రాజధాని నిర్మాణానికి సెంటు భూమి కూడా ఇవ్వం
- బలవంతంగా లాక్కుంటే దేనికైనా సిద్ధం
- అధికారుల ఎదుటే పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నం
- మహిళా రైతు పాములపాటి జయమ్మ ఝలక్
- కంగుతిన్న అధికారులు, పోలీసులు
- మాట్లాడకుండానే వెళ్లిపోయిన ఆర్డీవో భాస్కర్ నాయుడు
నిడమర్రు(మంగళగిరి రూరల్) : రాజధాని నిర్మాణానికి ఏడాదికి మూడు పంటలు పండే సారవంతమైన పంట భూములు తీసుకుంటాం... అని చంద్రబాబు చెబుతున్నారు. అసలు భూమి ఎవరిది? రైతులదా? చంద్రబాబుదా? మంత్రులదా? అధికారులదా? ఎవరిది ? మాది... మేము ఇస్తేనే మీకు భిక్ష. భూములు లాక్కొని శవాలకు వేసుకుని కట్టుకుంటారా? మాకు మలేషియా వద్దు... సింగపూర్‌లు వద్దు... మా గ్రామం మాకు ఉంటే చాలంటూ ఒకరు... ల్యాండ్ ఫూలింగ్‌తో బలవంతంగా భూములు లాక్కుంటే ఆత్మహత్యలకైనా సిద్ధమని మరొక మహిళా రైతు అధికారులకు, పోలీసులకు ఝలక్ ఇచ్చారు.
మండలంలోని నిడమర్రు పంచాయతీ కార్యాలయం వద్ద సోమవారం తహశీల్దార్ సీహెచ్ కృష్ణమూర్తి అధ్యక్షతన రెవెన్యూ సదస్సు నిర్వహించారు. తమ పంట భూములను ప్రభుత్వం బల వంతంగా లాక్కోవాలని చూస్తే ఆత్మహత్యలకైనా సిద్ధమని మహిళా రైతు పాములపాటి జయమ్మ పురుగు మందు డబ్బా తీసుకుని ఒక్కసారిగా అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతకుముందు తహశీల్దార్ మాట్లాడుతూ నవ్యాంధ్ర రాజధాని నిర్మాణానికి ప్రభుత్వం ల్యాండ్ ఫూలింగ్ ద్వారా భూములను తీసుకోనుందని, దీనిపై గ్రామ రైతులు తమ అభిప్రాయాలను, సూచనలను తీసుకుని ప్రభుత్వానికి పంపుతామని చెప్పారు.
ఎంపీటీసీ మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ అసలు రాజధాని నిర్మాణానికి ఎన్ని ఎకరాల భూములు అవసరమవుతాయో ప్రభుత్వం స్పష్టంగా తెలియజేయాలని, ఎక్కడెక్కడ ఏయే నిర్మాణాలు చేపడతారో ముందుగానే ప్రకటించాలని డిమాండ్ చేశారు. రాజధాని ఏర్పాటుకు భూములను ఇచ్చేదిలేదంటూ పంచాయతీ తీర్మానం చేశామని ఆయన అధికారుల దృష్టికి తీసుకువచ్చారు.
ఎంపీటీసీ కొదమకొండ్ల నాగరత్నం మాట్లాడుతూ ఒకవేళ ప్రభుత్వం ల్యాండ్ ఫూలింగ్ ద్వారా భూమిని తీసుకోవాలనుకుంటే ప్రతి రైతు కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని, ఎకరానికి 1250 గజాల స్థలాన్ని కేటాయించాలని సూచించారు. రైతు ఉయ్యూరు వెంకటరెడ్డి మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే)ను రాజధాని కమిటీలో నియమించకుండా సీఎం చంద్రబాబు రాజకీయం చేస్తూ రైతులను మోసగించాలని ప్రయత్నిస్తున్నారన్నారు.
పోలీస్ పహారాలో సమావేశం...
నవ్యాంధ్ర రాజధాని నిర్మాణానికి ప్రభుత్వం ల్యాండ్ పూలింగ్ విధానం ద్వారా భూములను తీసుకునేందుకు సోమవారం నిడమర్రులో ఏర్పాటు చేసిన రెవెన్యూ సదస్సు ఆద్యంతం పోలీసుల పహారాలోనే సాగింది. అంతకుముందు డీఎస్పీ మధుసూదనరావు, రూరల్ సీఐ హరికృష్ణ, రూరల్‌ఎస్‌ఐ అంకమ్మరావు, తాడేపల్లి ఎస్‌ఐ నరేష్‌కుమార్ సదస్సు వద్దకు చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.
మహిళా రైతు పాములపాటి జయమ్మ ఒక్కసారిగా పురుగుల మందు డబ్బా తీసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడడంతో రైతులకు, అధికారులకు మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో ఆర్డీవో భాస్కర్ నాయుడు ఒక్కమాట కూడా మాట్లాడకుండానే కారు ఎక్కి వెళ్లిపోయారు. అనంతరం పోలీసులు రైతులకు సర్ది చెప్పి పంపివేశారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మండెపూడి మణెమ్మ, ఎంపీపీ పచ్చల రత్నకుమారి, ఉప సర్పంచ్ గాదె సాగర్‌రెడ్డి, పంచాయతీ మెంబర్లు పాల్గొన్నారు.