- కంపెనీలకు కేటాయించిన భూములపై ఏపీఐఐసీ ఆరా
- నిరుపయోగంగా ఉంటే స్వాధీనం చేసుకోవాలని నిర్ణయం
- 65 ఎకరాల భూ కేటాయింపు రద్దుకు యోచన
సాక్షి, విశాఖపట్నం: పరిశ్రమల అవసరాల కోసం భూములు తీసుకుని ఆ తర్వాత వాటిలో కంపెనీలు స్థాపించని యాజమాన్యాలపై ఏపీఐఐసీ కన్నెర్ర చేస్తోంది. ఇన్నాళ్లూ కేవలం ప్రేక్షకపాత్ర వహించి, మొక్కుబడి నోటీసులతో కాలక్షేపం చేయగా, ఇప్పుడు విభజన తర్వాత భూ అవసరాలు పెరగడంతో తప్పనిసరి పరిస్థితుల్లో కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించింది. జిల్లాలో పరిశ్రమల స్థాపన కోసం గతంలో భూములు తీసుకుని వినియోగించని కంపెనీల వివరాలు సేకరించింది. త్వరలో వీటన్నింటిని రద్దు చేయాలని భావిస్తోంది.
ఇటీవల సర్వే చేసి జిల్లా అంతటా ఎస్‌ఈజెడ్‌లకు కేటాయించినవి కాకుండా రూ.50 కోట్లకుపైగానే విలువచేసే 65 ఎకరాల భూములున్నట్టు నిర్ధారించింది. ఆటోనగర్, పరవాడ, అనకాపల్లి ఇతర పారిశ్రామిక క్లస్టర్లలో చాలావరకు ఇవి నిరుపయోగంగా ఉండడంతో వాటన్నింటిని ఇప్పుడు వెనక్కి తీసుకోవాలని పట్టుదలతో ఉంది. అందుకోసం ప్రత్యేక బృందాలతో ఖాళీ భూములున్న కంపెనీలు, యాజమాన్యాలకు నోటీసులు పంపి రానున్న నెలలోగా వీటిని స్వాధీనం చేసుకోవాలని నిర్ణయించింది.
ఇకపై కఠినంగా వ్యవహరించి నిర్ధారిత గడువులోగా యూనిట్లు ప్రారంభించడం, లేదా తక్షణమే వెనక్కి తీసుకునేందుకు కసరత్తు చేస్తోంది. మరోపక్క పారిశ్రామికపరంగా కీలకమైన విశాఖలో ఏపీఐఐసీకి భూ బ్యాంక్ పెద్దగా లేకపోవడం అధికారులకు సవాల్‌గా మారింది. పెద్ద కంపెనీలు విశాఖకు వచ్చి భూములు కోరినా తక్షణమే కేటాయింపులు చేయడానికి తగిన స్థలాలు లేవు. ప్రస్తుతం కేవలం 450 ఎకరాలు మాత్రమే అక్కడక్కడా ఎస్‌ఈజెడ్‌లు, ఇతర పారిశ్రామిక క్లస్టర్లలో ఉన్నాయి.
ఈ నేపథ్యంలో జిల్లాకు అదనంగా 500 ఎకరాలు భవిష్యత్తు అవసరాలకు కావాలని అధికారులు భావిస్తున్నారు. ఈ మేరకు గతంలో కలెక్టర్‌కు లేఖ రాశారు. రెవెన్యూశాఖ ద్వారా సేకరించి అప్పగించాలని అందులో పేర్కొన్నారు. కానీ ఇప్పుడు విభజన తర్వాత రకరకాల పర్రిశ్రమలు, విద్యాసంస్థలకు వీటి అవసరం ఉండడంతో సాధ్యమైనంత వేగంగా ఎక్కువ ల్యాండ్ బ్యాంక్‌ను సిద్ధం చేసేందుకు ఏపీఐఐసీ ప్రణాళికలు వేస్తోంది.