
ఉపాధి పనులు వద్ద కూలీలు
కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీని పేదల కడుపు నింపేందుకు పెట్టింది. పని లేని పేదకు పని కల్పించడం.. కనీస వేతనం ఇవ్వడం.. వాళ్ల ఆకలి తీర్చడమే ధ్యేయంగా ఉపాధిని హామీగా పేర్కొంటూ దానికి చట్టబద్ధత కల్పించింది. కానీ ప్రస్తుతం రాష్ట్రంలో ఆ పరిస్థితి కనిపించడం లేదు. పని చేసినా వారికి కష్టార్జితం లభించడం లేదు. దీంతో ఆకలి బా«ధలు తీరక వలస పోతున్నారు. కేంద్రం అందించిన నిధులను ఇతర పనులకు మళ్లించడంతోనే ఇలాంటి పరిస్థితి వచ్చింది. దీన్ని కప్పేట్టేందుకు నానా ఆగచాట్లు పడుతుంది. దీనిపై సిబ్బంది అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
వైఎస్‌ఆర్ జిల్లా , బద్వేలు: జిల్లాలో ప్రస్తుతం ఉపాధి పనులకు వెళ్లేందుకు పేదలు ఆసక్తి చూపడం లేదు.నాలుగు నెలలుగా కూలి చేసిన పనులకు సబంధించిన బకాయిలు అందకపోవడంతో వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలో 5.50లక్షల మంది కూలీలు ఉన్నారు. కరువు పరిస్థితుల నేపథ్యంలో గత వేసవి నుంచి ఉపాధి పనులు జోరుగా సాగాయి. ఏప్రిల్ వరకు వేతనాలు అందినా మే నుంచి రావడం లేదు. గత జూన్ నాటికి బకాయిలు రూ.27 కోట్లు ఉండగా ప్రస్తుతం అవి రూ.44 కోట్లకు చేరాయి. ఉపాధి నిధులను ఇతర పనులకు వినియోగించడంతోనే కేంద్రం నిధులు నిలిపేసిందని అధికారులు చెబుతున్నారు.
నీరు–చెట్టుకు మళ్లింపు
ఉపాధి కూలీల వేతనానికి వినియోగించాల్సిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం టీడీపీ కార్యకర్తల లబ్ధికి చేపట్టిన నీరు–చెట్టుకు మళ్లించినట్లు సిబ్బంది చెబుతున్నారు. సాధారణంగా కూలీల వేతనానికి 60 శాతం, మెటీరియల్‌కు 40 శాతం నిధులను ఉపయోగించాలి. జిల్లాలో ప్రస్తుతం కూలీల వేతనానికి 40 శాతం, 60 శాతాన్ని మెటీరియల్‌కు వినియోగించారు. ప్రస్తుతం జిల్లాలో 3173 పనులు పూర్తికాగా ఇందుకుగాను రూ.280.90 కోట్లను ఖర్చుచేశారు. ఇందులో ఉపాధి కూలీల వేతనానికి వినియోగించాల్సిన నిధులు వాడటంతో కేంద్రం నిధులను నిలిపేసి ఇప్పటి వరకు ఖర్చు చేసిన నిధుల వివరాలను తెలపాలని ఆదేశించింది.దీంతో పాటు పలు జిల్లాలో తనిఖీలు మొదలు పెట్టింది. ఇదంతా పూర్తయ్యేప్పటికి మరో 20 రోజులు పట్టే అవకాశం ఉంది. అప్పటి వరకు కూలీల వేతనం అందడం కష్టమే. నెలన్నర కిందట రూ.500 కోట్లు వస్తున్నాయని అధికారులు ప్రకటించినా చివరకు విడుదల చేసింది కేవలం రూ.100 కోట్లు మాత్రమే. ఇది ఏ మూలకు సరిపోలేదు. జిల్లాలకు కనీసం రూ.10 కోట్లు కూడా రాలేదని సిబ్బంది తెలిపారు.
ఇబ్బందులు పడుతున్న సిబ్బంది
కూలీల వేతనాలు అందకపోవడాన్ని ప్రభుత్వం రికార్డుల నమోదు, వైఎస్సార్‌సీపీ ఎంపీల ఫిర్యాదు అంటూ కుంటిసాకులు చెబుతోంది. ఇప్పటి వరకు 20 అంశాలతో పని వివరాలను నమోదు చేసి తయారు చేయాలని అధికారులు కోరారు. కానీ దీనిపై నెల రోజుల నుంచి నాన్చుతూ త్వరగా అన్ని రికార్డులు తయారు చేసి కార్యాలయంలో అందించాలని ఆదేశించారు. నెల కిందట కేంద్ర అధికారులు వస్తారని దసరా సెలవుల్లో కూడా విధులు నిర్వహించారు. తాజా ఆదేశాలతో ఆదివారంతో పాటు రాత్రుళ్లు కూడా కార్యాలయాల్లోనే ఉండి రికార్డులు తయారు చేస్తున్నారు. ఉన్నతాధికారుల ఒత్తిడి పెరుగుతుండటంతో వారు మానసిక వేదన చెందుతున్నారు. ఈ వివరాలన్ని అన్‌లైన్‌లో ఉన్నా మళ్లీ రికార్డుల తయారీ ఏమిటని ప్రశ్నిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment