
ఫలితాల్లో ‘ట్ర’బుల్ ఐటీ
= ఇంజినీరింగ్ ప్రథమ సంవత్సరంలో ఉత్తీర్ణత 55 శాతమే
= మెకానిక్స్‌లోనే ఎక్కువ మంది ఫెయిల్
నూజివీడు ట్రిపుల్ ఐటీ కళాశాల ప్రతిష్ట రానురాను మసకబారుతోంది. పదో తరగతిలో మండలస్థాయిలో ప్రథమస్థానాల్లో నిలిచిన విద్యార్థులను ఎంపికచేసి, వారిని 24 గంటలు తమ దగ్గరే ఉంచుకుని, వారికి ఐఐటీలో ప్రతిభ కనబరిచిన వారిని ప్రొఫెసర్లుగా నియమించి విద్యాబోధన చేస్తున్నప్పటికీ ఫలితాలు మాత్రం సాధారణ ఇంజినీరింగు కళాశాలల కంటే దారుణంగా ఉంటున్నాయి.
నూజివీడు, న్యూస్‌లైన్ : స్థానిక ట్రిపుల్ ఐటీలో గత నెలలో నిర్వహించిన తొలిసెమిస్టర్ ఫలితాల్లో ఇంజినీరింగ్ ప్రథమ సంవత్సర ఫలితాలు ఘోరంగా ఉన్నాయి. ఉత్తీర్ణత శాతం 55 శాతంగా మాత్రమే. 970 మంది ఇంజినీరింగు ప్రథమ సంవత్సర విద్యార్థులు నవంబర్‌లో నిర్వహించిన సెమిస్టర్ పరీక్షలు రాశారు. వారిలో 536 మంది మాత్రమే ఉత్తీర్ణులయ్యారు. 434 మంది ఫెయిలయ్యారు. అత్యధికంగా మెకానిక్స్ సబ్జెక్టులో 195 మంది విద్యార్థులు తప్పారు. ఆ తరువాత స్థానాల్లో ఎలక్ట్రికల్ టెక్నాలజీలో 116 మంది, గణితంలో 118 మంది ఫెయిల య్యారు. ఇంత దారుణ ఫలితాలు ట్రిపుల్ ఐటీ ఏర్పాటు చేసిన ఏడు సంవత్సరాల్లో ఎప్పుడూ ఎదురవలేదు.
పీయూసీదీ అదే పరిస్థితి
పీయూసీ-1 ఫలితాలు కూడా ఆశాజనకంగా లేవు. 986 మంది విద్యార్థులు ప్రథమ సెమిస్టర్ పరీక్షలు రాయగా 759 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. ఉత్తీర్ణత శాతం 77. ఫెయిలైన 227మందిలో ఒక సబ్జెక్టు తప్పిన విద్యార్థులు 144 మంది, రెండు సబ్జెక్టులు తప్పినవారు 60 మంది, మూడు సబ్జెక్టులు తప్పిన వారు 23 మంది. పీయూసీ-2 తప్పిన వారందరికీ ఈ నెలాఖరులో రెమీడియల్ పరీక్షలు నిర్వహించనున్నారు.
లోపం ఎక్కడ..!
దేశంలోని ఐఐటీల్లో చదివిన వారిని ట్రిపుల్ ఐటీలో విద్యార్థులకు పాఠాలు బోధించడానికి నియమించారు. నూజివీడు ట్రిపుల్ ఐటీలో చదువుకుంటున్న విద్యార్థులందరూ పదో తరగతిలో 530 మార్కుల కంటే ఎక్కువ సాధించి, మండలస్థాయిలో తొలి మూడు స్థానాల్లో నిలిచిన వారే. అయినప్పటికీ ఇంజినీరింగు ప్రథమ సంవత్సరంలో కేవలం 55 శాతం ఫలితాలు మాత్రమే రావడం విస్మయాన్ని కలిగిస్తోంది. నాలుగేళ్లుగా ఇంజినీరింగు ప్రథమ సంవత్సరానికి సంబంధించి ఇంజినీరింగు మెకానిక్స్, ఎల క్ట్రికల్ టెక్నాలజీ సబ్జెక్టుల్లోనే ఎక్కువ మంది ఫెయిలవుతున్నారు. ఇలా ఎందుకు జరుగుతుందో గుర్తించి, సరిచేయకపోవడం వల్లే ఏటా ఈ సబ్జెక్టు విద్యార్థులకు గండంగా మారింది. అలాగే ఇతర రాష్ట్రాలకు చెందిన లెక్చరర్ల బోధన కూడా సరిగా ఉండక, వారు చెప్పేది అర్థంకాక తప్పుతున్నామని విద్యార్థులు పేర్కొంటున్నారు.
కొంత మంది ఫ్యాకల్టీలు, లెక్చరర్లు రెగ్యులర్‌గా క్లాసులకు హాజరుకావడంలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇకనుంచైనా ఎక్కడ లోపాలు ఉన్నాయో గుర్తించి, వాటిపై శ్రద్ధ తీసుకుంటనే మెరుగైన ఫలితాలు సాధ్యమవుతాయి. లేకుంటే ట్రిపుల్ ఐటీల ప్రతిష్ట మసకబారడం ఖాయమన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది.
సంబంధంలేని సబ్జెక్టులే కారణం
ట్రిపుల్ ఐటీలో బోధిస్తున్న సబ్జెక్టులు ఇప్పటి వరకు విద్యార్థులకు సంబంధం లేనివే. ఈ కారణంగానే ఎక్కువ మంది ఉత్తీర్ణులు కాలేకపోతున్నారు. అయినా వీరికి త్వరలోనే రెమీడియల్స్ (సప్లిమెంటరీ) పరీక్షలు నిర్వహిస్తున్నాం.
- ఇబ్రహీంఖాన్, ట్రిపుల ఐటీ డెరైక్టర్