సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ ఆర్టీసీ కార్మికులతో ప్రభుత్వం తరఫున జరిపిన చర్చలు విఫలం కావడంతో.. వారు శనివారం నుంచి సమ్మె చేపట్టేందుకు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై దృష్టి సారించారు. మంత్రి అజయ్, డీజీపీ మహేందర్‌రెడ్డితో కలిసి.. కలెక్టర్లు, రవాణా, ఆర్టీసీ ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చర్చలు జరిపారు. ఒకవేళ ఆర్టీసీ కార్మికుల సమ్మె అనివార్యమైతే.. పండుగలను దృష్టిలో ఉంచుకుని ప్రజలకు ఏ విధమైన ఇబ్బంది కలగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేపట్టాలని ఆయన అధికారులను ఆదేశించారు.
కార్మికులు బస్సులకు ఆంటకం కలిగించకుండా డిపోలు, సరిహద్దు చెక్‌పోస్ట్‌ల వద్ద తగిన బందోబస్తు ఏర్పాటు చేసి.. 144 సెక్షన్ విధించాలని సూచించారు. అవసరమైతే ప్రైవేటు డ్రైవర్‌లను తీసుకుని అద్దె బస్సులు, విద్యా సంస్థల బస్సులు నడిపేలా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.
తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లను నియమించుకోవాలని ఆదేశం..
ఆర్టీసీ కార్మికులు శనివారం నుంచి సమ్మెకు దిగనున్న నేపథ్యంలో.. ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీ సభ్యులు, ఆర్టీసీ, రవాణా శాఖల ఉన్నతాధికారులు ఎర్రమంజిల్‌లోని రోడ్లు భవనాల శాఖ కార్యాలయంలో సమీక్ష చేపట్టారు. పండుగల నేపథ్యంలో ప్రజలకు ఇబ్బంది కలగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చించారు. తక్షణమే తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లను నియమించుకోవాలని అధికారులు ఆదేశించారు.
అయితే ఇప్పటికే దూరప్రాంతాలకు వెళ్లాల్సిన సర్వీసులు నిలిచిపోయాయి. రాత్రి వరకు మరిన్ని సర్వీసులు నిలిచిపోయే అవకాశం ఉండటంతో.. పోలీసు బందోబస్తు మధ్య బస్సులను నడపాలని ఉన్నతాధికారులు నిర్ణయించారు. ప్రైవేటు బస్సులు, స్కూల్ బస్సులను అందుబాటులోకి తెచ్చేలా చూడాలని అన్నారు. అలాగే క్యాబులు, ప్రైవేటు బస్సులు ప్రయాణికుల నుంచి ఎక్కువ చార్జీలు వసూలు చేయవద్దని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment