రెచ్చిపోయిన టీడీపీ వర్గీయులు | Enraged, the plot News | Sakshi
Sakshi News home page

రెచ్చిపోయిన టీడీపీ వర్గీయులు

Published Mon, Mar 23 2015 3:06 AM | Last Updated on Fri, Aug 10 2018 8:35 PM

Enraged, the plot News

లింగాల : లింగాల మండలం దొండ్లవాగు గ్రామంలో టీడీపీ వర్గీయులు రెచ్చిపోయారు. తప్పతాగి వైఎస్‌ఆర్ సీపీ కార్యకర్తలపై వేటకొడవళ్లు, కర్రలతో దాడులకు పాల్పడ్డారు. వివరాలలోకి వెళితే.. దొండ్లవాగు గ్రామంలో కాపురం ఉంటున్న తలుపుల మండలం గొందిపల్లె గ్రామానికి చెందిన నాగిరెడ్డి ఉగాది పార్నను పురస్కరించుకొని విందు భోజనాలు ఏర్పాటు చేశారు. ఈ విందు భోజనాలలో వైఎస్‌ఆర్ సీపీ నాయకులు పాల్గొన్నారు. గ్రామ సర్పంచ్ లక్ష్మికాంతమ్మ కుమారుడు రాజశేఖరరెడ్డి కూడా పాల్గొన్నారు. దీన్ని జీర్ణించుకోలేని టీడీపీ కార్యకర్తలు తప్పతాగి నాగిరెడ్డి ఇంటి వద్దకు వెళ్లి  వైఎస్‌ఆర్ సీపీ కార్యకర్తలపై వేటకొడవళ్లు, కర్రలతో దాడులకు పాల్పడ్డారు.

ఈ దాడులలో చవ్వా రాజశేఖరరెడ్డి తీవ్రంగా గాయపడ్డారు. దీంతో అక్కడే ఉన్న వైఎస్‌ఆర్ సీపీ కార్యకర్తలు టీడీపీ కార్యకర్తలపై తిరగబడ్డారు. ఈ సంఘటనలో చప్పిడి రామకృష్ణారెడ్డికి స్వల్ప గాయాలయ్యాయి. మరికొంతమంది టీడీపీ కార్యకర్తలు తీవ్రంగా గాయపడ్డారు. వీరిని పులి వెందుల ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్సలు అందించారు. ఎస్‌ఐ కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. చప్పిడి రామకృష్ణారెడ్డి తన ఇంటి వద్ద అరుగుపై కూర్చొండగా వైఎస్‌ఆర్ సీపీ కార్యకర్తలు రామకృష్ణారెడ్డి, గంగాధరరెడ్డి, పురుషోత్తమరెడ్డిలతోపాటు మరో 7మంది తమను తీవ్రంగా చూశారని.. ఎందుకు అలా చూస్తున్నారని ప్రశ్నించగా.. తనపై దాడి చేశారని చప్పిడి రామకృష్ణారెడ్డి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.

అదేవిధంగా చవ్వా రాజశేఖరరెడ్డి తాము నాగిరెడ్డి ఇంట్లో విందు భోజనాలు చేస్తుండగా తమపై టీడీపీ కార్యకర్తలు దాడులు చేశారని.. టీడీపీ కార్యకర్తల ఇళ్లు ఈ వీధిలో లేవని.. ఎక్కడ నుంచో వచ్చి తమపై ఉద్దేశపూర్వకంగా దాడులు చేశారని ఫిర్యాదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు. 9మంది వైఎస్‌ఆర్ సీపీ కార్యకర్తలపై, 6మంది టీడీపీ కార్యకర్తలపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ తిమ్మారెడ్డి తెలిపారు.
 
రాజశేఖరరెడ్డిని పరామర్శించిన వైఎస్‌ఆర్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి :
తీవ్రంగా గాయపడ్డ వైఎస్‌ఆర్ సీపీ కార్యకర్త రాజశేఖరరెడ్డిని ఆదివారం సాయంత్రం వైఎస్‌ఆర్ సీపీ రాష్ట్ర కార్యదర్శి దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి పరామర్శించారు. పులివెందులలోని ఆయన ఇంటి వద్దకు వెళ్లి రాజశేఖరరెడ్డి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. దాడులు, ప్రతిదాడులపై విచారణ జరిపించాలని ఆయన పోలీసులను కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement