవుతోంది. తమ డిమాండ్లకు అధికారుల కమిటీ సానుకూలం వ్యక్తం చేయనందున, ఆర్టీసీ పరిరక్షణకు సమ్మె చేయక తప్పదని, ముందుగా ప్రకటించినట్లు శనివారం నుంచి సమ్మె మొదలవుతుందని ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ స్పష్టం చేసింది. తమ డిమాండ్లకు అనుకూలంగా నిర్ణయం వెల్లడించేలా తదుపరి చర్చలు ఉంటే కచ్చితంగా హాజరవుతామని, లేదంటే శనివారం ఉదయం 5 గంటల నుంచి సమ్మె మొదలవుతుందని ప్రకటించి కార్మిక సంఘాలు చర్చల నుంచి నిష్క్రమించాయి. శుక్రవారం కూడా చర్చలు జరుపుతామని అధికారుల కమిటీ ప్రకటించింది. సమ్మెకు దిగితే ఎస్మా ప్రయోగించటంతో పాటు ప్రయాణికులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తామని వెల్లడించింది. 

కమిటీ హామీ లేఖ.. 
కార్మిక సంఘాలతో చర్చించటంతో పాటు వారి డిమాండ్లను పరిశీలించి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వటం కోసం మంత్రివర్గం ఏర్పాటు చేసిన ముగ్గురు ఐఏఎస్‌ అధికారుల కమిటీ కార్మిక సంఘాలు బుధవారం జరిపిన తొలిరోజు చర్చలు విఫలం కావటంతో గురువారం మధ్యాహ్నం 3 టలకు మరో దశలకు ఆహ్వానించింది. దీంతో ఎర్రమంజిల్‌లోని రోడ్లు, భవనాల శాఖ ప్రధాన కార్యాలయానికి కార్మిక సంఘాల జేఏసీ ప్రతినిధులు వచ్చారు. అప్పటికే త్రిసభ్య కమిటీ సభ్యులు సోమేశ్‌కుమార్, సునీల్‌శర్మ, రామకృష్ణారావు అక్కడ ఉన్నారు. అయితే వెంటనే చర్చలు ప్రారంభించకుండా సాయంత్రం వరకు ఆపారు. సమ్మె ప్రారంభమైతే ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై రవాణా శాఖ అధికారులతో ఈలోపు ఆ శాఖ కమిషనర్, త్రిసభ్య కమిటీ సభ్యుడు సునీల్‌ శర్మ సమావేశమయ్యారు. దీన్ని తప్పుపడుతూ జేఏసీ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

దీంతో జేఏసీలోని 4 సంఘాల నుంచి ఒక్కొక్కరు చొప్పున నలుగురు ప్రతినిధులతో రెండుసార్లు కమిటీ సభ్యులు మాట్లాడారు. డిమాండ్ల పరిష్కారానికి కొంత సమయం అవసరమని, ప్రభుత్వం వాటి పరిష్కారం కోసం చర్యలు తీసుకునేందుకు సానుకూలంగానే ఉందని చెప్పారు. తొలిరోజు చెప్పినట్లే అదే విషయం చెప్పటం సరికాదని, తాము కోరినట్లు స్పష్టమైన హామీ ఇవ్వాలని ప్రతినిధులు డిమాండ్‌ చేశారు. ఇలా రెండు మూడు సార్లు స్పల్పకాలిక చర్చలు నడిచాయి. కానీ ఫలితం తేలలేదు. దీంతో తాము చర్చల నుంచి వైదొలగబోతున్నట్లు జేఏసీ సంకేతాలిచ్చింది. దీంతో రాత్రి 9 గంటల సమయంలో కమిటీ సభ్యులు లిఖితపూర్వక హామీ పత్రాన్ని జేఏసీకి అందజేసింది. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనంపై సూత్రప్రాయ అంగీకారం తెలుపుతూ కమిటీని నియమిస్తున్నట్లు ప్రకటించాలని, మిగతా ప్రధాన డిమాండ్లకు కూడా స్పష్టమైన హామీ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఆర్టీసీ పరిరక్షణకు ప్రభుత్వం సిద్ధంగా లేనట్లే భావించాల్సి ఉంటుందని పేర్కొంటూ చర్చలు విఫలమైనట్లు జేఏసీ ప్రకటించింది. 

ఉబెర్, ఓలా వాహనాలు.. 
హైదరాబాద్‌లో విద్యాసంస్థల బస్సులు, ఉబెర్, ఓలా వాహనాలను కూడా రంగంలోకి దింపాలని  అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రైవేటు బస్సులు, వ్యాన్లకు రూ.300 రుసుముతో వారం రోజుల తాత్కాలిక పర్మిట్లు అప్పగించి స్టేజీ క్యారియర్లుగా తిప్పాలని నిర్ణయించారు. ఆర్టీసీ చార్జీలే వసూలు చేసే నిబంధనతో ఇందుకు అనుమతివ్వాలని నిర్ణయించారు.  సెవన్‌ సీటర్‌ ఆటోలను  సిటీలోకి అనుమతించాలని భావిస్తున్నారు. 

పువ్వాడ సమీక్ష.. 
ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై ఆర్టీసీ, రవాణా శాఖ ఉన్నతాధికారులతో రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ సమీక్షించారు. తాత్కాలిక పద్ధతి లో డ్రైవర్లను తీసుకునేందుకు వీలుగా  ప్రకటనలు విడుదల చేశారు. సమ్మెకు సమాయత్తమవుతున్న తరుణంలో ఆర్టీసీ కార్మి కులు, ఉద్యోగులకు ఇప్పటివరకు జీతాలు విడుదల చేయలేదు.  కాగా, కార్మికసంఘాలతో శుక్రవారం మధ్యాహ్నం కార్మిక శాఖ జాయింట్‌ కమిషనర్‌ రాజీ చర్చలు జరపనున్నారు. కాగా ఆర్టీసీ కార్మిక సంఘాలు శుక్రవారం నుంచి సమ్మెకు పిలుపునిచ్చిన నేపథ్యంలో సమ్మె నివారణ చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని వివిధ వామపక్ష పార్టీలు డిమాండ్‌ చేశాయి. 

ముందస్తు చర్యలు

  • ఆర్టీసీలో ఉన్న 2,200 అద్దె బస్సులకు తోడు ప్రైవేటు డ్రైవర్లు, కండక్టర్లతో మరో 3 వేల బస్సులు తిప్పేలా ఏర్పాట్లు చేశారు
  • కనీసం పదో తరగతి ఉత్తీర్ణత ఉన్న వారిని కండక్టర్లుగా తీసుకోవాలని నిర్ణయించారు. ఇలాంటి వారిని వీలైనంత ఎక్కువ మందిని శుక్రవారం వరకల్లా గుర్తించాలని అధికారులను ఆదేశించారు 
  • రోజుకు డ్రైవర్‌కు రూ.1,600, కండక్టర్‌కు రూ. 1,000 ఇవ్వాలని తేల్చారు 
  • ప్రైవేటు బస్సులు, లారీలు నడిపే వారి వివరాలు సేకరిస్తున్నారు. ఆర్టీసీ రిటైర్డ్‌ డ్రైవర్లు, కండక్టర్లను పిలిపిస్తున్నారు

నేడూ చర్చలుంటాయి: త్రిసభ్య కమిటీ
కార్మిక సంఘాల జేఏసీతో శుక్రవారం కూడా చర్చిస్తాం. 26 డిమాండ్ల పరిష్కారం కోసం చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఇదే విషయాన్ని పేర్కొంటూ వారికి లిఖితపూర్వక హామీ ఇచ్చాం. ఇప్పటికిప్పుడు పరిష్కరించమంటే సాధ్యం కాదు. సమ్మెకు దిగితే ఎస్మాకు సిద్ధం. ప్రయాణికులకు ఇబ్బందులు కాకుండా ఏర్పాట్లు చేస్తున్నాం.


మీడియాతో మాట్లాడుతున్న అశ్వత్థామరెడ్డి 

ఇలాగైతే సమ్మె తథ్యమే: జేఏసీ
ప్రభుత్వం సానుకూలంగా ఉంటుందనటం తప్ప ఒక్క డిమాండ్‌కూ హామీ ఇవ్వటం లేదు. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం ఆలోచన లేదన్న అనుమానం కలుగుతోంది. నెలన్నర సమయం కావాలని చెప్పిన అధికారులు హామీ పత్రంలో వీలైనంత తొందరగా అని తప్ప ఎక్కడా నిర్దిష్ట గడువు పేర్కొనలేదు. సమస్య పరిష్కారం కోసం అధికారుల్లో చిత్తశుద్ధి కనిపించలేదు. ఇలాగే ఉంటే సమ్మె తథ్యం. ఎస్మాకు భయపడం.

కార్మిక సంఘాల జేఏసీ ప్రధాన డిమాండ్లు ఇవే 

  • ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలి. 
  • ఆర్టీసీకి బకాయిపడ్డ మొత్తాన్ని ప్రభుత్వం వెంటనే చెల్లించాలి, భవిష్యత్తులో పెండింగ్‌ పెట్టకుండా  నిధులు విడుదల చేయాలి. 
  • డీజిల్‌ భారాన్ని ప్రభుత్వమే భరించాలి, మోటార్‌వెహికల్‌ ట్యాక్స్‌ను రద్దు చేయాలి. అన్ని రకాల పన్నులను మినహాయించాలి. 
  • కండక్టర్‌ డ్రైవర్లకు ఉద్యోగభద్రత కల్పించాలి. 
  • వేతన సవరణ వెంటనే చేపట్టాలి. 2017 ఏప్రిల్‌ నుంచి బకాయిలు చెల్లించాలి. 
  • ఆర్టీసీలోని అన్ని కేటగిరీల్లో ఉన్న ఖాళీలను వెంటనే భర్తీ చేయాలి. 
  • సీసీఎస్, పీఎఫ్, ఎస్‌ఆర్‌బీఎస్, ఎస్‌బీటీల బకాయిలను వెంటనే విడుదల చేయాలి. 
  • చనిపోయిన ఉద్యోగుల కుటుంబ సభ్యులకు వెంటనే ఉద్యోగం ఇవ్వాలి. 
  • ఆర్టీసీలో అద్దె బస్సులను రద్దు చేసి కాలం చెల్లిన వాటి స్థానంలో కొత్త బస్సులు కొనాలి. 
  • కేంద్రప్రభుత్వం బ్యాటరీ బస్సులకు ఇచ్చే రాయితీ ప్రయోజనం ప్రైవేటు సంస్థలకు కాకుండా ఆర్టీసీకే చెందేలా ఆ బస్సులు సొంతంగా సమకూర్చుకోవాలి. 
  • తార్నాక ఆసుపత్రిని సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రిగా అభివృద్ధి చేయాలి. 
  • నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న ప్రైవేటు వాహనాలను నియంత్రించాలి. 
  • మెట్రో రైలుకు ఇచ్చినట్లు వయబిలిటీ గ్యాప్‌ ఫండ్‌ను ఆర్టీసీకి కూడా ఇవ్వాలి. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement