ఆర్టీసీ కార్మికులకు మధ్యంతర భృతి (ఐఆర్) సాధించుకునే విషయంలో ఆర్టీసీ గుర్తింపు సంఘం ఈయూ-టీఎంయూల కూటమి చీకటి ఒప్పందం చేసుకుందని ఎన్‌ఎంయూ సహా పలు సంఘాలు ఆరోపించాయి.
ఎన్‌ఎంయూ సహా ఇతర సంఘాల మండిపాటు
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ కార్మికులకు మధ్యంతర భృతి (ఐఆర్) సాధించుకునే విషయంలో ఆర్టీసీ గుర్తింపు సంఘం ఈయూ-టీఎంయూల కూటమి చీకటి ఒప్పందం చేసుకుందని ఎన్‌ఎంయూ సహా పలు సంఘాలు ఆరోపించాయి. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా ఐఆర్, వేతన సవరణ సాధిస్తామని గుర్తింపు సంఘం ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీని తుంగలో తొక్కిందని పేర్కొన్నాయి. తక్కువ ఐఆర్‌కు ఒప్పుకోవటం ద్వారా కార్మికులకు అన్యాయం చేసిందని.. ఎన్‌ఎంయూ, స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్, కార్మిక సంఘ్, కార్మిక పరిషత్, వైఎస్‌ఆర్ ఆర్టీసీ మజ్దూర్ యూనియన్, కాంట్రాక్టు డ్రైవర్స్ అండ్ కండక్టర్స్ యూనియన్‌లు విమర్శించాయి.
10 మాసాల వేతన సవరణ బకాయిలను కార్మికులు నష్టపోవాల్సి వచ్చిందని ఎన్‌ఎంయూ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు నాగేశ్వరరావు, మహమూద్ ఆరోపిం చారు. 24,577 కాంట్రాక్టు కార్మికులందరినీ ఒకే దఫాగా రెగ్యులర్ ఉద్యోగులుగా క్రమబద్ధీకరించడంలోనూ గుర్తింపు సంఘం విఫలమైందన్నారు. కాగా, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమంగా (27 శాతం) ఐఆర్ సాధించటం తమ విజయమేనని, ఇదే ఊపుతో వేతన సవరణ కూడా చేయిస్తామని గుర్తింపు సంఘం ఈయూ- టీఎంయూ కూటమి ప్రకటించింది.