‘ఎంప్లాయీస్ యూనియన్’ ఉద్యమబాట
కడప అర్బన్, న్యూస్‌లైన్: కడప, మైదుకూరు, జమ్మలమడుగు, రాయచోటి డిపో మేనేజర్లు, సూపర్‌వైజర్లు తమపై తప్పుడు ఫిర్యాదులు చేస్తూ వేధిస్తున్నారని ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు ఆందోళనబాట పట్టారు. కడప బస్టాండు ఎదురుగా ఎంప్లాయీస్ యూ నియన్ ఆధ్వర్యంలో కడప డిపో మేనేజర్ వైఖరిపై నిర్వహిస్తున్న ఆందోళన సోమవారం ఆరవరోజుకు చేరుకుంది. ఈ మేరకు ఎంప్లాయీస్ యూనియన్ కడప జోనల్ సెక్రటరి జీవీ నరసయ్య, కడప రీజనల్ అధ్యక్ష కార్యదర్శులు ఎస్.నాగముని, వీఎం కుమార్, రీజనల్ నాయకులు బండి చెన్నయ్య, రామిరెడ్డి తదితరులు సోమవారం సాయంత్రం కడప ఇ న్‌చార్జి ఆర్‌ఎం బ్రహ్మానందరెడ్డికి ఉద్యమ నోటీసు ఇచ్చారు.
అనంతరం వారు మాట్లాడుతూ కడపలో డిపోలో కొంతమంది ట్రాఫిక్ సూపర్‌వైజర్లు కార్యకర్త లు, నాయకులను రెచ్చగొట్టడమే కాకుం డా కార్మికుల సమస్యల పరిష్కారానికి డిపో మేనేజర్ల దృష్టికి తీసుకెళ్లినప్పుడు అవహేళనచేసి మాట్లాడుతున్నారని విమర్శించారు. దీంతోపాటు పలు సమస్యల పరిష్కారానికి రీజనల్ మేనేజర్‌కు, ఇతర అధికారులకు అనేక సంయుక్త సమావేశాల్లో ఫిర్యాదులు ఇచ్చినా ఫలితం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. రీజనల్ మేనేజ్‌మెంట్ తమ ధోరణి మార్చుకోనందున ప్రత్యక్ష ఆందోళనలు చేయాలని ఈ నెల 17న డిపో కార్యదర్శుల సమావేశం లో నిర్ణయించామన్నారు. అందులో భాగంగా ఈ నెల 20,21 తేదీల్లో రీజనల్ వ్యాప్తంగా అన్ని డిపోల పరిధిలో ఆందోళనలు చేపడుతున్నామన్నారు.