AP Employees Union Leaders Thanks To CM YS Jagan - Sakshi
Sakshi News home page

మీరు బాగుంటేనే ప్రజలు బాగు

Published Fri, Jun 9 2023 1:51 PM | Last Updated on Sat, Jun 10 2023 5:11 AM

Ap Employees Union Leaders Thanks To Cm Jagan - Sakshi

సాక్షి, అమరావతి: ఉద్యోగులకు ప్రభుత్వం నుంచి జరగాల్సిన మంచి ఏదైనా సరే చేస్తా­మని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. ఉద్యోగులు ప్రభుత్వంలో భాగస్వాములని, వారంతా చిరునవ్వుతో ఉండేలా చూస్తామని అన్నారు. ఉద్యోగులు బాగుంటేనే ప్రజలు బాగుంటారని విశ్వసించిన ప్రభుత్వం మనదని, ఉద్యోగుల మనసులో కష్టం ఉండకుండా చూడాలన్నదే తమ ఉద్దేశమని చెప్పారు.

ఉద్యోగుల విషయంలో రాష్ట్ర మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాలను 60 రోజుల్లోగా అమలు చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. కొత్తగా..  జీపీఎస్‌ (గ్యారంటీ పెన్షన్‌ స్కీం) తీసుకురావడం, కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ, ప్రభుత్వంలో ఏపీవీవీపీ ఉద్యోగుల విలీనం, 12వ పీఆర్సీ ఏ­ర్పాటు సహా పలు అంశాలపై ఈ నెల 7వ తే­దీన జరిగిన కేబినెట్‌లో ప్రభుత్వం నిర్ణయం తీ­సుకున్న విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో ఉద్యోగ సంఘాల ప్రతినిధులు శుక్రవారం సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డితో సమావేశమయ్యారు. ఉద్యోగుల విషయంలో తీసుకున్న నిర్ణయాలపై హర్షం వ్యక్తం చేస్తూ సీఎం జగన్‌కు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సదర్భంగా ఉద్యోగ సంఘాల ప్రతినిధులను ఉద్దేశించి సీఎం ఏమన్నారంటే.. 

పరిష్కారాల కోసం తపనపడ్డాం 
  ఉద్యోగుల మనసు కష్టపెట్టకూడదనే ఉద్దేశంతోనే పెన్షన్‌ సహా కొన్ని సమస్యల పరిష్కారాల కోసం రెండేళ్లుగా తపన పడ్డాం. గతంలో ఎవరూ కూడా ఒక పరిష్కారం కోసం ఇంతగా తపన పడిన పరిస్థితులు ఎప్పుడూ లేవు. ఉద్యోగులకు పరిష్కారం దొరకాలి.. అంతేకాకుండా భావితరాలను కూడా దృష్టిలో ఉంచుకోవాలనే ఆలోచన చేశాం. వీటన్నింటి దృష్ట్యా జీపీఎస్‌ తీసుకువచ్చాం. 
   రిటైర్డ్‌ ఉద్యోగుల జీవన ప్రమాణాలను కూడా నిలబెట్టేదిగా జీపీఎస్‌ను రూపొందించాం. బేసిక్‌ జీతంలో 50 శాతం అంటే రూ.లక్ష జీతం ఉంటే రూ.50 వేలు రిటైర్‌ అయిన తర్వాత పింఛన్‌ వస్తుంది. 62 ఏళ్లకు రిటైర్‌ అయితే 82 ఏళ్లలో కూడా అదే స్థాయిలో జీవన ప్రమాణాలు ఉండాలని ఆలోచన చేశాం. అందుకే ద్రవ్యోల్బణాన్ని దృష్టిలో ఉంచుకుని డీఆర్‌లు ఇచ్చేలా జీపీఎస్‌లో పొందుపరిచాం.  
  ఉద్యోగులకు న్యాయం జరగాలి.. మరోవైపు నడపలేని పరిస్థితులు రాకుండా కూడా చూడాలని ఆలోచించాం. సీపీఎస్‌లో లేనివి జీపీఎస్‌లో ఉన్నాయి. దీనికోసం రెండేళ్లపాటు ఆర్థిక శాఖ సుదీర్ఘ కసరత్తు చేసింది. ఫలితంగా జీపీఎస్‌కు రూపకల్పన చేశాం. 

చదవండి: 99 శాతం పూర్తి.. దేశ చరిత్రలోనే తొలిసారి

మంచి జరిగేలా అడుగులేశాం 
♦ న్యాయంగా, ధర్మంగా ఉద్యోగులకు మంచి జరగాలని ప్రతి అడుగులో కనిపించే విధంగా చేశాం. ఇది సంతృప్తినిచ్చే అంశం. అసలు చాలా మంది ఎఫర్ట్‌ కూడా పెట్టరు. ఇంత ఆలోచన చేయాల్సిన పని ఏముందని అనుకుంటారు. అలా చేస్తే పరిష్కారం రాదు. అందుకే తొలిసారిగా పరిష్కారం దిశగా అడుగులు వేశాం.  
♦  కాంట్రాక్ట్‌ ఉద్యోగుల క్రమబద్ధీకరణపై కూడా మంచి ఆలోచన చేశాం. ఈ విషయంలో సుప్రీంకోర్టు తీర్పులను కూడా పరిగణనలోకి తీసుకున్నాం. వారికి మంచి చేయాలన్న ఆలోచనతో అడుగులు ముందుకేశాం. నా దగ్గరకు వచ్చినప్పుడు రాష్ట్ర విభజన కంటే ముందు పదేళ్లను విండోగా అధికారులు నిర్ణయించారు. అలాగైతే మరీ ఆలస్యమవుతుందని ఐదేళ్లకు తగ్గించాం. తద్వారా గరిష్టంగా ఉద్యోగులకు మేలు జరిగేలా నిర్ణయం తీసుకున్నాం. 
 
చిరునవ్వుతో ఉండేలా చేస్తాం 
♦ వైద్య విధాన పరిషత్‌ ఉద్యోగులను కూడా ప్రభుత్వంలో విలీనం చేశాం. 010 ద్వారా ప్రభుత్వ ఉద్యోగులకు వచ్చినట్లుగా వీరికి జీతాలు సమయానికి రావు. పోస్ట్‌ రిటైర్‌మెంట్‌ బెనిఫిట్స్‌లో కూడా వ్యత్యాసం ఉంది. ఈ నేపథ్యంలో వారికీ మంచి పరిష్కారం చూపించే దిశగా చర్యలు తీసుకున్నాం.   
♦  ఇంకా భవిష్యత్తులో ప్రభుత్వం వైపు నుంచి ఏ రకమైన మంచి జరగాల్సి ఉన్నా, మీ మొహంలో (ఉద్యోగులు)  చిరునవ్వు ఉండేలా చేస్తాం. ఉద్యోగులు బాగుంటేనే ప్రజలకూ మంచి జరుగుతుంది. ప్రభుత్వం ఎప్పుడూ మీకు తోడుగా ఉంటుంది.  
ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్‌ ఎన్‌జీవో అసోసియేషన్‌ అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు, కార్యదర్శి శివారెడ్డి, రాష్ట్ర సచివాలయ ఉద్యోగుల అసోసియేషన్‌ అధ్యక్షుడు కె.వెంకటరామిరెడ్డి, ఆయా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.   

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement