ఇంజినీరింగ్ వెబ్ కౌన్సెలింగ్ సీట్ల కేటాయింపు
Published Wed, Sep 18 2013 3:35 AM | Last Updated on Thu, Jul 11 2019 6:33 PM
ఎచ్చెర్ల క్యాంపస్, న్యూస్‌లైన్: ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలు జిల్లాలోని కళాశాలల యాజమాన్యాలకు నిరాశనే మిగి ల్చాయి. రాష్ట్ర ఉన్నత విద్యామండలి మంగళవారం సాయంత్రం ప్రకటించిన ఇంజినీరింగ్ అడ్మిషన్ల వివరాల ప్రకారం జిల్లా కళాశాలల్లో 51 శాతం సీట్లే నిండాయి. జిల్లాలో 10 ఇంజినీరింగ్ కళాశాలలు ఉండగా నందిగాంలోని శివరామకృష్ణ ఇంజినీరింగ్ కళాశాల కౌన్సెలింగ్ నుంచి తప్పుకొంది. మిగిలిన తొమ్మిది కళాశాలల్లో కన్వీనర్ కోటా కింద 3132 సీట్లు ఉండగా 1599 సీట్లు మాత్రమే భర్తీ అయ్యాయి.
రాజాం జీఎంఆర్ ఐటీలో మాత్రమే శతశాతం ప్రవేశాలు జరిగాయి. టెక్కలికి చెందిన ఆదిత్యా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ రెండో స్థానంలో నిలిచింది. మిగిలిన ఏ కళాశాలలోనూ ప్రవేశాలు ఆశాజనకంగా లేవు. జిల్లాలో అధిక ఫీజు స్ట్రక్చర్ ఉన్న(రూ.80,400 ) జీఎంఆర్ ఐటీ, ఐతం(రూ.68 వేలు) కళాశాలల్లోనే ఎక్కువ సీట్లు భర్తీ కావ డం విశేషం. కామన్ ఫీజుతో సీట్లు నిండుతాయన్న ఆశతో ఉన్న కళాశాలలకు నిరాశే మిగిలింది. గత ఏడాది అడ్మిషన్లు పరిశీలిస్తే 3628 సీట్లుకు గాను 1605 సీట్లు(44.23 శాతం) నిండాయి.
ఆ లెక్కన చూస్తే ఈ ఏడాది కొద్దిగా మెరుగుపడినట్లే. గత ఏడాది రెండు కళాశాలలు జీరో అడ్మిషన్లతో సరిపెట్టుకోగా, ఈ ఏడాది ఒక కళాశాల ఒక్క సీటుతోనే సరిపెట్టుకుంది. గత ఏడాది మిత్రా కళాశాలగా ఉన్న కళాశాలే ఈ ఏడాది కొత్త యాజమాన్యంలో భాస్కర కళాశాలగా మారింది. గత ఏడాది కూడా జీఎంఆర్‌లోనే శత శాతం అడ్మిషన్లు జరిగాయి. ఐతంలో 95 శాతం అడ్మిషన్లు జరిగాయి. వెబ్ కౌన్సెలింగ్ సహాయ కేంద్రానికి ఈ ఏడాది ధ్రువపత్రాల పరిశీలనకు 3910 మంది హాజరైనా సమైక్యాంధ్ర ఉద్యమం కారణంగా వారిలో విజయనగరం, విశాఖపట్నం జిల్లాల విద్యార్థులే ఎక్కువగా ఉన్నారు. అడ్మిషన్లపైనా ఆ ప్రభావం పడింది.
కళాశాలల అడ్మిషన్ల వివరాలు
కళాశాల= సీట్లు= నిండినవి
జీఎంఆర్ ఐటీ, రాజాం= 588= 588
ఐతం, టెక్కలి= 588= 522
శ్రీ శివానీ, చిలకపాలెం= 378= 172
శ్రీశివానీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, చిలకపాలెం= 378= 123
శ్రీ వెంకటేశ్వర, ఎచ్చెర్ల= 252= 77
శిస్టమ్, అంపోలు =252= 73
వైష్ణవి, సింగుపురం= 210= 25
ప్రజ్ఞ, పలాస =252= 18
భాస్కర, చినరావుపల్లి =294 =01
Advertisement
Advertisement