సాక్షి ప్రతినిధి, తిరుపతి : రైతు కూలీలు, రైతుల వలసలకు అడ్డుకట్ట వేయడానికి ప్రవేశపెట్టిన ఉపాధి హామీ పథకం నిధులను టీడీపీ కార్యకర్తలకు దోచిపెట్టి, సంతృప్తిపరిచేందుకు రంగం సిద్ధమైంది. రూ.5 లక్షల్లోపు అంచనా వ్యయం ఉన్న ఉపాధి హామీ పనులను నామినేషన్ పద్ధతిలో టీడీపీ కార్యకర్తలకు కట్టబెట్టేందుకు పావులు కదుపుతున్నారు. ఆ మేరకు కూలీల పొట్టకొట్టడానికి కుట్ర చేస్తున్నారు. దుర్భిక్షం నేపథ్యంలో జిల్లాలో వ్యవసాయం సంక్షోభంలో కూరుకుపోయింది.
గ్రామాల్లో పనుల్లేకపోవడంతో రైతులు, రైతు కూలీలు సుదూర ప్రాంతాలకు వలస వెళ్లేవారు. దీనివల్ల కుటుంబ వ్యవస్థ చిన్నాభిన్నమవుతోంది. ఉన్న ఊళ్లో చేతినిండా పని కల్పించాలన్న లక్ష్యంతో.. ఏడాదికి వంద రోజుల ఉపాధి కోరే హక్కును కల్పిస్తూ కేంద్రం చట్టాన్ని చేసింది. ఆ చట్టం అమల్లో భాగంగా రాష్ట్రంలో 2006లో ఉపాధి హామీ పథకాన్ని అమల్లోకి తెచ్చారు. జిల్లాలో 1380 పంచాయతీల్లో 6.38 లక్షల మందికి ఈ పథకం కింద జాబ్‌కార్డులు జారీచేశారు.
ఏడాదికి వంద రోజులు పని దినాలు కల్పించడం వల్ల వలసలు తగ్గాయి. కానీ.. ఉపాధి హామీ పథకం కింద ఇటీవల పనులు చేపట్టడంలో అధికారుల వైఫల్యం వల్ల వలసలు మళ్లీ ఉధృతమయ్యాయి. ఇప్పుడు ఉపాధి హామీ పథకం నిధులతో టీడీపీ కార్యకర్తలకు పని కల్పించి, సంతృప్తి పరిచేందుకు ప్రణాళిక రచించారు. నామినేషన్‌పై పనులు కాంట్రాక్టర్లకు కట్టబెట్టడాన్ని రద్దు చేస్తూ ఏప్రిల్ 1న గవర్నర్ ఈఎస్‌ఎల్.నరసింహన్ ఉత్తర్వులు జారీచేశారు.
ఆ ఉత్తర్వులను చంద్రబాబు ప్రభుత్వం రద్దు చేసింది. రూ.ఐదు లక్షల్లోపు అంచనా వ్యయం ఉన్న పనులను నామినేషన్‌పై కట్టబెట్టడానికి అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆ ఉత్తర్వులను సాకుగా చూపి అధికారులపై ఒత్తిడి తెచ్చి.. టీడీపీ కార్యకర్తలకు పనులు కట్టబెట్టి, ప్రజాధనాన్ని దోచిపెట్టడానికి ప్రభుత్వం ప్రణాళిక రచించింది. ఇందులో భాగంగా తొలుత ఉపాధి హామీ పథకం లింక్ రోడ్ల పనులపై ప్రభుత్వం కన్ను పడింది.
జిల్లాలో రూ.63.89 కోట్ల వ్యయంతో చేపట్టిన 598 లింక్ రోడ్ల పనులను ఉపాధి హామీ పథకం కింద చేపట్టారు. ఈ పనులను ఆర్నెళ్ల క్రితమే మంజూరు చేశారు. కానీ.. ఇప్పుడు మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి ఒత్తిడి తెచ్చి ఆ పనులను రద్దు చేయిం చారు. ఆ పనులను తాము సూచించిన టీడీపీ కార్యకర్తలకే కేటాయించాలంటూ అధికారులకు హుకుం జారీచేశారు. కూలీలు చేయాల్సిన లింక్ రోడ్డు పనులను నామినేషన్‌పై టీడీపీ కార్యకర్తలకు రేపో మాపో కట్టబెట్టనున్నారు.
రాత్రికి రాత్రే ప్రొక్లెయినర్లతో రోడ్లను వేసి.. కూలీలతో ఆ పనులు చేయించినట్లు రికార్డులు సృష్టించి ప్రజాధనాన్ని టీడీపీ కార్యకర్తలకు దోచిపెట్టడానికి రంగం సిద్ధం చేశారని అధికారవర్గాలే పేర్కొంటుండటం గమనార్హం. ‘ఉపాధి’ నిధులతో గ్రామాల్లో రూ.151 కోట్ల వ్యయంతో 961 సిమెంటు రోడ్ల నిర్మాణానికి పంచాయతీరాజ్‌శాఖ అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఇవి కూడా టీడీపీ కార్యకర్తలకు కట్టబెట్టనున్నారు.
తమ్ముళ్ల ‘ఉపాధి’కి ప్రభుత్వ ప్రణాళిక!
Published Thu, Aug 28 2014 3:10 AM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM
Advertisement
Advertisement