ఆక్రమణకు ప్రయత్నించిన ప్రభుత్వభూమి ఇదే..
పోరుమామిళ్ల : రాత్రికి రాత్రి ప్రభుత్వభూమి ఆక్రమించుకునేందుకు చేసిన ప్రయత్నాలు బెడిసికొట్టాయి.రెవెన్యూ అధికారుల ఉదాసీన, నిర్లక్ష వైఖరి వల్ల కోట్ల రూపాయల విలువ చేసే ప్రభుత్వభూములు అన్యాక్రాంతమవుతున్నాయి. రెండు దశాబ్దాల కాలంగా నిరాటంకంగా జరుగుతున్న కబ్జాలను అరికట్టే చర్యలు జరగలేదు. అధికారులు రెవెన్యూచట్టాలను ఉపయోగించి, కఠినచర్యలు తీసుకోకపోవడం అక్రమణదారులకు వరంగా మారింది. కబ్జాదారులు బోగస్‌పత్రాలు సృష్టించి, కార్యాలయ సిబ్బంది సహకారంతో రికార్డుల్లో నమోదు చేయించడం, అడ్డుకుంటే కోర్టు మెట్లెక్కడం పరిపాటిగా మారింది. మండల కార్యాలయానికి కూత వేటు దూరంలో ఉన్న ప్రభుత్వభూములపై చాలాకాలంగా కబ్జాదారులు కన్ను వేశారు.
వాటిని స్వాధీనం చేసుకుంటే కోట్ల రూపాయలు సునాయాసంగా జేబులో పడతాయన్న దురాశతో అధికారులను, నాయకులను ప్రసన్నం చేసుకునేందుకు సకల ప్రయత్నాలు చేస్తున్నారు. కొంతమంది ఈ విషయంలో సఫలీకృతులయ్యారు.ఈ నేపథ్యంలో సర్వేనెంబరు 1008, 1009లో ఆదివారం రాత్రి డోజర్‌తో చదును చేసి, అందులో నిర్మాణాలు చేపడితే కోట్లరూపాయల భూమి సొంతమవుతుందని కొందరు భావించారు. ఆ మేరకు ప్రయత్నాలు జరుగుతుండగా గమనించినవారు తహసీల్దారుకు సమాచారం ఇచ్చారు. వెంటనే ఆయన వీఆర్వోను అలర్ట్ చేయడంతో వారు ప్రయత్నాలు ఆపి పరారైనట్లు తెలిసింది. ఈ స్థలం ఏడెమిదేళ్లుగా వివాదంగా ఉంది. ఆ సర్వేనెంబరులో రంగసముద్రం సచివాలయం నిర్మించారు.
ప్రభుత్వస్థలంలో భవనం నిర్మిస్తే, కొంతమంది ఆస్థలం స్వాధీనం చేసుకునే ప్రయత్నంలో భాగంగా బోగస్ పత్రాలు సృష్టించినట్లు అప్పట్లో ఆరోపణలు వచ్చాయి. బోగస్ పత్రాల సహకారంతో కోర్టుకు పోవడం, సచివాలయం నిరుపయోగంగా మారడం జరిగింది. ఏడేళ్లుగా ఈ స్థలాన్ని ప్రభుత్వభూమిగా స్పష్టం చేయడం అధికారులకు సాధ్యం కాలేదంటే రెవెన్యూశాఖ పనితీరు గురించి అర్థం చేసుకోవచ్చు. పోరుమామిళ్ల–మైదుకూరు ప్రధాన రహదారిలో ఉన్నందున ఆ భూమి విలువ రూ. 5 కోట్లు ఉండవచ్చని తెలుస్తోంది. కబ్జాకు ప్రయత్నం చేసినవారిపై కేసు పెడతామని అధికారులు తెలిపారు. సోమవారం బంద్ దృష్ట్యా సిబ్బంది రాలేదని, మంగళవారం పూర్తి వివరాలతో కేసు పెడతామన్నారు. ఆక్రమణకు ప్రయత్నించిన వారి వివరాల గురించి ప్రశ్నించగా విచారిస్తున్నామని, రేపు చెబుతామన్నారు.
చర్యలు తీసుకుంటాం:
తహసీల్దార్ చంద్రశేఖరవర్మ
సర్వేనెంబరు 1008, 1009లో జరిగిన ఆక్రమణ గురించి తహసీల్దారు చంద్రశేఖరవర్మ, వీఆర్‌ఓ సదానందంలను వివరణ కోరగా దుండగుల గురించి విచారిస్తున్నామన్నారు. భూమి చదును చేసేందుకు ఉపయోగించిన యంత్రం (డోజర్/ జేసీబీ) స్వాధీనం చేసుకుంటామన్నారు. దాదాపు ఎకరన్నర భూమి చదును చేశారన్నారు. ఆ భూమిపై కోర్టులో ‘డబ్ల్యూఎపి 4755/2011, 4788/2011’ నంబర్లతో కేసు నడుస్తోందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment