సాక్షి, రంగారెడ్డి జిల్లా : పోలీసు శాఖ నిర్లక్ష్యం, రెవెన్యూ శాఖ మెతక వైఖరి కారణంగా శంకర్‌పల్లి మండలంలో అక్రమార్కుల ఆగడాలకు అడ్డూఅదుపులేకుండా పోయింది. ప్రభుత్వ భూముల్లో దర్జాగా పాగావేస్తున్న ఆక్రమణదారులు.. చర్యలకు వచ్చిన అధికారులపై ఏకంగా ఎదురుదాడికి దిగుతున్నారు. ఈ పరిస్థితిపై రెవెన్యూ అధికారులు ఫిర్యాదు చేసినప్పటికీ పోలీసులు పట్టనట్లు వ్యవహరించడంతో మండల పరిధిలో ఇలాంటి ఆక్రమణలు రోజుకొకటి పుట్టుకొస్తున్నాయి. గత వారం మండలంలోని దొంతన్‌పల్లి గ్రామం సర్వేనంబర్ 197లోని ఎకరా ప్రభుత్వ భూమిని స్థానికుడు ఆక్రమించి వరిపంట సాగుచేశాడు. దీంతో రెవెన్యూ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి ప్రభుత్వ భూమిగా నిర్ధారించిన అనంతరం భూమిని తమ ఆధీనంలోకి తీసుకునే ప్రయత్నం చేయగా.. సదరు ఆక్రమణదారుడి సంబంధీకులు రెవెన్యూ అధికారిపై దాడికి పాల్పడ్డారు. అయితే ఈ విషయాన్ని పోలీసులకు ఫిర్యాదు చే యగా.. మూడు రోజుల తర్వాత కేసు నమోదు చేసినప్పటికీ దర్యాప్తులో తీవ్రజాప్యం చేయడం గమనార్హం.
ఇదేమి సమన్వయం..!
రాజధానికి అత్యంత చేరువలో శంకర్‌పల్లి మండలం ఉండడం, భూముల విలువ ఆకాశాన్నంటుతున్న తరుణంలో ఆక్రమణలు కూడా పెద్దఎత్తున జరుగుతున్నాయి. అయితే ఈ ఆక్రమణలు రెవెన్యూ అధికారుల దృష్టికి రావడం.. వాటిపై చర్యలకు దిగుతున్నప్పటికీ ఎదురుదాడి జరగడంతో చర్యల్లో ఎలాంటి పురోగతి కనిపించడంలేదు. ఈ పరిస్థితిని అదనుగా చేసుకుని మరోవైపు ఆక్రమణల పరంపర జోరుగా సాగుతోంది.
మచ్చుకు కొన్ని ఉదాహరణలు
ఎల్వర్తి గ్రామంలో సర్వే నంబర్ 160లో అదేగ్రామానికి చెందిన ఓ వ్యక్తి రెండున్నర ఎకరాల ప్రభుత్వ భూమిని ఆక్రమించి మొక్కజొన్న వేశాడు. అయితే ఆక్రమణపై స్థానిక అధికారులు చర్యలకు ఉపక్రమించగా స్థానికులతో కలిసి పెద్ద రాద్దాంతం చేయడంతో అధికారులు వెనక్కితగ్గారు.
సింగాపూర్ గ్రామంలో సర్వేనంబర్ 249లో సీలింగ్ భూమిలో అక్రమంగా నిర్మాణాలు చేపట్టారు. అయితే ఈ నిర్మాణాలను కూల్చివేసేందుకు అధికారులు ప్రయత్నించగా స్థానిక నేత రంగంలోకి దిగి ఉన్నత స్థాయి నుంచి ఒత్తిడి తేవడంతో రెవెన్యూ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకుండా తిరుగుముఖం పట్టారు.
సింగాపూర్ గ్రామంలోని ఓ వాగులో స్థానికుడొకరు ఆక్రమణ చేశాడు. వాగు నీటిని అక్రమంగా తన పొలం వైపు మళ్లించేందుకు పెద్దఎత్తున మట్టితో పూడ్చివేశాడు. ఈ అంశంపై రెవెన్యూ అధికారులు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినప్పటికీ చర్యలు మాత్రం శూన్యం.
{పొద్దుటూరులో అక్రమంగా ఇసుక తరలింపు విషయంలో రెవెన్యూ అధికారులు ఫిర్యాదు చేసినప్పటికీ చర్యలు తీసుకున్న దాఖలాల్లేవు. అదేవిధంగా ఈ గ్రామంలో రెండు వెంచర్లపైనా కేసులు నమోదు చేసినప్పటికీ ఫలితం లేదు.
శంకర్‌పల్లిలోని 196 సర్వే నంబర్‌లో అక్రమ వెంచర్‌పై చర్యలకు రెవెన్యూ అధికారులు ఉపక్రమించారు. అయితే వెంచర్ యాజమాన్యం రెవెన్యూ అధికారులపై ఎదురుదాడికి దిగడంతో చర్యలు నిలిపేశారు. ఈ విషయంలోనూ పోలీసులు మెతకవైఖరి అవలంబిస్తున్నారని స్థానిక అధికారులు పేర్కొంటున్నారు.
పై అధికారుల వద్దకు పంచాయితీ..
మండలంలో అక్రమార్కుల ఆగడాలపై రెండ్రోజుల క్రితం కలెక్టర్ బి.శ్రీధర్‌కు స్థానికులు ఫిర్యాదు చేశారు. మరోవైపు రెవెన్యూ అధికారులు కూడా పరిస్థితిని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినట్టు చెబుతున్నారు. రెవెన్యూ సిబ్బందిపై దాడులు, కే సు నమోదులో జరుగుతున్న జాప్యంపై కలెక్టర్‌కు లిఖితపూర్వకంగా వివరించినట్లు మండల తహసీల్దార్ వసంతకుమారి ‘సాక్షి’తో పేర్కొన్నారు.
సమన్వయ లోపం.. కబ్జాల రాజ్యం!
Published Thu, Sep 12 2013 12:29 AM | Last Updated on Wed, Mar 28 2018 10:56 AM
Advertisement
Advertisement