తాడేపల్లి రూరల్ : ‘‘నా కన్నబిడ్డలు వస్తారు. నన్ను ఇంటికి తీసుకువెళతారు. ఇప్పుడే వస్తామని చెప్పి వెళ్లారు. నేను ఇక్కడే ఉంటా. లేదంటే నా బిడ్డలు కంగారు పడతారు. చలి గాలైనా పర్వాలేదు. నా కుమారులు వచ్చే వరకు నేను కదలను.’’ అంటూ ఓ అమాయక తల్లి తన కన్న బిడ్డల రాక కోసం ఆశగా ఎదురు చూస్తోంది. చలిగాలులకు వణుకుతూ రోడ్డుపైనే కళ్లల్లో వత్తులు వేసుకుని చూడసాగింది. కనికరం లేకుండా తనను వదిలించుకు పోయారని గ్రహించలేకపోయింది.
కనిపెంచిన బంధాన్నే తెంచుకుపోయారని గుర్తించేందుకు అమ్మ మనసు అంగీకరించ లేకపోతోంది. వివరాల్లోకి వెళితే..కొద్ది రోజుల కిందట సుమారు 70 ఏళ్ల వృద్ధురాలిని కొందరు తాడేపల్లి మండలం ఉండవల్లి సెంటరులో వదిలి వెళ్లారు. రాత్రిళ్లు చలిగాలులకు వృద్ధురాలు పడుతున్న ఇబ్బందులు గమనించిన స్థానికులు ఆమెకు దుప్పటి ఇచ్చి సెంటర్‌లోని పోలీస్ ఐలాండ్‌లో ఉంచి పోలీసులకు కూడా సమాచారం అందించారు.
దీనిపై ఎస్‌ఐ వినోద్‌కుమార్ స్పందించి ఆమెను డోలాస్‌నగర్‌లోని మేయర్స్ హోం అనే స్వచ్ఛంద సంస్థలో చేర్చేందుకు ఏర్పాట్లు చేశారు. అయితే ఆ వృద్ధురాలు అక్కడ నుంచి కదిలేందుకు ససేమిరా అంటూ భీష్మించుకు కూర్చుంది. తన కుమారులు ఇక్కడ విడిచి వెళ్లారని వారు వచ్చి తీసుకువెళతారని కన్నబిడ్డలపై మమకారాన్ని చూపుతోంది. తన పేరు అప్పల నరసమ్మ అని, ఊరు తూర్పు గోదావరి జిల్లా అని చెబుతున్న ఆ వృద్ధురాలిని అతికష్టం మీద పోలీసులు ఆదివారం రాత్రి మేయర్స్ హోమ్‌కు తరలించారు.
కన్న బిడ్డల కోసం కళ్లల్లో వత్తులు వేసుకుని..
Published Mon, Dec 15 2014 1:49 AM | Last Updated on Tue, Aug 21 2018 5:46 PM
Advertisement