‘ఉపాధి’ బకాయిలు రూ.15కోట్లు
Published Sun, Aug 18 2013 2:49 AM | Last Updated on Sat, Aug 25 2018 5:17 PM
పరిగి, న్యూస్‌లైన్ : మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం.. గాంధీజీ కలలుగన్న గ్రామాభివృద్ధితోపాటు కూలీలకు ఉపాధి, ఆదాయం సమకూర్చేందుకు దేశవ్యాప్తంగా చేపట్టిన బృహత్తర పథకం. కూలీలకు స్వగ్రామంలోనే ఉపాధి కల్పించేలా అభివృద్ధి పనులు చేపట్టి నిర్దేశించిన వేతనాలు అందజేస్తూ వారి కుటుంబాల సంక్షేమానికి పాటుపడటం ఈ పథకం ముఖ్య ఉద్దేశం. అయితే పథకం అమలులో మాత్రం కూలీల హక్కుల ఉల్లంఘన జరుగుతోంది. ప్రతి కూలీకి అడిగిన 15 రోజుల్లోగా పని కల్పించాలి. పనిచేసిన 15 రోజుల్లోపు కూలి డబ్బులు చెల్లించాలన్న పథకం ప్రాథమిక సూత్రానికే అధికారులు తూట్లు పొడుస్తున్నారు. జిల్లావ్యాప్తంగా పలుచోట్ల కూలీలు పనులు చేసి ఐదు నెలలు కావొస్తున్నా డబ్బులు చెల్లించటంలేదు. కార్యాలయాల చుట్టూ కూలీలు డబ్బుల కోసం తిరుగుతున్నా అధికారులు కనికరించడం లేదు. తప్పు మాది కాదంటే మాది కాదంటూ పథకం సిబ్బంది, బ్యాంకు అధికారులు ఒకరిపై ఒకరు నెపం మోపుకుంటూ కూలీలకు డబ్బుల చెల్లింపులో మీనమేషాలు లెక్కిస్తున్నారు.
జిల్లాలో కూలీలకు బకాయిలు రూ.15కోట్లపైనే
ఉపాధి హామీ పథకం కింద జిల్లావ్యాప్తంగా పనిచేసిన కూలీలకు చెల్లించాల్సిన బకాయిలు చూస్తే నివ్వెరపోక తప్పదు. ఒక్కో మండలంలో రూ.కోటికి పైగా బకాయిలు చెల్లించాల్సి ఉంది. జిల్లావ్యాప్తంగా రూ.15కోట్లకు పైగా కూలీలకు ఇవ్వాల్సి ఉండగా, ఒక్క పరిగి నియోజకవర్గంలోనే రూ.3.45కోట్ల బకాయిలు పేరుకుపోయాయి. ఇందులో కుల్కచర్ల మండలంలోనే రూ.1.30కోట్ల కూలి డబ్బులు పెండింగ్‌లో ఉండగా, పరిగి మండలంలో రూ.70లక్షలు, దోమ మండలంలో రూ.40లక్షలు, గండేడ్ మండలంలో రూ.80 లక్షలు, పూడూరు మండలానికి సంబంధించి రూ.25లక్షలు కూలీలకు చెల్లించాల్సి ఉంది.
రేపుమాపంటూ ఐదు నెలలు
కూలీల హక్కుల్ని పరిరక్షించాల్సిన అధికారులు వాటిని కాలరాస్తున్నారు. మార్చి, ఏప్రిల్ మాసాల్లో చేసిన పనులకు సంబంధించి కూలి డబ్బులు ఇప్పటికీ ఇవ్వటంలేదు. కూలీలు డబ్బుల కోసం కార్యాలయానికి వచ్చిన ప్రతిసారి ఏదో కారణం చెబుతూ తిప్పి పంపుతున్నారు. నిబంధనలు గాలికొదిలేసి ఇవాళ రేపంటూ ఐదు నెలలుగా కూలీలను కార్యాలయాల చుట్టు తిప్పుకుంటున్నారు. తాము చేయాల్సిందంతా చేసి పంపాము పైనుంచే డబ్బులు రావటంలేదని స్థానిక అధికారులు పేర్కొంటున్నారు.
అన్ని రకాల పనులకు సంబంధించి అంతే
ఉపాధి హామీలో భాగంగా గ్రామాల్లో పనులు చేస్తున్న కూలీలకు ఇవ్వాల్సిన డబ్బులతో పాటు ఆ పథకం ద్వారా చేపడుతున్న అన్ని రకాల పనులకు ఇవ్వాల్సిన డబ్బులన్నీ ఐదు నెలలుగా పెండింగ్‌లోనే ఉన్నాయి. దీంతో పలు గ్రామాల్లో మొక్కల పెంపకం, మరుగుదొడ్ల నిర్మాణాలు నిల్చిపోయాయి. వర్షాకాలంలోనూ పనులు కల్పిస్తామని అధికారులు చెబుతున్నా ఇదివరకు చేసినవాటికే డబ్బులు ఇవ్వకపోవడంతో కూలీలు పనులు చేయడానికి ముందుకు రావడం లేదు.
ఏజెన్సీ మార్చినందుకే జాప్యం
ఉపాధి హామీ పథకం కింద ఇప్పటివరకు చేస్తున్న చెల్లింపుల విధానంలో మార్పులు చోటు చేసుకున్నాయి. గతంలో చెల్లింపుల కాంట్రాక్టును పీనో ఏజెన్సీకి ఇచ్చారు. ఆ ఏజెన్సీ సహకారంతో యాక్సిస్ బ్యాంకు ద్వారా చెల్లింపులు జరిగేవి. అప్పట్లో వారు క్యాష్ హాలిడే పేరుతో కొన్ని రోజులు జాప్యం చేశారు. ప్రస్తుతం వారి కాంట్రాక్టు రద్దు చేసి మణిపాల్ కంపెనీకి కాంట్రాక్టు అప్పగించారు. వారు కొత్తగా ఈసీఎస్పీలను నియమించుకోవాల్సి ఉంది. ఈ ప్రక్రియ ప్రస్తుతం కొనసాగుతోంది. అందుకే చెల్లింపులలో జాప్యం ఏర్పడింది.
- చంద్రకాంత్ రెడ్డి, డ్వామా పీడీ
Advertisement