- ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టులకు సర్కారు ఎసరు
- మలి విడతలో మేస్త్రీల తొలగింపు
- రోడ్డున పడనున్న కుటుంబాలు
విజయవాడ సిటీ : ‘జాబు కావాలంటే బాబు రావాలి’ నినాదాన్ని అందిపుచ్చుకున్న టీడీపీ నేతలు ఎన్నికల్లో బాగానే ఓట్లు దండుకున్నారు. కొత్త కొలువుల సంగతి అటుంచితే.. ఉన్న ఉద్యోగాలను ఊడగొట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళిక అమలుచేస్తోంది. గ్రామస్థాయిలో చిరుద్యోగులుగా జీవనం సాగిస్తున్న వేలాదిమంది ఉపాధి హామీ పథకం ఫీల్డ్ అసిస్టెంట్లను రెండు, మూడు రోజుల్లో తొలగించనున్నారు.
అందరినీ ఒకేసారి తీసేస్తే ప్రజల్లో అలజడి వస్తుందనే భయంతో సర్కారు వారిపై రకరకాల అభియోగాలు మోపి దశలవారీగా తొలగించాలంటూ జిల్లా అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. కొత్త విధానం ద్వారా ‘ఉపాధి హామీ’ని అమలుచేసి 2005 నుంచి పనిచేస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్లు, సీనియర్ మేస్త్రీలను తొలగించనున్నారు.
కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ఉపాధి హామీ పథకంలో రెండు, మూడు గ్రామాలకు కనీసం ఒక ఫీల్డ్ అసిస్టెంటు, ఒక మేస్త్రీ చొప్పున పనిచేస్తున్నారు. పెద్ద గ్రామాల్లో ఇద్దరు ఫీల్డ్ అసిస్టెంట్లు, ఇద్దరు మేస్త్రీలు పనిచేస్తున్నారు. ఫీల్డ్ అసిస్టెంట్‌కు నెలకు రూ. ఆరు వేలు, సీనియర్ మేస్త్రీలకు రూ. మూడు వేలు ఇస్తారు. వేతనంతోపాటు వారికి కూలీల పనిదినాలు టార్గెట్‌గా ఇస్తారు. గ్రామీణ ప్రాంతాల్లో కూలీలకు ఉపాధి కల్పించడంతోపాటు చెరువులు, కాలువలకు మరమ్మతులు చేయిస్తున్నారు.
జిల్లాలో 530 మంది తొలగింపు ..
జిల్లావ్యాప్తంగా 852 మంది ఫీల్డ్ అసిస్టెంట్లు ఉన్నారు. వీరిలో దాదాపు 530 మందిని రెండు, మూడు రోజుల్లో తొలగించనున్నారు. ఇందుకు సంబంధించి ఉత్తర్వులు కూడా సిద్ధమైనట్లు సమాచారం. సోషల్ ఆడిట్‌లో అవకతవకలకు పాల్పడినవారిని, పనితీరు బాగోలేదంటూ మరికొందరిని, 75 శాతం పనులు పూర్తిచేయించడంలో విఫలమైనట్లు ఇంకొందరిపై అభియోగాలు మోపుతూ తొలగింపు ఉత్తర్వులు జారీ చేస్తారు. తొలి దశలో ఫీల్డ్ అసిస్టెంట్లను తొలగించి ఆ తర్వాత సీనియర్ మేస్త్రీలను కూడా తొలగించనున్నట్లు తెలిసింది. ఈ సమాచారం తెలియడంతో ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న వారి కుటుంబాల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.