తణుకు ఏరియా ఆస్పత్రిలో వైద్య మిత్రల క్యాబిన్
తణుకు అర్బన్ :ఎన్టీఆర్ ఆరోగ్య సేవలో పనిచేస్తున్న (గతంలో ఆరోగ్యశ్రీ పథకం) వైద్యమిత్రలను తొలగించి పంతం నిలబెట్టుకునేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. ప్రభుత్వ కుట్రలో భాగంగా ఎక్కడా లేనివిధంగా నిబంధనలు వారిపై రుద్దుతున్నారు. వైద్యమిత్రలకు పరీక్ష నిర్వహించి నూటికి 75 మార్కులు వచ్చిన వారిని కొనసాగిస్తామని ఆదేశాలు జారీ చేసింది ప్రస్తుత టీడీపీ ప్రభుత్వం. 2008లో దివంగత ముఖ్యమంత్రి రూపొందించిన ఆరోగ్యశ్రీ పథకంలో పనిచేసేందుకు అప్పట్లో జిల్లాలో 160 మందిని వైద్య మిత్రలుగా నియమించారు.
2014లో అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం 2015లో జీఓ 28ని తీసుకువచ్చి వైద్యమిత్రలను తొలగించి వారి స్థానంలో కొత్తవారిని నియమించాలని అప్పట్లో ఆదేశాలు జారీ చేసింది. దీనిని వ్యతిరేకించిన మిత్రలు ఆ జీవోను రద్దుచేయాలని కోరుతూ ధర్నాలు, నిరసనలు చేపట్టినా ఫలితం లేకపోవడంతో హైకోర్టును ఆశ్రయించారు. న్యాయస్థానం మిత్రలకు అనుకూలంగా తీర్పు ఇవ్వడంతో తిరిగి రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అక్కడ కూడా మిత్రలకు అనుకూలంగానే తీర్పునిచ్చినా అవసరమైతే వారికి మెరుగైన శిక్షణనిచ్చి పరీక్ష నిర్వహించుకోమని ప్రస్తావించడంతో వాటిని ఆధారంగా చేసుకుని పరీక్షకు రంగం సిద్ధం చేసింది.
ఇంత కక్షా..
మొదటి నుంచి వైద్యమిత్రలపై టీడీపీ ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోం దనే విమర్శలు ఉన్నాయి. దీనిలో భాగంగానే వారికి ఇంగ్లిష్‌లో ఆన్‌లైన్ పరీక్ష నిర్వహించి ఎక్కడా లేనివిధంగా నూటికి 75 మార్కులు పాస్ మార్కులుగా నిర్ణయించింది. ఇలా పరీక్ష నిర్వహించాలని జిల్లా కో–ఆర్డినేటర్‌కు ఆదేశాలిచ్చింది. దీంతో వచ్చేనెల 13న జిల్లాలోని మిత్రలందరికీ రాజమండ్రిలో పరీక్షకు హాజరుకావాల్సిందిగా ఆదేశాలు జారీచేశారు. జిల్లావ్యాప్తంగా ఉన్న మిత్రలు మాత్రం పరీక్ష రాసేందుకు తాము సిద్ధంగా లేమని తిరిగి ఉద్యమబాట పడతామని, అవసరమైతే మరల న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని చెబుతున్నారు.
గతంలో 160.. ప్రస్తుతం 105
జిల్లాలోని నెట్‌వర్క్ ఆస్పత్రులు, ప్రభుత్వ ఆస్పత్రుల్లో నెట్‌వర్క్ మిత్రలు 40, పీహెచ్‌సీ మిత్రలు 65 మంది ఉన్నారు. గతంలో మొత్తం 160 మంది ఉండగా ప్రభుత్వ విధానాలతో విసుగెత్తి 55 మంది ఉద్యోగం వదలి వెళ్లిపోయారు. పదేళ్లుగా వైద్య మిత్రలుగా ఉన్న తాము ఈ వయసులో ఇప్పుడు కొత్త ఉద్యోగాన్ని ఎలా వెతుక్కోగలమని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మహానుభావుడు వైఎస్ రాజశేఖరరెడ్డి ఇచ్చిన కొలువు నుంచి ప్రస్తుత టీడీపీ ప్రభుత్వం తమను తొలగించాలని చూస్తోందని వారు ఆరోపిస్తున్నారు.
ఆందోళనలో వైద్యమిత్రలు
పరీక్ష రాయకపోతే తీసేస్తామంటున్నారు.. పరీక్ష రాస్తే 75 మార్కులు సాధించగలమా.. ఇది జిల్లాలో విధుల్లో ఉన్న వైద్య మిత్రల మధ్య తలెత్తిన సమస్య. కొందరు పరీక్షకు వెళ్లవద్దని భీష్మించుకున్నా మరికొందరు మాత్రం పరీక్షకు సిద్ధపడుతున్నట్లుగా తెలుస్తోంది. మొత్తానికి మిత్రలకు ఏం చేయాలో తెలియక ఆందోళనలో పడ్డారు. ప్రభుత్వ విధానాలకు తమ కుటుంబాలు రోడ్డున పడతాయని వాపోతున్నారు.
పరీక్షకు సిద్ధంగా లేము
ప్రభుత్వం అన్యాయంగా తమను తొలగించాలని కుట్ర పన్నుతోంది. పదేళ్లుగా ఈ ఉద్యోగంలో చాలీచాలని వేతనాలతో నెట్టుకొస్తున్నాం. ఎక్కడా లేని నిబంధనలు మాపై రుద్దేలా ఇంగ్లిష్‌లో నిర్వహించే ఆన్‌లైన్ పరీక్షలో నూటికి 75 మార్కులు వస్తే పాసయినట్లని చెబుతుండటం దారుణం. పరీక్ష రాసేందుకు మేం సిద్ధంగా లేము.– పీవీ దుర్గాప్రసాద్, వైద్య మిత్ర యూనియన్ జిల్లా అధ్యక్షుడు
మమ్మల్ని కొనసాగించాలి
2008లో ఆరోగ్య మిత్రల పోస్టుల కోసం మాకు ఇంటర్వ్యూలు నిర్వహించారు. తర్వాత ప్రత్యేక శిక్షణనిచ్చి పరీక్ష నిర్వహించి మమ్మల్ని ఎంపిక చేశారు. అప్పటి నుంచి వైద్యసేవల్లో ఉన్నాం. ప్రభుత్వం మమ్మల్ని అన్యాయం చేయకుండా ప్రస్తుత విధానాలకు ఏదైనా శిక్షణ అవసరమైతే ఇప్పించి మమ్మల్ని కొనసాగించాలి.– ఎం.దుర్గాభవాని, వైద్య మిత్ర, తణుకు
ప్రభుత్వ ఆదేశాలమేరకు పరీక్ష
వైద్య మిత్రలను కొనసాగించేందుకు ప్రభుత్వం ఆన్‌లైన్ పరీక్ష రాజమండ్రిలో నిర్వహించాలని ఆదేశాలు ఇచ్చింది. ప్రస్తుతం వారి విధులకు సంబంధించి సబ్జెక్టులో నిర్వహించే ఆన్‌లైన్ పరీక్షలో 75 మార్కులు వచ్చిన వారిని కొనసాగించాలని ఆదేశాలు ఉన్నాయి. జిల్లాలోని 105 మంది ఈ పరీక్షకు హాజరు కావాల్సి ఉంది.– డాక్టర్ అవినాష్, ఎన్టీఆర్‌వైద్యసేవ, జిల్లా కో–ఆర్డినేటర్, ఏలూరు
Comments
Please login to add a commentAdd a comment