Grameena upadhi hami padhakam
-
ఉపాధికి మరో 40 వేల కోట్లు
న్యూఢిల్లీ: స్వయం సమృద్ధి భారత్ లక్ష్యంగా, దేశ ఆర్థిక వ్యవస్థపై కరోనా ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కొనే దిశగా ప్రధాని మోదీ ప్రకటించిన రూ. 20 లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీలో చిట్టచివరి వివరాలను ఐదోరోజు ఆదివారం ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఉపాధి హామీ, వైద్యారోగ్యం, విద్య తదితర రంగాలపై ఈ రోజు దృష్టి పెట్టినట్లు వివరించారు. సొంతూళ్లకు వెళ్తున్న వలస కూలీలకు ఉపాధి కల్పించేందుకు గ్రామీణ ఉపాధి హామీ పథకానికి రూ. 40 వేల కోట్లను అదనంగా కేటాయించామన్నారు. ‘బడ్జెట్లో ప్రకటించిన రూ. 61 వేల కోట్లకు ఇది అదనం. ఈ మొత్తంతో 300 కోట్ల పని దినాలను సృష్టించవచ్చు’అని నిర్మల చెప్పారు. ఐదు విడతలుగా తాము ప్రకటించిన ప్యాకేజీ మొత్తం విలువ రూ. 20.97 లక్షల కోట్లని తెలిపారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించిన రూ. 8.01 లక్షల కోట్ల ఉద్దీపన ప్యాకేజీ ఇందులో భాగమేనన్నారు. అయితే, ఇందులో ప్రభుత్వం నికరంగా చేసే ఖర్చు ఎంతో వివరించేందుకు ఆమె నిరాకరించారు. కానీ, ఉపాధి హామీ పథకంలో పెంపుదల, ఉచిత ఆహార ధాన్యాలు, కొన్ని వర్గాలకు పన్ను రాయితీలు, కరోనాపై పోరు కోసం వైద్యారోగ్య రంగానికి కేటాయించిన రూ. 15 వేల కోట్లు మొదలైన వాటితో కలిపి నికర ప్రభుత్వ ఖర్చు సుమారు రూ. 2.1 లక్షల కోట్లు ఉండొచ్చని ఆర్థిక నిపుణులు అంచనా వేశారు. ఐదు విడతలుగా తెలిపిన ప్యాకేజీలో ఎంఎస్ఎంఈ, వీధి వ్యాపారులు, రైతులు, వలస కూలీలు, వ్యవసాయ అనుబంధ రంగాల్లోని వారు.. తదితరాలకు పలు ఉపశమన చర్యలను ప్రకటించారు. అంటువ్యాధుల ప్రత్యేక కేంద్రాల ఏర్పాటు ► పీఎం కిసాన్ పథకం కింద ఈ లాక్డౌన్ కాలంలో దేశవ్యాప్తంగా 8.19 కోట్ల మంది రైతులకు రూ. 2 వేల చొప్పున 16,394 కోట్ల రూపాయలను అందించాం. మహిళల జన్‌ధన్ ఖాతాల్లో రూ.10,025 కోట్లను జమ చేశాం. ► ప్రజారోగ్య రంగానికి నిధుల వాటా పెంచాలని నిర్ణయించాం. క్షేత్రస్థాయి వైద్య కేంద్రాల్లో పెట్టుబడులను పెంచుతాం. అన్ని ఆసుపత్రుల్లో అంటువ్యాధుల ప్రత్యేక కేంద్రాలను, తాలూకా స్థాయి వరకు వ్యాధి నిర్ధారణ ప్రయోగశాలలను ఏర్పాటు చేస్తాం. గ్రామాల్లోనూ ఆరోగ్య కేంద్రాల ఏర్పాటుకు కృషి చేస్తాం. ► కరోనాపై పోరు కోసం కేంద్రం ప్రకటించిన రూ. 15 వేల కోట్లలో రూ. 4,113 కోట్లను ఆరోగ్య శాఖ ఇప్పటికే విడుదల చేసింది. ‘పీఎం ఈ– విద్య’ ► డిజిటల్, ఆన్లైన్ విద్యకు సంబంధించి ‘పీఎం ఈ– విద్య’పేరుతో ఒక బహుముఖ కార్యక్రమాన్ని అతిత్వరలో ప్రారంభిస్తాం. ఇందులో భాగంగా, అలాగే, 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు, ప్రతీ తరగతికి ఒక ప్రత్యేక చానెల్ ఉంటుంది. మే 30 నుంచి ఆన్లైన్ కోర్సులను ప్రారంభించుకునేందుకు 100 అత్యున్నత విద్యాసంస్థలకు అనుమతిస్తున్నాము. పాఠశాల విద్యలో ‘డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ నాలెడ్జ్ షేరింగ్ (దీక్ష)’ను విస్తృతంగా ఉపయోగిస్తాం. విద్యార్థులు, ఈ యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. ► భవిష్యత్తులో అవసరమైన నైపుణ్యాల సముపార్జనకు ఉపయోగపడేలా త్వరలో జాతీయ స్థాయిలో కొత్త కరిక్యులమ్ విధానాన్ని ప్రారంభిస్తాం. డిసెంబర్ నాటికి ‘నేషనల్ ఫౌండేషనల్ లిటరసీ, న్యూమరసీ మిషన్’ను ప్రారంభిస్తాం. లాక్డౌన్ కారణంగా విద్యార్థుల్లో ఉత్పన్నమవుతున్న మానసిక సమస్యల పరిష్కారానికి ‘మనోదర్పణ్’ కార్యక్రమాన్ని రూపొందించాము. 5 శాతానికి రాష్ట్రాల రుణ పరిమితి.. షరతులు వర్తిస్తాయి రాష్ట్రాల రుణ పరిమితి ఆ రాష్ట్ర జీడీపీలో 3% వరకు ఉండగా, దాన్ని 2020–21 నుంచి 5 శాతానికి పెంచుతున్నట్లు ఆర్థికమంత్రి తెలిపారు. తద్వారా రాష్ట్రాలకు రూ. 4.28 లక్షల కోట్లు అదనంగా అందుబాటులోకి వస్తాయన్నారు. అయితే, ఇందుకు రాష్ట్రాలు ‘ఒక దేశం– ఒక రేషన్ కార్డ్’, ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’, ‘విద్యుత్ సరఫరా’, ‘పట్టణ స్థానిక సంస్థల ఆదాయం’ మొదలైన 4 అంశాల్లో సంస్కరణలను అమలు చేయాల్సి ఉంటుందన్నారు. ప్రస్తుతం ఉన్న 3% పరిమితి ప్రకారం రాష్ట్రాలకు రూ. 6.41 లక్షల కోట్ల వరకు నికర రుణ పరిమితి ఉంది. ఈ పరిమితిని పెంచాలంటూ ఇప్పటికే పలువురు ముఖ్యమంత్రులు ప్రధానికి లేఖలు రాశారు. ప్రస్తుత విపత్కర పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని రుణ పరిమితి పెంపుపై నిర్ణయం తీసుకున్నట్లు నిర్మల తెలిపారు. ‘3% నుంచి 3.5% వరకు షరతులు ఉండవు. 3.5% నుంచి 4.5% వరకు పరిమితి పెంపు 4 విడతలుగా 0.25% చొప్పున, సంస్కరణల అమలుకు సంబంధించిన షరతుల అమలుపై ఆధారపడి ఉంటుంది. కనీసం మూడు సంస్కరణల అమలును విజయవంతంగా పూర్తి చేసినప్పుడు మిగతా 0.5% పెంపు ఉంటుంది’అని ఆమె వివరించారు. ‘3%లో 75% రుణంగా పొందేందుకు కేంద్రం రాష్ట్రాలకు అనుమతివ్వగా రాష్ట్రాలు అందులో 14% మాత్రమే అప్పుగా పొందాయి. మిగతా 86% నిధులు నిరుపయోగంగానే ఉన్నాయి’అని మంత్రి నిర్మల తెలిపారు. -
జల సంరక్షణలో మనమే టాప్
జలశక్తి అభియాన్అమలులో మన జిల్లాదేశంలోనే అగ్రగామిగా నిలిచింది.ప్రతి నీటి చుక్కను ఒడిసి పట్టిభూమిలో తేమ శాతాన్ని పెంచాలనికేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్నిప్రవేశపెట్టింది. దేశవ్యాప్తంగా253 జిల్లాలలో పథకం అమలవుతోంది. కడప కార్పొరేషన్: మన రాష్ట్రంలో 9 జిల్లాలలోని 68 మండలాల్లో అమలు చేస్తున్నారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా జలశక్తి అభియాన్ కింద జూలై 1 నుంచి సెప్టెంబర్ 15 వరకూ జలసంరక్షణ పనులు చేపట్టాలని కేంద్రం నిర్దేశించింది. తర్వాత ఆ గడువును సెప్టెంబర్ 30 వరకూ పొడిగించింది. వేముల, వేంపల్లి, లింగాల, సింహాద్రిపురం, చిన్నమండెం, సంబేపల్లి, పోరుమామిళ్ల, రాజంపేట, పుల్లంపేట, ఓబులవారిపల్లె, కోడూరు, పెనగలూరు, కమలాపురం మండలాల్లో పథకం పనులు జరుగుతున్నాయి. వాననీటి సంరక్షణ నిర్మాణాలు, సాంప్రదాయ నీటి వనరుల పునరుద్ధరణ, రీచార్జ్ నిర్మాణాల ద్వారా బోరుబావులు పునరుద్ధరణ, వాటర్ షెడ్ అభివృద్ధి, విస్తృత అటవీకరణ కేటగిరీలలో ఇప్పటివరకూ 12,679 పనులు చేపట్టారు. అధికారులు ఈ పథకం అమలు విషయంలో శ్రద్ధ వహించారు. ఫలితంగా జలకళ ఉట్టిపడుతోంది. అధికారుల కృషికి ప్రతిఫలంగా జలశక్తి అభియాన్ పథకం అమలులో మన జిల్లా దేశంలోనే గుర్తింపు సాధించగలిగింది. కిసాన్ మేళాల నిర్వహణలో కూడా జిల్లాప్రథమ స్థానంలో ఉంది. నీటి వినియోగం, జలసంరక్షణపై రైతులకు, ప్రజలకుఅవగాహన కల్పించడానికి కృషి విజ్ఞాన కేంద్రం, జిల్లా నీటి యాజమాన్య సంస్థ ఆధ్వర్యంలో కిసాన్ మేళాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటివరకూ 53773మేళాలు నిర్వహించారు. ఉన్నతాధికారుల ప్రత్యేక శ్రద్ధ జలశక్తి అభియాన్ అమలు విషయంలో జిల్లా కలెక్టర్ హరికిరణ్, సెంట్రల్ నోడల్ ఆఫీసర్ ఎస్.సురేష్‌కుమార్, డ్వామా పీడీ యదుభూషణ్రెడ్డిలతోపాటు బ్లాక్ నోడల్ ఆఫీసర్లు రాజేందర్ కుమార్, శివ్ రతన్ అగర్వాల్, రూప్ కిషోర్, టెక్నికల్ ఆఫీసర్ కె. రమేష్‌లు చొరవ తీసుకున్నారు. ఆన్లైన్లో ప్రతి పది నిముషాలకోసారి జిల్లాల ర్యాంకులు, స్కోర్ మారిపోతూ ఉంటాయి. దీన్ని పదిలంగా ఉంచేందుకు తరచూ సమీక్షలు నిర్వహించడంతోపాటు ప్రతి మండలానికి ఒక ఇ¯న్చార్జి ఆఫీసర్‌ను నియమించారు. జిల్లా కేంద్రంలోఒక బృందం పనులను పర్యవేక్షించారు. క్లస్టర్ ఏపీడీలు, హెడ్ ఆఫీసు సిబ్బంది పట్టుదలతో పనిచేశారు. మరో నాలుగు రోజులు డ్వామా సిబ్బంది ప్రస్తుత కృషి కొనసాగిస్తే కష్టానికి ఫలితం లభించినట్లే. సమిష్టి కృషి వల్లే ఈ ఘనత సమిష్టి కృషి వల్లే అగ్రస్థానంలో జిల్లా నిలిచిందని జిల్లా నీటి యాజమాన్య సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ పి. యదుభూషణ్‌రెడ్డి తెలిపారు. ఆగష్టు 2న తాను విధుల్లో చేరేనాటికి మన జిల్లా 222వ స్థానంలో ఉన్నదన్నారు. జిల్లా కలెక్టర్ హరికిరణ్, సెంట్రల్ నోడల్ ఆఫీసర్ సురేష్‌కుమార్ సలహాలు, సూచనల మేరకు సిబ్బందిని సమాయత్త పరచడం ద్వారా పనులు వేగవంతం చేశామన్నారు. ఈనెల 15 నాటికి దేశంలో మూడో ర్యాంకుకు చేరవయ్యామన్నారు. సెలవులు కూడా తీసుకోకుండా సిబ్బంది కష్టపడ్డారని ప్రశంసించారు. డ్వామా సిబ్బందిని అభినందించిన పీడీ కడప కార్పొరేషన్: జలశక్తి అభియాన్ కార్యక్రమంలో వైఎస్ఆర్ జిల్లా దేశంలోనే ప్రథమ స్థానంలో నిలపడానికి కృషి చేసిన అధికారులు, సిబ్బందిని డ్వామా పీడీ యదుభూషణ్‌రెడ్డి అభినందించారు. గురువారం ఆయన వారందరినీ సమావేశపరిచి మాట్లాడుతూ జల సంరక్షణ పనులు వేగవంతం చేయడంలో అందరూ అంకిత భావంతో పనిచేశారని కొనియాడారు. మరో నాలుగు రోజుల పాటు ఇదే స్ఫూర్తిని కొనసాగించాలని, తద్వారా ఈనెల 30 తేదికి కూడా వైఎస్ఆర్ జిల్లా ప్రథమ స్థానంలో కొనసాగేందుకు కృషి చేయాలని కోరారు. -
వేతన కష్టాలు
కర్నూలు(అర్బన్): మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద జిల్లాలో పనులు చేస్తున్న కూలీలకు వేతనాలు అందడం లేదు. దాదాపు రెండున్నర నెలలుగా వేతనాలు ఆగిపోవడంతో గ్రామీణ ప్రాంతాల్లోని కూలీలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నారు. ఉదయం ఆరు గంటలకే పనులకు వెళుతూ.. చెమటోడ్చి కష్టిస్తున్నారు. అయినప్పటికీ కనీసం వారానికి ఒక సారి కూడా వేతనాలు ఇవ్వకపోవడం ఏమిటని వారు ప్రశ్నిస్తున్నారు. వేతనాలు సరిగా అందకపోవడంతో చాలా ప్రాంతాల్లోని కూలీలు ఉపాధి పనులకు స్వస్తి పలికి, సుదూర ప్రాంతాలకు వలస బాట పడుతున్నారు. ఇప్పటికే పత్తికొండ, ఆలూరు, ఎమ్మిగనూరు, ఆదోని, కోడుమూరు తదితర ప్రాంతాల్లో 50 శాతానికి పైగా వ్యవసాయ కూలీలు పొట్ట చేతపట్టుకొని ఇతర ప్రాంతాలకు వెళ్లారు. ఉన్న వారు కూడా తమ ప్రాంతాల్లో జరుగుతున్న రోజువారీ కూలి ఇచ్చే పనులకు వెళ్లేందుకే ఇష్టపడుతున్నారు. వ్యవసాయ పనులు అంతంతమాత్రంగా ఉన్న ప్రాంతాల్లో ఇబ్బందులు తప్పడం లేదు. రెగ్యులర్‌గా వేతనాలు విడుదల కాకపోవడంతో కూలీలతో పనులు చేయించేందుకు ఫీల్డ్ అసిస్టెంట్లు కూడా మక్కువ చూపడం లేదని తెలుస్తోంది. చేసిన పనులకు వేతనాలు ఇవ్వాలని కూలీలు మండల పరిషత్ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా.. సంబంధిత అధికారులు ఇదిగో, అదిగో అంటూ కాలయాపన చేస్తున్నారు. రూ.50 కోట్ల పెండింగ్ జిల్లాలో ఇప్పటి వరకు ఉపాధి కూలీలకు రూ.50 కోట్ల మేర వేతనాలను చెల్లించాల్సి ఉంది. గత ఏడాది నవంబర్ ఏడో తేదీ నుంచి బకాయిలు ఉన్నాయి. గత ఏడాది ఆగస్టులో విడుదలైన రూ.39 కోట్ల నిధులతో అక్టోబర్ వరకు సర్దుబాటు చేశారు. తర్వాత నిధులు విడుదల కాలేదు. వేతనాలు అందకపోవడంతో కూలీల హాజరు క్రమేణా తగ్గిపోతోంది. గతంలో 60 వేల దాకా ఉన్న కూలీల సంఖ్య ప్రస్తుతం 40 వేలకు పడిపోయింది. వారానికి ఒకసారైనా ఇవ్వకపోతే ఎలా? చేసిన పనులకు కనీసం వారానికి ఒకసారైనా కూలి ఇవ్వకపోతే ఎలా బతకాలి? ఇప్పటికే రెండున్నర నెలలుగా వేతనాలు అందించకపోవడంతో కుటుంబం గడవడం కష్టంగా ఉంది. గ్రామాల్లో ఇతర పనులకు వెళ్లే వారిని ఉపాధి పనులకు రావాలని చెబుతున్నారు. అయితే..వేతనం మాత్రం నెలల తరబడి ఇవ్వడం లేదు. – ఆంజనేయులు, కలచట్ల, ప్యాపిలి మండలం నెలాఖరుకు విడుదల కానున్నాయి ఉపాధి కూలీలకు రూ.50 కోట్ల వరకు వేతన బకాయిలున్న మాట వాస్తవమే. నవంబర్ ఏడో తేదీ నుంచి ఇప్పటి వరకు వేతనాలను అందించాల్సి ఉంది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోనూ పెండింగ్ ఉన్నాయి. బకాయి పడిన వేతనాలను విడుదల చేయనున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ నెలాఖరు నాటికి విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి. – ఎం.వెంకటసుబ్బయ్య, డ్వామా పీడీ -
‘ఉపాధి’ బకాయిలు రూ.15కోట్లు
పరిగి, న్యూస్‌లైన్ : మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం.. గాంధీజీ కలలుగన్న గ్రామాభివృద్ధితోపాటు కూలీలకు ఉపాధి, ఆదాయం సమకూర్చేందుకు దేశవ్యాప్తంగా చేపట్టిన బృహత్తర పథకం. కూలీలకు స్వగ్రామంలోనే ఉపాధి కల్పించేలా అభివృద్ధి పనులు చేపట్టి నిర్దేశించిన వేతనాలు అందజేస్తూ వారి కుటుంబాల సంక్షేమానికి పాటుపడటం ఈ పథకం ముఖ్య ఉద్దేశం. అయితే పథకం అమలులో మాత్రం కూలీల హక్కుల ఉల్లంఘన జరుగుతోంది. ప్రతి కూలీకి అడిగిన 15 రోజుల్లోగా పని కల్పించాలి. పనిచేసిన 15 రోజుల్లోపు కూలి డబ్బులు చెల్లించాలన్న పథకం ప్రాథమిక సూత్రానికే అధికారులు తూట్లు పొడుస్తున్నారు. జిల్లావ్యాప్తంగా పలుచోట్ల కూలీలు పనులు చేసి ఐదు నెలలు కావొస్తున్నా డబ్బులు చెల్లించటంలేదు. కార్యాలయాల చుట్టూ కూలీలు డబ్బుల కోసం తిరుగుతున్నా అధికారులు కనికరించడం లేదు. తప్పు మాది కాదంటే మాది కాదంటూ పథకం సిబ్బంది, బ్యాంకు అధికారులు ఒకరిపై ఒకరు నెపం మోపుకుంటూ కూలీలకు డబ్బుల చెల్లింపులో మీనమేషాలు లెక్కిస్తున్నారు. జిల్లాలో కూలీలకు బకాయిలు రూ.15కోట్లపైనే ఉపాధి హామీ పథకం కింద జిల్లావ్యాప్తంగా పనిచేసిన కూలీలకు చెల్లించాల్సిన బకాయిలు చూస్తే నివ్వెరపోక తప్పదు. ఒక్కో మండలంలో రూ.కోటికి పైగా బకాయిలు చెల్లించాల్సి ఉంది. జిల్లావ్యాప్తంగా రూ.15కోట్లకు పైగా కూలీలకు ఇవ్వాల్సి ఉండగా, ఒక్క పరిగి నియోజకవర్గంలోనే రూ.3.45కోట్ల బకాయిలు పేరుకుపోయాయి. ఇందులో కుల్కచర్ల మండలంలోనే రూ.1.30కోట్ల కూలి డబ్బులు పెండింగ్‌లో ఉండగా, పరిగి మండలంలో రూ.70లక్షలు, దోమ మండలంలో రూ.40లక్షలు, గండేడ్ మండలంలో రూ.80 లక్షలు, పూడూరు మండలానికి సంబంధించి రూ.25లక్షలు కూలీలకు చెల్లించాల్సి ఉంది. రేపుమాపంటూ ఐదు నెలలు కూలీల హక్కుల్ని పరిరక్షించాల్సిన అధికారులు వాటిని కాలరాస్తున్నారు. మార్చి, ఏప్రిల్ మాసాల్లో చేసిన పనులకు సంబంధించి కూలి డబ్బులు ఇప్పటికీ ఇవ్వటంలేదు. కూలీలు డబ్బుల కోసం కార్యాలయానికి వచ్చిన ప్రతిసారి ఏదో కారణం చెబుతూ తిప్పి పంపుతున్నారు. నిబంధనలు గాలికొదిలేసి ఇవాళ రేపంటూ ఐదు నెలలుగా కూలీలను కార్యాలయాల చుట్టు తిప్పుకుంటున్నారు. తాము చేయాల్సిందంతా చేసి పంపాము పైనుంచే డబ్బులు రావటంలేదని స్థానిక అధికారులు పేర్కొంటున్నారు. అన్ని రకాల పనులకు సంబంధించి అంతే ఉపాధి హామీలో భాగంగా గ్రామాల్లో పనులు చేస్తున్న కూలీలకు ఇవ్వాల్సిన డబ్బులతో పాటు ఆ పథకం ద్వారా చేపడుతున్న అన్ని రకాల పనులకు ఇవ్వాల్సిన డబ్బులన్నీ ఐదు నెలలుగా పెండింగ్‌లోనే ఉన్నాయి. దీంతో పలు గ్రామాల్లో మొక్కల పెంపకం, మరుగుదొడ్ల నిర్మాణాలు నిల్చిపోయాయి. వర్షాకాలంలోనూ పనులు కల్పిస్తామని అధికారులు చెబుతున్నా ఇదివరకు చేసినవాటికే డబ్బులు ఇవ్వకపోవడంతో కూలీలు పనులు చేయడానికి ముందుకు రావడం లేదు. ఏజెన్సీ మార్చినందుకే జాప్యం ఉపాధి హామీ పథకం కింద ఇప్పటివరకు చేస్తున్న చెల్లింపుల విధానంలో మార్పులు చోటు చేసుకున్నాయి. గతంలో చెల్లింపుల కాంట్రాక్టును పీనో ఏజెన్సీకి ఇచ్చారు. ఆ ఏజెన్సీ సహకారంతో యాక్సిస్ బ్యాంకు ద్వారా చెల్లింపులు జరిగేవి. అప్పట్లో వారు క్యాష్ హాలిడే పేరుతో కొన్ని రోజులు జాప్యం చేశారు. ప్రస్తుతం వారి కాంట్రాక్టు రద్దు చేసి మణిపాల్ కంపెనీకి కాంట్రాక్టు అప్పగించారు. వారు కొత్తగా ఈసీఎస్పీలను నియమించుకోవాల్సి ఉంది. ఈ ప్రక్రియ ప్రస్తుతం కొనసాగుతోంది. అందుకే చెల్లింపులలో జాప్యం ఏర్పడింది. - చంద్రకాంత్ రెడ్డి, డ్వామా పీడీ