మెదక్, న్యూస్‌లైన్: ఉద్యోగ నోటిఫికేషన్లకు విభజన సెగ తగి లింది. పంచాయతీ ఎన్నికల గండం గడిచిందని సంతోషించిన నిరుద్యోగులకు తెలంగాణ ఏర్పాటు ప్రకటన రావడం.. ఆ తరువాత సమైక్యాంధ్ర ఉద్యమం మొదలు కావడంతో నోటిఫికేషన్లకు బ్రేక్ పడింది. ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం కళ్లల్లో వత్తులు వేసుకొని ఎదురు చూస్తు న్న నిరుద్యోగులకు తాజా పరిణామాలు ఇబ్బందికరంగా మారాయి. కొత్త నోటిఫికేషన్లు విడుదలకు నోచుకోక పోగా, విడుదలైన నోటిఫికేషన్ల పరీక్షల నిర్వహణ కూడా ప్రహాసనంగా మారింది. వేలాది రూపాయలు కుమ్మరిస్తూ కోచింగ్‌ల కోసం పట్నం వెళ్లిన యువకులు తిరిగి పల్లెబాట పడుతున్నారు.
ఈ నియామకాల కోసం...
టెట్, డీఎస్సీ, పంచాయతీ కార్యదర్శులు, గ్రూప్-2 పోస్టులు, పోలీస్ రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్లు విడుదల చేస్తున్నామంటూ గత జూన్ నెలలో ఓ వైపు ఏపీపీఎస్‌సీ, మరోవైపు ప్రభుత్వం ప్రకటనలు గుప్పించింది. దీంతో నిరుద్యోగులు ఆశల పల్లకీలో ఊరేగారు. ఎలాగైనా ఉద్యోగం సంపాదించాలన్న పట్టుదలతో అప్పులు చేసి నగరానికి వెళ్లి కోచింగ్ సెంటర్లలో శిక్షణ పొందారు. ఆగస్టులో డీఎస్సీ నోటిఫికేషన్ వెలువడుతుందని ఆశించిన బీఈడీ, డీఈడీ అభ్యర్థులు తీవ్ర నిరాశకు గురవుతున్నారు. నవంబర్ 9, 10వ తేదీల్లో డీఎస్సీ పరీక్షలు ఉంటాయని ప్రభుత్వం ప్రకటించినా నోటిఫికేషన్ వెలువడక పోవడంతో అభ్యర్థుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. సెప్టెంబర్ ఒకటిన జరగాల్సిన టెట్ పరీక్షలపై కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 2,677 గ్రామ కార్యదర్శి పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేస్తామని ప్రభుత్వం చేసిన ప్రకటనతో చాలామంది నిరుద్యోగులు ఇప్పటికే హైదరాబాద్ వెళ్లి కోచింగ్ తీసుకుంటున్నారు. అదేవిధంగా గ్రూప్-1, గ్రూప్-2, గ్రూప్-4 పరీక్షలకు కూడా యువకులు శిక్షణ పొందుతున్నారు. కొంతమంది ఎస్జీటీలు తమ ఉద్యోగాలకు సెలవు పెట్టి స్కూల్ అసిస్టెంట్ ఇతర గ్రూప్ పోస్టులకు సిద్ధమవుతున్నారు.
జాప్యంతో అవస్థలే...
ఓ వైపు ఆర్థిక భారాన్ని భరిస్తూ కొలువులకు సిద్ధమవుతుంటే మరోవైపు ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల కాకపోవడం వారిని తీవ్ర మానసిక క్షోభకు గురిచేస్తున్నాయి. ఈ క్రమంలో ఉద్యోగ వయో పరిమితి దాటిపోతున్న వారు మరింత ఆందోళన చెందుతున్నారు. రోజు రోజుకు నోటిఫికేషన్లపై ఆశలు ఆవిరవుతుండటంతో చదువులు కూడా సాగడం లేదని వారు నిరాశ నిస్పృహకు లోనవుతున్నారు.
ఉద్యోగ నియామక నోటిఫికేషన్ల జారీలో తీవ్ర జాప్యం
Published Tue, Aug 20 2013 6:44 AM | Last Updated on Sun, Apr 7 2019 4:30 PM
Advertisement
Advertisement