ఉద్యోగశ్రీకి ఆన్‌లైన్ అస్వస్థత | Employment Shri Online application is not registered | Sakshi
Sakshi News home page

ఉద్యోగశ్రీకి ఆన్‌లైన్ అస్వస్థత

Published Thu, Feb 6 2014 3:35 AM | Last Updated on Sat, Sep 2 2017 3:22 AM

Employment Shri Online application is not registered

 పొందూరు, న్యూస్‌లైన్: సంతకవిటి మండలంలో గణిత ఉపాధ్యాయునిగా పని చేస్తున్న పూజారి హరిప్రసన్న(ట్రెజరీ ఐడి 0123396) ఇటీవల ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన హెల్త్ స్కీంలో తన పేరు నమోదుకు ఆన్‌లైన్‌లో ప్రయత్నించారు. ఈ పథకానికి సంబంధించిన ఈహెచ్‌ఎఫ్ వెబ్‌సైట్‌లో ఉన్న దరఖాస్తు నింపి సబ్‌మిట్ చేశారు.  వెబ్‌సైట్ దరఖాస్తును తీసుకోకపోగా.. తెరపై ఒక వింత సమాధానం ప్రత్యక్షమైంది. ‘మీ యొక్క డీడీఓ కోడ్‌లో మీకు నిర్దేశించిన ఉపాధ్యాయుల సంఖ్య పూర్తి అయిందన్నది’ దాని సారాంశం. అది చూసి ఆయన అవాక్కయ్యారు. గత నెల రోజులుగా ఎన్నిసార్లు ప్రయత్నించినా దరఖాస్తు నమోదు కాలేదు. అధికారులెందరిని ఆశ్రయించినా సమస్య పరిష్కారం కాలేదు.
 
 ఇది ఈ ఒక్క ఉపాధ్యాయుడి సమస్య కాదు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు చాలామంది ఇటువంటి సమస్యలతోనే సతమతమవుతున్నారు. ఉద్యోగులు, వారి కుటుంబీకులకు ఆరోగ్య బీమా కల్పించేందుకు ప్రభుత్వం ఉద్యోగశ్రీ పథకం ఇటీవల ప్రవేశపెట్టింది. ఈ పథకంలో చేరి హెల్త్ కార్డులు పొందేందుకు సంబంధిత వెబ్‌సైట్‌కు లాగిన్ అయ్యి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. సరిగ్గా ఇక్కడే ఇబ్బందులు తలెత్తుతున్నాయి. దరఖాస్తు పూర్తి చేసి సబ్‌మిట్ చేసినప్పుడు వింత సందేశాలు దర్శనమిస్తున్నాయి. మీ మండలంలో ఉపాధ్యాయులు, ఉద్యోగులు ఇదివరకే నమోదు చేసుకొన్నారని, మీ డిపార్ట్‌మెంట్‌లో హెల్త్ కార్డుల నమోదు ప్రక్రియ ఇప్పటికే  పూర్తి అయ్యిందని.. ఇలా రకరకాల సందేశాలు వస్తున్నాయి. దీనిపై ఆన్‌లైన్‌లోనే ఫిర్యాదు చేస్తే 15 రోజుల తర్వాత మీ హెచ్‌ఓడీని గానీ, ఎస్టీవోను గానీ కలిసి సమస్య పరిష్కరించుకోవాలని మొబైల్ ఫోన్లకు మెసేజ్‌లు వస్తున్నాయి. 
 
 ఆ ప్రకారం హెచ్‌ఓడీ, ఎస్టీవోల వద్దకు వెళితే.. ఆ సమస్యలతో తమకు సంబంధం లేదని, నెట్‌లోనే దానికి పరిష్కారం వెతుక్కోవాలని చెప్పి తప్పించుకుంటున్నారు. దీంతో ఉద్యోగులు, ఉపాధ్యాయులు దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నారు. తమ సమస్యను ఎవరికి చెప్పుకోవాలో అర్థం కావడంలేదని వాపోతున్నారు. మరోవైపు ఆరోగ్య కార్డులకు త్వరగా నమోదు చేసుకోవాలని కలెక్టర్‌తోపాటు ఉన్నతాధికారులు సూచిస్తున్నారు. కాగా అష్టకష్టాలు పడి ఎలాగోలా ఆన్‌లైన్ దరఖాస్తు చేసుకున్నవారిలో చాలామందికి ఇప్పటికీ హెల్త్ కార్డులు అందలేదు. కొందరికి తాత్కాలిక కార్డులు జారీ చేశారు. ఇటువంటి సమస్యలను పరిష్కరించకుండా దరఖాస్తుకు గడువు విధించడం సబబు కాదని, ముందు ఆన్‌లైన్ సమస్యలు పరిష్కరించాలని టీచర్లు, ఉద్యోగులు కోరుతున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement